బాధితులా..? నిందితులా..? విచిత్రమైన ట్విస్ట్‌ | New Twist In The Bogus Hawala Case | Sakshi
Sakshi News home page

బాధితులా..? నిందితులా..? విచిత్రమైన ట్విస్ట్‌

Published Fri, Feb 3 2023 8:10 AM | Last Updated on Fri, Feb 3 2023 11:13 AM

New Twist In The Bogus Hawala Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘బోగస్‌’ కరెన్సీతో హవాలా వ్యాపారం చేసిన కోల్‌కతాలో స్థిరపడిన రాజస్థాన్‌ గ్యాంగ్‌ చేతిలో మోసపోయిన నగర వ్యాపారులు మహ్మద్‌ యూనుస్, వెంకట శర్మ విషయంలో నగర పోలీసులకు కొత్త సందేహాలు వస్తున్నాయి. ఈ ఎపిసోడ్‌లో వీళ్లను బాధితులుగా భావించాలా..? నిందితులుగా పరిగణించాలా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. అక్రమద్రవ్య మార్పిడికి పాల్పడటం, పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయడం వంటి చర్యల కారణంగా అధికారులు చట్ట ప్రకా రం తదుపరి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.  

భారీ మొత్తం నగదు రూపంలో... 
డీమానిటైజేషన్‌ తర్వాత అమలులోకి వచ్చిన నిబంధనల ప్రకారం ఏ లావాదేవీలో అయినా రూ.2 లక్షలకు మించి నగదు రూపంలో మార్పిడి జరగకూడదు. ఆదాయపు పన్ను శాఖ సాధారణ ప్రజల కంటే వ్యాపారుల విషయంలో దీన్ని నిశితంగా గమనిస్తుంటుంది. ఈ కేసులో బాధితులుగా ఉన్న వారిలో మహ్మద్‌ యూనుస్‌ నాంపల్లిలోని మెజిస్టిక్‌ హోటల్‌లో భాగస్వామిగా ఉండగా, వెంకట్‌ శర్మ మాదాపూర్‌లో ఐకాన్‌ టెక్నాలజీస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలను నిర్వహిస్తున్నారు. వీరిని కన్హయ్య లాల్‌ నేతృత్వంలోని బృందం గతేడాది డిసెంబర్‌ 24, 26 తేదీల్లో మోసం చేసి రూ.30 లక్షలు, రూ.50 లక్షలు చొప్పున కాజేసింది. వ్యాపారులు ఈ స్థాయిలో నగలు లావాదేవీలు చేయడం నిబంధనలకు విరుద్ధం.  

అప్పు పేరుతో తప్పుడు ఫిర్యాదు... 
కన్హయ్య లాల్‌ గ్యాంగ్‌ చేతిలో మోసపోయిన ఈ ద్వయం నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ సందర్భంలో ఎక్కడా కూడా హవాలా దందా విషయం పేర్కొనలేదు. కన్హయ్య లాల్, రామావతార్, భరత్‌కుమార్, రామకృష్ణ శర్మలు తమ నుంచి అప్పుగా డబ్బు తీసుకోవడం కొన్నాళ్లుగా సాగుతోందని పేర్కొన్నారు. కొన్ని రోజుల అవసరానికి వాడుకుని ఆపై తిరిగి ఇస్తుంటారని, గతేడాది డిసెంబర్‌లో ఇలానే రూ.80 లక్షలు తీసుకుని నకిలీ నోట్లు ఇచ్చారని తప్పుడు ఫిర్యాదు చేశారు.

దీంతో ఇవే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి. నిందితులను పట్టుకుని, విచారించిన తర్వాతే పోలీసులకు అసలు విషయం తెలిసింది. భారీ మొత్తం నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంది. పోలీసులకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదు చేసినందుకు కోర్టు అనుమతితో ఇరువురిపై ఐపీసీలోని 182 సెక్షన్‌ ప్రకారం కేసు నమోదుకు ఆస్కారం ఉంది. ఈ అంశాలపై ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నారు. 

తెలివిగా వ్యవహరించిన నిందితులు... 
ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న కన్హయ్య లాల్‌ సహా నలుగురు చాలా తెలివిగా వ్యవహరించారు. నగర వ్యాపారులను మోసం చేయాలని పథకం వేసుకున్న వీళ్లు దాని కోసం నకిలీ కరెన్సీ తయారు చేయలేదు. అలా చేస్తే ఈ కేసులు ఐపీసీలోని 489 సెక్షన్‌ కింద నమోదవుతాయి. దాంతో తీవ్రత పెరిగిపోవడంతో పాటు గరిష్టంగా పదేళ్ల శిక్షపడే అవకాశం ఉంది.

ఈ విషయం తెలిసిన నలుగురూ నకిలీ కరెన్సీకి బదులు ‘బోగస్‌’ది తయారు చేశారు. కలర్‌ జిరాక్సు తీసిన రూ.2 వేలు, రూ.500 నోట్లను కరెన్సీ సైజులో కట్‌ చేసిన తెల్లకాగితాలకు అటు–ఇటు పెట్టారు. మధ్యలో ఉన్న కాగితాలకు కనిపించే చివర్లలో మాత్రం కరెన్సీ రంగు పూశారు. ఈ కారణంగానే కేసులు కేవలం ఐపీసీలోని 420 (మోసం) సెక్షన్‌ కింద నమోదయ్యాయి. దీని తీవ్రత తక్కువ కావడంతో పాటు నేరం నిరూపితమైనా శిక్ష ఏడేళ్ల వరకే ఉంటుంది. ఫలితంగా బెయిల్‌ తర్వగా లభిస్తుంది.  

(చదవండి:  నాకిప్పుడే పెళ్లి వద్దు సార్‌ అంటూ పోలీసులకు వీడియో.. పెళ్లిలో ట్విస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement