సాక్షి, హైదరాబాద్: ‘మన దేశంలోని సగం మందిని ఇప్పటికే డెల్టా ప్రభావితం చేయడం, ఆ తర్వాత వాళ్లు టీకాలు తీసుకోవడం వల్ల కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే శక్తి చాలావరకు వస్తుంది. ఇన్ఫెక్షన్ తర్వాత తీసుకునే వ్యాక్సిన్ శక్తివంతమైనదని కూడా డబ్ల్యూహెచ్‌వో చెప్పింది. సాధారణ ప్రజలు డెల్టా ఎఫెక్ట్ అయ్యాక టీకా తీసుకుంటే, వైద్యులు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నాక వైరస్ బారిన పడ్డారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనే సమర్థత వస్తుంది. దీనినే హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటారు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియాలో ఈ ఇమ్యూనిటీ ఎక్కువే..’ అని నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డా.కిరణ్ మాదల చెప్పారు. ఒమిక్రాన్, తదనంతర పరిస్థితులపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు
వెంటనే టీకా వేసుకోవాలి:
‘డెల్టా కంటే ఒమి క్రాన్ రెండురెట్లు అధికంగా వ్యాప్తి చెందుతోంది. ఒకరి నుంచి కుటుంబంలోని ఇతర సభ్యులకు వేగంగా సోకే లక్షణాలున్నాయి. వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే లక్షణాల కారణంగా ఎక్కువ మందికి సోకుతుంది. అందువల్ల మూడు, నాలుగు నెలల్లో ఇక్కడ థర్డ్‌వేవ్ రావొచ్చు. టీకాలతో మరణాలు సంభవించకుండా ఆపొచ్చే తప్ప వైరస్ సోకకుండా పూర్తిస్థాయిలో నియంత్రించలేము. సెకండ్ డోస్ తీసుకోనివారు రాష్ట్రంలో 25 లక్షల మంది ఉన్నారు. తెలంగాణలో 80 లక్షల డోసులు అందుబాటులో ఉన్నా వాటిని నిర్ణీత కాలవ్యవధిలో వేసుకోకపో వడం సరికాదు. ఒక్కడోస్ కూడా తీసుకోని వారు వెంటనే టీకా వేసుకోవాలి..’ అని సూచించారు.
వీరిని బయటకు పంపకూడదు
‘అరవై ఏళ్లకు పైబడినవారు టీకాలు వేసుకుని 6 నెలలు గడిచినందున వారు ప్రభావితం కావొచ్చు. దీర్ఘకాలిక వ్యాధులు, అనారోగ్యసమస్యలున్న వారిపైనా దీని తీవ్రత ఎక్కువుండే అవకాశాలున్నాయి. వీరిని 2, 3 నెలలు బయటకు పంపించకుండా చూడాలి. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే మాస్క్, ఇతర జాగ్రత్తలన్నీ కచ్చితంగా పాటించాలి..’ అని కిరణ్ మాదల చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment