అన్ని పండగలకు ప్రభుత్వ ప్రోత్సాహం
నల్లగొండ కల్చరల్ :తెలంగాణలో పూర్తి సెక్యులర్ భావాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని విద్యాశాఖమంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మునుగోడు రోడ్డులో గల ఈద్గా వద్ద నిర్వహించిన ఈదుల్ ఫితర్ పండగ ప్రార్థనలలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనలకనుగుణంగా మతసామరస్యానికి ప్రతీకగా.. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా రూపొందిస్తామన్నారు. తెలంగాణలో జరిగే అన్ని పండగలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ముస్లింలకు ప్రకటించిన 12శాతం రిజర్వేషన్లు వెం టనే అమలు చేయాలన్నారు. కనీస అవసరాలైన కూడు, గుడ్డ, నీడ అందజేయాలన్నారు.
వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు మత పెద్ద మౌలానా ఎహసానొద్దీనన్ రంజాన్ ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనాలు చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్సీ రవీందర్, శాసనసభ్యుడు గాదరి కిషోర్, జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు, ఎస్పీ టి.ప్రభాకర్‌రావు, ముస్లిం మత పెద్దలు ఎంఏ.బేగ్, టీఆర్‌ఎస్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఫరీదొద్దీన్, జమాల్‌ఖాద్రీ, ఎంఐఎం అధ్యక్షుడు అహ్మద్ ఖలీమ్, రజియోద్దీన్, చాంద్‌పాషా, ఎండీ.సలీమ్, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, చినవెంకట్‌రెడ్డి, దుబ్బాక నర్సిం హారెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.