ఆందోళన చేస్తున్న నిమ్స్ కాంట్రాక్టు ఉద్యోగులు (ఫైల్)
లక్డీకాపూల్ : నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వేతనాలు పెరిగాయి. దీంతో దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు లబ్ది పొందనున్నారు. ఒక్కో కాంట్రాక్ట్ ఉద్యోగికి రూ. 4 నుంచి 6వేల వరకు జీతం పెరిగింది. దీని వల్ల యాజమాన్యానికి రూ. కోటికి పైగా ఆదనపు భారం పడుతోంది. పెంచిన వేతనాలను ఏప్రిల్ నెల నుంచి అమలు పరుస్తున్నట్లు నిమ్స్ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత జులై నెలకు సంబంధించి జీతాలను చెల్లించనున్నారు. వేతన పెంపును వెంటనే అమలు చేయాలని గత నెల5 నుంచి అన్ని విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులు సంఘటిత పోరాటం చేపట్టారు. వేతనాలు పెంచేంత వరకు వెనక్కి తగ్గేది లేదని యాజమాన్యానికి ముందుగానే ఆల్టిమేటం ఇచ్చారు.
సమ్మె నోటీసు ఇచ్చిన 9వ రోజు నుంచి ఆందోళనకు దిగారు. ఇందుకు నిమ్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, నిమ్స్ కాంట్రాక్ట్ నర్సుల యూనియన్, తెలంగాణ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్, నిమ్స్ కాంట్రాక్ట్ టెక్నీషియన్ ఎంప్లాయీస్ యూనియన్లతో ఏర్పడిన జేఏసీ జూన్ 28న నిమ్స్ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. వేతనాలు పెంచేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు ఆమోదం తెలిపినన్పటికీ ఏడాదిగా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్–19 విజృంభిస్తున్న తరుణంలో గాంధీ ఆస్పత్రిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్‌కు రూ.28వేలు చొప్పున వేతనం చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్ పెంచిన వేతనాలను చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేశారు.
పెరిగిన వేతనాలు ఇలా..
నిమ్స్‌లో పని చేస్తున్న 400 మంది కాంట్రాక్ట్ నర్సులకు ఇక నుంచి రూ.25వేలు చొప్పున వేతనాలు అందుకోనున్నారు. ఇప్పటి వరకు వారికి రూ. 17వేలు చెల్లిస్తున్నారు. 300 మంది టెక్నికల్, నాన్ టెక్నికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కూడా రూ.25 వేలు చొప్పున చెల్లించనున్నారు. ఇప్పటి వరకు వీరు రూ. 18వేలు చొప్పున వేతనాలు పొందుతున్నారు. 150 మంది ఒజేటీ( ఆన్ జాబ్‌టైనీస్) బేసిడ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ. 25వేలు చొప్పున చెల్లిస్తారు. సెమిస్కిల్డ్ ఔట్‌సోర్స్ ఉద్యోగులు 350 మందికి రూ. 24,600 చొప్పున వేతనం అందుకోనున్నారు. వాస్తవానికి వీరికి రోజువారీ వేతనం రూ. 840.62 చెల్లిస్తున్నారు. తాజా ఉత్తర్వులతో ఈ మొత్తం రూ. 1102.79లకు పెరిగింది. అన్‌స్కిల్డ్ కార్మికుల వేతనాలను రూ. 12 వేల నుంచి రూ. 14,717 పెంచారు. అవుట్‌సోర్స్ కాంట్రాక్ట్ విధానంలో పని చేసే వీరికి జీవో నెం.14, 108లు ప్రకారం రోజువారీ వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ ప్రకారం జీవో నెం.14 కింద కార్మికులకు రోజుకు రూ. 551.71 నుంచి రూ. 681.55కి, జీవో నెం.108 కింద రూ. 558.46ల నుంచి రూ. 681.55కి పెరిగింది. వీళ్లకు 26 రోజుల చొప్పున వేతనాల చెల్లించనున్నారు. వేతనాలు పెరగడంతో నిమ్స్ కాంట్రాక్ట్, అవుట్ సోర్స్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment