సాక్షి, హైదరాబాద్: మహిళాభ్యున్నతి, ఆడపడుచుల ఆత్మ గౌరవాన్ని ఇనుమడింప జేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెద్దన్నగా ఎల్లవేళలా అండగా నిలుస్తున్నారని రాష్ట్ర పుర పాలక శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. ప్రతి మహిళకు ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు అవసరమైన భరోసా కల్పించారని అన్నారు. అందువల్ల రాఖీ పండుగ సందర్భంగా ఆడబిడ్డలంతా కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టాలని కోరారు. రాఖీ పండుగను పురస్కరించుకొని 33 జిల్లాల్లోని వివిధ ప్రభుత్వ పథకాల మహిళా లబ్ధిదారులతో గురువారం కేటీఆర్ జూమ్‌లో మాట్లాడారు.
రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషిని వివరించారు. సుసంపన్నమైన సమాజ నిర్మాణ రూపకర్తలు స్త్రీలే అని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఒక్క ఆడబిడ్డ బాగుంటే మొత్తం కుటుంబం, సమాజం బావుంటుందన్న లక్ష్యంతోనే మహిళా సంక్షేమాన్ని కర్తవ్యంగా భావించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ హయాంలో పెన్షన్ పదిరెట్లు పెరిగిందని, 14 లక్షల మంది ఒంటరి, వితంతు మహిళలతో పాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుంచి అర్హులైన మరో 10 లక్షల మంది కొత్తవారికి రూ.2,016 చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నామన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి
మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని నమ్ము తున్న ప్రభుత్వం మాది. దేశంలో మరెక్కడా లేని విధంగా మహిళల కోసం అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఉద్యమకాలం నుంచి తమకు అండగా ఉన్న మహిళల ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. శిశువులు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి స్త్రీ కి అండగా ఉండి వారి అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములుగా ఉన్నాం. అమ్మ ఒడి పథకంలో భాగంగా గర్భిణుల కోసం ప్రత్యేకంగా 300 ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం ఇది. మాతాశిశు మరణాల తగ్గింపులో దేశం మొత్తంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేంద్ర ప్రభుత్వమే మెచ్చుకుంది.
అన్ని విధాలా అండగా..: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా కల్యాణలక్ష్మి–షాదీ ముబా రక్ పథకంలో భాగంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలను కట్నంగా ఇస్తున్నాం. ఆరోగ్యలక్ష్మి కింద 5,18,215 మంది శిశువులకు, 21,58,479 మంది గర్భి ణులకు, 18,96,844 మంది పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. రాష్ట్రంలో 4 లక్షల స్వయం సహాయక బృందాలకు ప్రభుత్వం నిరంతరం మద్దతు అందిస్తోంది. అంగన్‌వాడీ కార్యకర్తల జీతాలను పెంచింది. మిషన్ భగీరథతో ఆడబిడ్డల నీటి కష్టాలను పూర్తిగా తొలగించాం. మహిళలకు అత్యంత సురక్షి తమైన రాష్ట్రంగా తెలంగాణను నిలిపేందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.
చదవండి: రాష్ట్రంపై కేంద్రం నిందలను తిప్పికొడదాం.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment