
సాక్షి, హైదరాబాద్: వంటిట్లో ఉల్లి మరోసారి కంటినీరు తెప్పిస్తోంది. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటంతో పరిస్థితి రోజురోజుకూ అధ్వానంగా తయారవుతోంది. తెలంగాణ జిల్లాల నుంచి ఉల్లి దిగుమతులు ఆగిపోవడం, మహారాష్ట్ర నుంచి అనుకున్న దానికి కంటే సగం ఉల్లి మాత్రమే సరఫరా అవుతుండటం కూడా ఉల్లి ధర ఘాటెక్కేందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
రెట్టింపైన ఉల్లి ధరలు
గత వారంతో పోలిస్తే ఈ వారం ఉల్లి ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. వర్షాలతో మార్కెట్‌కు డిమాండ్‌కు తగ్గ సరఫరా కాకపోవడంతో ఉల్లి ధరలు పెరిగాయని మార్కెట్ అధికారులు అంటున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడంతో పాటు, స్థానికంగా కూడా ఉల్లి దిగుమతులు భారీగా తగ్గాయి. దీంతో నగర మార్కెట్‌లకు ఉల్లి దిగుమతులు తగ్గడంతో ధరలు పెరిగాయని హోల్‌సెల్ వ్యాపారులు చెబుతున్నారు. గత వారం హోల్‌సెల్ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ. 8 నుంచి 12 వరకు ధర పలుకుతుండగా... ప్రస్తుతం కిలో రూ. 22 నుంచి రూ. 32 వరకు పలుకుతోంది. సోమవారం నుంచి ఉల్లి నగరంలోని బోయిన్‌పల్లి, గుడి మల్కాపూర్, మలక్‌పేట్‌కు కర్నూలు, కర్ణాటకతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి లోకల్ ఉల్లి దిగుమతులు తగ్గాయి. దీంతో ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి.
మహారాష్ట్ర నుంచి తగ్గిన దిగుమతులు
సాధారణంగా నగర ఉల్లి అవసరాల్లో దాదాపు 60 శాతం మే మహారాష్ట్ర దిగుమతులే తీరుస్తాయి. పూణె, నాసిక్‌తోపాటు షోలాపూర్ తదితర జిల్లాల నుంచి నగర మార్కెట్‌కు రోజూ దాదాపు 60 లారీల ఉల్లి దిగుమతి అవుతుంది. మిగతా 40 శాతం కర్ణాటక, కర్నూలుతోపాటు తెలంగాణ జిల్లాల నుంచి వస్తుంది. వర్షాల కారణంగా మహారాష్ట్రలో చేతికి అందిన ఉల్లి నోటికి చేరలేదు. దాని ప్రభావం నగర మార్కెట్‌పై పడింది. రోజు మలక్‌పేట్ మార్కెట్‌కు 60 నుంచి 70 లారీల ఉల్లి దిగుమతి అయ్యేది. వర్షాలతో 30 నుంచి 35 లారీల ఉల్లి మాత్రమే దిగుమతి అవుతోంది.
ధరల నియంత్రణకు కృషి
గతంతో పోలిస్తే నగరంలో ఉల్లి వినియోగం పెరిగింది. తెలంగా ణ జిల్లాల్లో వర్షాల కారంగా ఉల్లి పంటకు నష్టం జరిగింది. స్థానికంగా ఉల్లి దిగుమతులు తగ్గా యి. లాక్‌డౌన్ అనంతరం ప్రతి నెల ఉల్లి వినియోగం పెరుగుతూ వస్తోంది. స్థానికంగా ఉల్లితో పాటు మహారాష్ట్ర, ఆంధ్ర నుంచి ఉల్లి దిగుమతులు మార్కెట్‌కు తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఉల్లి ధరలు తక్కువగా ఉన్నాయి. కమీషన్ ఏజెంట్లు, హోల్‌సెల్ వ్యాపారులు ఉల్లిని నిల్వ చేయడం, లేదా కృత్రిమ కొరత సృష్టించడానికి ప్రయత్నిస్తే వారిపై చర్యలు తప్పవు. ఉల్లి ధరలు నియంత్రించడానికి ప్రయత్నిస్తాం.
– దామోదర్, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ, మలక్‌పేట్ మార్కెట్
Comments
Please login to add a commentAdd a comment