పుష్కరఘాట్లలో వసతులు కల్పించాలి
రాంనగర్ : కష్ణా పుష్కర ఘాట్లలో భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతి సౌకర్యాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పుష్కర ఘాట్ల వద్ద మంచి నీరు, విద్యుత్ సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణం, కల్పించడంతో పాటు ఘాట్ నుంచి నదిలోనికి వెళ్లకుండా పెన్షింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే దుస్తులు మార్చుకునే గదులు, దుస్తులు తగిలించుకునేందుకు అనువుగా కొక్కాలు తదితర మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను ఎప్పటికప్పుడు ఫొటోలతో సహా తెలియజేయాలని ఆదేశించారు. పుష్కరఘాట్లలో ఏ సమయంలోనైనా తనిఖీలు నిర్వహిస్తామని, పనుల్లో లేని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ యన్.సత్యనారాయణ, డీఆర్వో రవి, ఘాట్ ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.