సాక్షి, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న దేశంలోనే తొలిసారిగా ‘నేతన్నకు బీమా’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రకటించారు. రైతు బీమా తరహాలో 60 ఏళ్లలోపు వయసున్న నేత కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా తెలంగాణలో 80 వేల మంది చేనేత కార్మికులకు లబ్ధి కలుగుతుందన్నారు. నేతన్నకు బీమా పథకం ప్రారంభ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు. ఈ సమావేశంలో చేనేత, జౌళి, పరిశ్రమల విభాగం కార్యదర్శి బుద్ధప్రకాశ్‌తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఈ పథకం వివరాలను ఇప్పటికే క్షేత్రస్థాయిలో చేనేత కార్మికులకు వివరించడం మొదలుపెట్టినట్లు అధికారులు కేటీఆర్‌కు చెప్పారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ చేనేత, మరమగ్గాలపై ఆధారపడిన కార్మికుల కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు బీమా పథకాన్ని అమలు చేయబోతున్నామని, లబ్ధిదారులు ఏదైనా కారణంతో మరణిస్తే 10 రోజుల్లో వారి కుటుంబ సభ్యుల ఖాతాలో రూ. 5 లక్షలు జమ చేస్తామన్నారు.
చేనేత, జౌళి విభాగంఈ పథకం అమల్లో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని, ఈ పథకం అమలు కోసం ఎల్‌ఐసీతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. బీమా వార్షిక ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుందని, నేత కార్మికులు ఎలాంటి వాటా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ పథకం అమలు కోసం సుమారు రూ. 50 కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 25 కోట్లు విడుదల చేశామన్నారు. అర్హులైన చేనేత, మరమగ్గాల కార్మికులకు ప్రయోజనం కలిగేలా ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ చెప్పారు.
బీసీ సంక్షేమ శాఖ పద్దు నుంచి రూ. 1,200 కోట్లు
గతంలో ఎన్నడూలేని రీతిలో 2016–17 వార్షిక బడ్జెట్ నుంచే చేనేత జౌళి విభాగానికి రూ. 1,200 కోట్లు కేటాయిస్తున్నామని, ఇది సాధారణ బడ్జెట్‌కు అదనమని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2022–23 బడ్జెట్‌లో సాధారణ పద్దు కింద రూ. 55.12 కోట్ల (బీమా కోసం కేటాయింపు)తోపాటు స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో రూ. 400 కోట్లు (ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు) కేటాయించామన్నారు. నేత కార్మికుల సంక్షేమం, ఉపాధి కోసం చేనేత మిత్ర, నేతన్నకు చేయూత, రుణమాఫీ, బతుకమ్మ చీరల తయారీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.
చేనేత మిత్ర ద్వారా ఇప్పటివరకు 20,501 మంది లబ్ధిదారులకు రూ. 24.09 కోట్ల సబ్సిడీని నేరుగా నేత కార్మికుల ఖాతాల్లో వేశామన్నారు. నేత కార్మికుల త్రిఫ్ట్ ఫండ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను 16 శాతానికి పెంచామని, ప్రస్తుతం ఈ పథకంలో 32,328 మంది చేనేత కార్మికులు చేరినట్లు కేటీఆర్ వివరించారు. రుణమాఫీ పథకం ద్వారా 10,148 చేనేత కార్మికులకు చెందిన రూ. 28.97 కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. బతుకమ్మ చీరల తయారీలో భాగంగా ఏటా కోటి చీరలు తయారు చేయించడం ద్వారా యూనిట్ యజమానులు, మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు. టెస్కోలో ఏర్పాటు చేసిన పరిశోధన, అభివృద్ధి విభాగం ద్వారా చేనేత రంగంలో కొత్త డిజైన్లు, వస్త్రోత్పత్తిపై పరిశోధనలు, మార్కెటింగ్‌పై అధ్యయనం జరుగుతోందని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి అమలవుతున్న కార్యక్రమాలను ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్ అధికారుల బృందాలు అధ్యయనం చేసినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు
Comments
Please login to add a commentAdd a comment