కేజీబీవీల్లోవసతులు కల్పించాలి
–విద్యార్థులకు మంచి బోధన కల్పించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదే
–తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయెుద్దు
–కలెక్టర్ సత్యనారాయణరెడ్డి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్, పాల్గొన్న అధికారులు
నల్లగొండ : జిల్లాలోని కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సౌకర్యాలన్నీ కల్పించాలని కలెక్టర్ పి.సత్యనారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని 46 కస్తూరిబాగాంధీ ఆశ్రమ పాఠశాలలు ఉండగా వాటిలో కొన్నింటికీ తలుపులు, కిటికీలు సరిగా లేవన్నారు. వెంటనే వాటిని బిగించాలని సూచించారు. 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు స్పెషల్ ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికతో విద్యార్థులను తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో నమ్మకంతో ఆశ్రమ పాఠశాలల్లో చేర్చిస్తున్నారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లదేనన్నారు. విద్యార్థులకు మంచి బోధన అందేలా చూడాలన్నారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు పేద విద్యార్థుల విద్య కోసం ఖర్చు చేస్తుందని, దాని ప్రతిఫలంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు.ఉపాధ్యాయులు కొరత ఉన్నట్లయితే గెస్ట్ టీచర్లను నియమించుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, ప్రహరీలు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు ఉండే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్పెషల్ ఆఫీసర్లు విద్యార్థులకు అందుబాటులో ఉండాలన్నారు. సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, డీఈఓ చంద్రమోహన్, సర్వశిక్షా అభియాన్ పీడీ కిరణ్‌కుమార్, కస్తూరిబా గాంధీ ఆశ్రమ పాఠశాలల స్పెషల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.