ఒంటి కాలితో దేశాన్ని చుట్టొస్తా  | Olympic Triathlon Para Cycling Champion Geeta Rao | Sakshi
Sakshi News home page

ఒంటి కాలితో దేశాన్ని చుట్టొస్తా 

Published Sat, Feb 25 2023 2:39 AM | Last Updated on Sat, Feb 25 2023 5:07 PM

Olympic Triathlon Para Cycling Champion Geeta Rao - Sakshi

గీతా ఎస్‌ రావు..

సనత్‌నగర్‌: ఒంటికాలితోనే మహిళల ప్రత్యేక సోలో కేటగిరి సైక్లింగ్‌ రేస్‌లో శ్రీనగర్‌ నుంచి కన్యాకుమారి వరకు సాగే ఐకానిక్‌ సైకిల్‌ రైడ్‌ పూర్తి చేస్తానని పారా అథ్లెట్‌ గీతా ఎస్‌.రావు ధీమా వ్యక్తం చేశారు. ఎడమ కాలు పోలియో వ్యాధికి గురైనప్పటికీ ఆమె ఒక కాలుతోనే సైకిల్‌ తొక్కుతూ ఇప్పటికే డీఎస్‌ఆర్, ఒలింపిక్‌ ట్రై అథ్లెట్, పారా సైక్లింగ్‌ 2022 చాంపియన్‌గా నిలిచారు. సుషేనా హెల్త్‌ ఫౌండేషన్‌ టీమ్‌ సభ్యులను కలిసేందుకు శుక్రవారం ఆమె నగరానికి వచ్చారు.

ఈ సందర్భంగా నిలోఫర్, ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న ‘ధాత్రి మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌’ ఫ్లాగ్‌ షిప్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 18,950 కిలోమీటర్ల ఎత్తులో, 3,651 కిలోమీటర్ల పొడవైన ఈ  ఐకానిక్‌ సైకిల్‌ రైడ్‌ మార్చి 1న శ్రీనగర్‌ నుంచి ప్రారంభమై  కన్యాకుమారిలో ముగుస్తుందన్నారు. దేశవ్యాప్తంగా సాగే జాతీయ స్థాయి అల్ట్రా సైక్లింగ్‌ రేస్‌లో భాగంగా దేశంతో పాటు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సోలో, రిలే టీమ్‌లు పాల్గొంటాయని తెలిపారు.

12 రోజుల్లో 12 రాష్ట్రాలను దాటుతూ 3,651 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేస్తానని తెలిపారు. ఈ రేస్‌కు సుషేనా హెల్త్‌ ఫౌండేషన్‌ అధికారిక భాగస్వామిగా ఉందన్నారు. తన రైడ్‌లో భాగంగా ‘తల్లి పాలే ఉత్తమ ఆహారం’ అనే నినాదంతో దేశంలో తల్లి పాలపై అవగాహనను పెంపొందించేందుకు ప్రచారం చేస్తానన్నారు. కార్యక్రమంలో నిలోఫర్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉషారాణి, ధాత్రి మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు సంతోష్‌కుమార్‌ క్రాలేటీ, నియోనాటాలజీ హెచ్‌ఓడీ అలిమేలు మాదిరెడ్డి, సుషేనా హెల్త్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కలవలపల్లి దుర్గాభవానీ, అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ ముర్కి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement