సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సోమవారం ఆన్‌లైన్ బోధన అధికారికంగా మొదలైంది. ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు 50 శాతం హాజరయ్యారు. టీ–శాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు వినాలంటూ విద్యార్థులకు మెసేజ్‌లు పెట్టడం, ఫోన్ చేసి అప్రమత్తం చేయడం వంటి విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆన్‌లైన్ క్లాసులు ఎంతమంది విన్నారో తెలుసుకుని పైఅధికారులకు నివేదికలు పంపారు. కాకపోతే ఆన్‌లైన్ క్లాసులకు సంబంధించి విద్యాశాఖ ఆదివారం రాత్రి బోధన షెడ్యూల్‌ను హడావుడిగా విడుదల చేయడం విమర్శలకు దారితీసింది. తెల్లవారేసరికే ఈ సమాచారం అందరికీ చేరవేయడం కష్టమైందని టీచర్లు చెప్పారు.
రికార్డింగ్ పాఠాలు: రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో 8–10 తరగతుల విద్యార్థులు దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. ఈ నెల 8 నుంచి బడులు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లారు. ప్రభుత్వం ఇంతకాలం ఆన్‌లైన్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు క్లాసులకు పెద్దగా సిద్ధం కాలేకపోయారు. హడావుడిగా ఆదివారం రాత్రి షెడ్యూల్ ఇచ్చి.. దూరదర్శన్, టీ–శాట్‌లో పాఠాల సమయాన్ని ప్రకటించారు. ఈ షెడ్యూల్ గ్రామీణ విద్యార్థులకు సరిగా చేరుకోలేదనే విమర్శలొచ్చాయి. దీంతో వారు మొదటిరోజు పాఠాలు సరిగా వినలేక పోయారు.
టీ–శాట్, డీడీ ద్వారా రికార్డింగ్ వీడియోల ద్వారా బోధిస్తున్నారు. పాఠంలో సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతోందని విద్యార్థులు వాపోతున్నారు. సర్కారీ బడుల కన్నా, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్ విద్యను అందించడంలో ముందంజలో ఉన్నాయి. ఈ ప్రక్రియను వారం ముందే మొదలు పెట్టినట్టు స్కూళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రైవేటు స్కూళ్లు ఎక్కువగా జూమ్ పద్ధతిలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాయి.
రోజంతా జూమ్ క్లాసులు
ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జూమ్‌లో క్లాసులు పెడుతున్నారు. ఐదు రోజులుగా క్లాసులు నడుస్తున్నాయి. మాకు డౌట్లు వస్తే అడుగుతున్నాం. కాకపోతే ఐ ప్యాడ్‌లోనే అంతా వినాల్సి వస్తోంది. దీంతో కళ్లు గుంజుతున్నాయి. అలసిపోతున్నట్టుగా అన్పిస్తోంది. – వి. సాయి కుమార్ ప్రైవేటు స్కూలు విద్యార్థి, ఖమ్మం
వినలేకపోయాను
సెలవులని మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను.అక్కడ నెట్ లేదు. ఆన్‌లైన్ క్లాసులున్నాయని ఈ ఉదయం ఫోన్ చేసి చెప్పారు. వరంగల్ రాలేకపోయాను. దీంతో క్లాసులు వినలేదు.
–చైతన్య 10వ తరగతి విద్యార్థి, వరంగల్
పర్యవేక్షణే డ్యూటీ
ఆన్‌లైన్ క్లాసులు మొదలైనా, చాలామంది మొదటి రోజు అప్రమత్తం కాలేదు. విద్యార్థులను పర్యవేక్షిం చడమే ప్రస్తుతం ప్రభుత్వ టీచర్ల బాధ్యత. స్కూలుకొచ్చిన టీచర్లు విద్యార్థులకు ఫోన్లు చేసి, క్లాసులు వినాలని చెబుతున్నారు. ఆ తర్వాత ఏమేర విన్నారో సమాచారం తీసుకుంటున్నారు.
– రాజా భాను చంద్రప్రకాశ్ (హెచ్‌ఎం, కరీంనగర్ జిల్లా)
Comments
Please login to add a commentAdd a comment