బరాజ్‌లో అర్ధాంతరంగా నిలిచిపోయిన జియోఫిజికల్, జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్
వరదలతోనే నిలిచిపోయినట్టు ఓ అధికారి స్పషీ్టకరణ
ఇతర కారణాలతోనే ఆగాయని మరో అధికారి వెల్లడి
వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీతో చర్చించనున్న అధికారులు
రెండువారాల్లో పూర్తికానున్న అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనకు కారణమైన సాంకేతిక లోపాలను గుర్తించడానికి నిర్వహిస్తున్న జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు(ఇన్వెస్టిగేషన్లు) అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మేడిగడ్డ బరాజ్‌కు ఎగువ నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో పరీక్షలు నిలిపివేయాల్సి వచి్చందని ఓ అధికారి ‘సాక్షి’కి తెలపగా, ఇతర సమస్యలు ఉత్పన్నం కావడంతోనే పరీక్షలను ఆపామని మరో అధికారి వివరించారు. బరాజ్‌కు పరీక్షల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చించడానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆథారిటీ(ఎన్డీఎస్‌ఏ) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీతో సమావేశం కానుంది.
శాశ్వత మరమ్మతులకు ఇన్వెస్టిగేషన్లే కీలకం
గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్‌లోని 7వ బ్లాక్ కుంగిపోయిన విషయం తెలిసిందే. బ్లాకులోని 19, 20, 21వ పియర్లతోపాటుగా 20వ పియర్‌పైన ఉన్న శ్లాబు, పారాపెట్ వాల్స్, రోడ్డు బ్రిడ్జికి తీవ్ర నష్టం వాటిల్లింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం బుంగలు పడి నీరు లీకైన విషయం తెలిసిందే. ఎన్డీఎస్‌ఏ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ మూడు బరాజ్‌లను పరిశీలించి గతంలో మధ్యంతర నివేదిక సమరి్పంచింది. మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడానికి దారితీసిన సాంకేతిక లోపాలను గుర్తించడానికి ఎలక్ట్రో రెసిస్టివిటీ టోమోగ్రఫీ(ఈఆర్టీ), గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్(జీపీఆర్) వంటి జియోఫిజికల్, జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని సిఫారసు చేసింది. అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పటిష్టతను పరీక్షించడానికి వాటికి సైతం ఈ పరీక్షలు జరపాలని కోరింది.
వాటి ఆధారంగానే శాశ్వత మరమ్మతులు, పునరుద్ధరణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. నీటిపారుదల శాఖ పరీక్షలు పూర్తి చేసి నివేదిక సమర్పించిన తర్వాతే మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు నిర్వహించాల్సిన శాశ్వత మరమ్మతులపై నిపుణుల కమిటీ తుది నివేదిక సమరి్పంచనుంది. మేడిగడ్డ బరాజ్‌కు పరీక్షలు మధ్యంతరంగా ఆగిపోవడంతో కమిటీ తుది నివేదిక మరింత ఆలస్యమయ్యే అవకాశముంది.
అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మాత్రం పరీక్షలు కొనసాగుతున్నాయని, మరో రెండు వారాల్లో వీటిని పూర్తి చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. మేడిగడ్డ బరాజ్‌కు ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో కొన్ని చివరి దశలో ఉండగా, మరికొన్ని వేర్వేరు దశల్లో ఉన్నాయని, వర్షాలు పూర్తిగా నిలిచిన తర్వాతే వాటిని మళ్లీ పునరుద్ధరించడానికి ఆస్కారముంటుందని స్పష్టం చేస్తున్నాయి.
అత్యవసర మరమ్మతులు దాదాపుగా పూర్తిచేశాం
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లకు మరింత నష్టం జరగకుండా అత్యవసర మరమ్మతులు దాదాపుగా పూర్తి చేశామని కేంద్ర ప్రభుత్వ సంస్థల నిపుణుల బృందానికి నీటిపారుదలశాఖ తెలియజేసింది. జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షలు ఇంకా పూర్తికావాల్సి ఉందని పేర్కొంది.
నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్) బి.నాగేందర్‌రావు, రామగుండం సీఈ కె.సుధాకర్‌రెడ్డి శుక్రవారం జలసౌధలో ఎన్డీఎస్‌ఏతో పాటు సెంట్రల్ వాటర్ అండర్ పవర్ రిసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్‌ఎస్), సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రిసెర్చ్ స్టేషన్(సీఎస్‌ఎంఆర్‌ఎస్) ప్రతినిధులు అమితాబ్ మీనా, మనీష్గుప్తా, డాక్టర్ మందిరతో సమావేశమై మధ్యంతర నివేదిక అమలులో పురోగతిని వివరించారు. పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను తెలియజేశారు.ఈ బృందం త్వరలో ఢిల్లీలో ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీతో సమావేశమై వారికి తెలియజేయనుంది. దీని ఆధారంగా తదుపరి చేపట్టాల్సిన చర్యలను ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ సిఫారసు చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment