సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రుణ మాఫీ పథకాలకు నిధుల విడుదల, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) మంజూరుకు అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయంవెలువడాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ చెప్పారు. తమను ఈసీ కోరిన వివరణలను పంపించామని తెలిపారు. గురువారం బీఆర్‌కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఓటరు గుర్తింపు కార్డులు, స్లిప్పుల పంపిణీ
‘ఈ ఏడాది 51 లక్షల ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించామని, పోస్టు ద్వారా వీటి పంపిణీ చివరి దశకు చేరుకుంది. గురువారం నాటికి 86 శాతం అనగా 2.81 కోట్ల ఓటర్లకు ఓటరు ఇన్‌ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేశాం. శనివారంలోగా మిగిలిన స్లిప్పుల పంపిణీ పూర్తి చేస్తాం. ఓటర్లకు అవగాహన కోసం ఓటర్ గైడ్ బుక్, సీ–విజిల్‌పై కరత్రాలను సైతం పంపిణీ చేశాం. 4,70,287 పోస్టల్ బ్యాలెట్ పత్రాలు, 8,84,584 ఈవీఎం బ్యాలెట్ పత్రాలను ముద్రించాం.
టెండర్ ఓట్లు, చాలెంజ్ ఓట్లను సేకరించడం కోసం అధిక సంఖ్యలో ఈవీఎం బ్యాలెట్ పత్రాలు ముద్రించాం. ఇప్పటివరకు 32,730 మంది ఎన్నికల సిబ్బంది, 253 మంది అత్యవసర సేవల ఓటర్లు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటేశారు. బుధవారం నాటికి 9,386 మంది వయోజన ఓటర్లు, 522 మంది దివ్యాంగులు ఇంటి నుంచే ఓటేశారు.
9,813 మంది సర్వీసు ఓటర్లు ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోగా, గురువారం నాటికి 275 మంది ఓటేసి వాటిని తిరిగి పంపించేందుకు తపాలా శాఖలో బుకింగ్ చేశారు..’అని సీఈఓ వెల్లడించారు. గడువులోగా ఫామ్ 12డీ సమర్పించినా తమకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించలేదని పలువురు జర్నలిస్టులు చెప్పగా..పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రతి రౌండ్‌కు పరిశీలకుడి నిర్ధారణ
‘ఈసారి ప్రతి శాసనసభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పరిశీలకుడి సమక్షంలో జరగనుంది. ప్రతి రౌండ్ లెక్కింపును పశీలకుడు నిర్ధారించిన తర్వాతే తదుపరి రౌండ్‌కి వెళ్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో 14+1 టేబుళ్లను ఏర్పాటు చేసి ఓట్లను లెక్కిస్తారు. 500కి మించి పోలింగ్ కేంద్రాలున్న 6 కేంద్రాల్లో మాత్రం టేబుళ్ల సంఖ్య రెట్టింపుగా ఉంటుంది. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా, 29న పోలింగ్ సిబ్బంది డిస్త్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఈవీఎంలను తీసుకుని పోలింగ్ కేంద్రాలకు వెళతారు.
జీపీఎస్ ద్వారా వాహనాల ట్రాకింగ్
రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. అందులో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో మొత్తం 59,779 బ్యాలెట్ యూనిట్లను వాడుతున్నాం. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉన్న ఓ పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా నాలుగు బ్యాలెట్ యూనిట్లను వాడుతుండగా, మరికొన్ని చోట్ల రెండు, మూడు బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నాం. ఈవీఎంలను తరలించే వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తాం..’అని సీఈఓ వివరించారు.
ఆ నగదు ఎవరిదో దర్యాప్తులో తేలుతుంది
‘హైదరాబాద్‌లో రూ.కోట్లలో పట్టుబడిన నగదు ఏ పార్టీకి చెందిందో అన్న అంశం పోలీసుల దర్యాప్తులో తేలుతుంది. ఇప్పటివరకు రూ.669 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేయగా, ఇందుకు సంబంధించి 10,106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి మరో 777 కేసులు పెట్టాం. పెద్ద ఎత్తున ఎన్నికల ప్రలోభాలను పట్టుకున్నాం. వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి ముందుకు రావడం లేదు..’అని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఓటేయాలి
‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటేసేందుకు రావాలి. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా, నైతికంగా, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. 40 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలు, 25 వేల మంది పొరుగు రాష్ట్రాల పోలీసు బలగాలు, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తాం..’అని సీఈఓ తెలిపారు. అదనపు సీఈఓ లోకేశ్‌కుమార్, జాయింట్ సీఈఓ సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment