సాక్షి, విజయవాడ/ నిజామాబాద్: అప్పులు, అధిక వడ్డీలు భరించలేక నిజామాబాద్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన కేసులో సూసైడ్ లెటర్ వెలుగులోకి వచ్చింది. 'మా కుటుంబం చావుకు ఆ నలుగురే కారణమంటూ.. గణేష్‌కుమార్, వినీత, చంద్రశేఖర్, సాయి రామ మనోహర్ పేర్లను సూసైడ్ లెటర్‌లో రాశారు. మా కుటుంబం చావుకు కారణమైన ఈ నలుగురిని కఠినంగా శిక్షించాలంటూ లేఖలో పేర్కొన్నారు.
చదవండి: (వివాహమైనా తమ కళ్లెదుటే ఉండాలనుకున్నారు.. కానీ..)
ఇదిలా ఉండగా, ఘటనపై మృతుడు సురేష్ బావమరిది రాంప్రసాద్ మాట్లాడుతూ.. మా అక్క, బావ, ఇద్దరు కుమారులు సూసైడ్ చేసుకోవడానికి ఆ నలుగురే కారణం. వారి వడ్డీ వేధింపుల వలనే విజయవాడ వచ్చి సూసైడ్ చేసుకున్నారు. ఆ నలుగురు అధిక వడ్డీలు వసూలు చేశారు. డబ్బులు కట్టకపోతే అంతుచూస్తామని బెదిరించారు. సూసైడ్‌నోట్‌లో ఇదే విషయాన్ని రాశారు. వాళ్లు చనిపోయేముందు కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. మొత్తం సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఆ నలుగురి వివరాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. వారిని కఠినంగా శిక్షించాలి' అని రాంప్రసాద్ అన్నారు.
చదవండి: (రుణాలు తీర్చలేక.. చావే శరణ్యమని..)
కాగా, నిజామాబాద్ గంగాస్థాన్ ఫేజ్–2లో నివాసం ఉంటున్న పప్పుల సురేశ్ (51), భార్య శ్రీలత (48), కుమారులు అఖిల్ (28), అశిష్ (24) ఈనెల 6న విజయవాడకు వచ్చారు. అఖిల్ పేరుతో సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయవాడ బ్రాహ్మణవీధిలోని ఒక ప్రైవేట్ సత్రంలో రూమ్ తీసుకున్నారు. వారంతా శుక్రవారం దుర్గమ్మను దర్శించుకున్నారు. కాగా, అర్ధరాత్రి దాటాక సురేశ్ కుటుంబ సభ్యులు తమ బంధువులకు.. తాము చనిపోతున్నట్లు వాయిస్ మెసేజ్ పంపించారు. దాంతో శ్రీలత సోదరుడు విజయవాడలో తమకు తెలిసిన వారికి ఫోన్లు చేసి సత్రం ఫోన్ నంబర్ కనుగొన్నారు.
శనివారం ఉదయం ఆరున్నర గంటలకు సత్రానికి ఫోన్ చేసి తమ బంధువులు సత్రంలో బస చేశారని, వారు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మెసేజ్ పెట్టారని, తక్షణం వారిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సత్రం గుమాస్తా ఆ గదికి వెళ్లి చూసేసరికి తల్లి, కుమారుడు విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సత్రం అధ్యక్షుడు పోలీసులకు సమాచారమిచ్చారు. అదే సమయంలో ప్రకాశం బ్యారేజీలో తండ్రీ, కొడుకుల మృతదేహాలు కనుగొన్నారు. వారి వద్ద ఉన్న ఆధారాలను బట్టి వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రస్తుతం గణేష్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment