వృద్ధుడిని భుజాలపై మోసుకొని వస్తున్న ఎస్సై బండారి రాజు
రాయపర్తి: సాయంత్రం పూట అలా బయటికి వెళ్తేనే చలి వణికిస్తోంది. కానీ చెరువులో దుస్తులు లేకుండా అచేతన స్థితిలో మూడు రోజులుగా పడి ఉన్నాడో వృద్ధుడు. ఈ హృదయ విదారక సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ తరువాత మంగళవారం అటుగా వెళ్లిన గొర్రెల కాపరులకు కొండాపురం ఊర చెరువులో అచేతనంగా ఓ వృద్ధుడు కనిపించాడు. వెంటనే వార్త గ్రామమంతా వ్యాపించింది.
సర్పంచ్ కోదాటి దయాకర్‌రావు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై బండారి రాజు వృద్ధుడిని చూసి చలించిపోయారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో దుస్తులు తొడిగించి, చెరువులోంచి మోసుకొచ్చాడు. 108 వాహనంలో ఆస్పత్రికి తరలించాడు. కరుకుగా కనిపించే ఖాకీ బట్టలమాటున మంచి మనసుందని నిరూపించాడు. ఆ వృద్ధుడు ఎవరు? ఎక్కడినుంచి వచ్చాడన్న విషయం ఇంకా తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment