clasess
-
తొలి రోజు పాఠాలు అంతంత మాత్రమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు సోమవారం ఆన్లైన్ బోధన అధికారికంగా మొదలైంది. ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు 50 శాతం హాజరయ్యారు. టీ–శాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు వినాలంటూ విద్యార్థులకు మెసేజ్‌లు పెట్టడం, ఫోన్ చేసి అప్రమత్తం చేయడం వంటి విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆన్లైన్ క్లాసులు ఎంతమంది విన్నారో తెలుసుకుని పైఅధికారులకు నివేదికలు పంపారు. కాకపోతే ఆన్లైన్ క్లాసులకు సంబంధించి విద్యాశాఖ ఆదివారం రాత్రి బోధన షెడ్యూల్‌ను హడావుడిగా విడుదల చేయడం విమర్శలకు దారితీసింది. తెల్లవారేసరికే ఈ సమాచారం అందరికీ చేరవేయడం కష్టమైందని టీచర్లు చెప్పారు. రికార్డింగ్ పాఠాలు: రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లలో 8–10 తరగతుల విద్యార్థులు దాదాపు 15 లక్షల మంది ఉన్నారు. ఈ నెల 8 నుంచి బడులు లేకపోవడంతో చాలామంది విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లారు. ప్రభుత్వం ఇంతకాలం ఆన్‌లైన్‌పై స్పష్టత ఇవ్వకపోవడంతో విద్యార్థులు క్లాసులకు పెద్దగా సిద్ధం కాలేకపోయారు. హడావుడిగా ఆదివారం రాత్రి షెడ్యూల్ ఇచ్చి.. దూరదర్శన్, టీ–శాట్‌లో పాఠాల సమయాన్ని ప్రకటించారు. ఈ షెడ్యూల్ గ్రామీణ విద్యార్థులకు సరిగా చేరుకోలేదనే విమర్శలొచ్చాయి. దీంతో వారు మొదటిరోజు పాఠాలు సరిగా వినలేక పోయారు. టీ–శాట్, డీడీ ద్వారా రికార్డింగ్ వీడియోల ద్వారా బోధిస్తున్నారు. పాఠంలో సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతోందని విద్యార్థులు వాపోతున్నారు. సర్కారీ బడుల కన్నా, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్ విద్యను అందించడంలో ముందంజలో ఉన్నాయి. ఈ ప్రక్రియను వారం ముందే మొదలు పెట్టినట్టు స్కూళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రైవేటు స్కూళ్లు ఎక్కువగా జూమ్ పద్ధతిలో ఆన్లైన్ తరగతులు నిర్వహించాయి. రోజంతా జూమ్ క్లాసులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జూమ్‌లో క్లాసులు పెడుతున్నారు. ఐదు రోజులుగా క్లాసులు నడుస్తున్నాయి. మాకు డౌట్లు వస్తే అడుగుతున్నాం. కాకపోతే ఐ ప్యాడ్లోనే అంతా వినాల్సి వస్తోంది. దీంతో కళ్లు గుంజుతున్నాయి. అలసిపోతున్నట్టుగా అన్పిస్తోంది. – వి. సాయి కుమార్ ప్రైవేటు స్కూలు విద్యార్థి, ఖమ్మం వినలేకపోయాను సెలవులని మా అమ్మమ్మ ఇంటికి వెళ్లాను.అక్కడ నెట్ లేదు. ఆన్లైన్ క్లాసులున్నాయని ఈ ఉదయం ఫోన్ చేసి చెప్పారు. వరంగల్ రాలేకపోయాను. దీంతో క్లాసులు వినలేదు. –చైతన్య 10వ తరగతి విద్యార్థి, వరంగల్ పర్యవేక్షణే డ్యూటీ ఆన్లైన్ క్లాసులు మొదలైనా, చాలామంది మొదటి రోజు అప్రమత్తం కాలేదు. విద్యార్థులను పర్యవేక్షిం చడమే ప్రస్తుతం ప్రభుత్వ టీచర్ల బాధ్యత. స్కూలుకొచ్చిన టీచర్లు విద్యార్థులకు ఫోన్లు చేసి, క్లాసులు వినాలని చెబుతున్నారు. ఆ తర్వాత ఏమేర విన్నారో సమాచారం తీసుకుంటున్నారు. – రాజా భాను చంద్రప్రకాశ్ (హెచ్ఎం, కరీంనగర్ జిల్లా) -
7 నుంచి 10 తరగతులకు ఆన్లైన్ బోధన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బడులు తెరిచే వరకూ 7 నుంచి 10 తరగతులకు ఆన్లైన్ బోధన చేపట్టాలని పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం (24వ తేదీ) నుంచి ఆన్లైన్, దూర విద్య క్లాసులు నిర్వహించేందుకు అనుమతించారు. ఈ మేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 50 శాతం మంది రొటేషన్ పద్ధతిలో హాజరవ్వాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆన్లైన్ క్లాసుల నిర్వహణపై స్కూల్ హెచ్ఎంలు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. 31 నుంచి క్లాసులు మొదలుపెడదామనుకున్నా.. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం సం క్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో సెలవులను ఈ నెల 30 వరకూ పొడిగించింది. పరిస్థితి బాగుంటే 31 నుంచి క్లాసులు మొదలుపెట్టాలనుకున్నారు. అయితే తాజాగా ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి సర్వేలో కోవిడ్ కేసులు, లక్షణాలున్న విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. పాఠశాలల్లో శానిటైజేషన్ ప్రక్రియ అంతంతగానే ఉందని జిల్లా విద్యా శాఖ అధికారులు నివేదికలు పంపారు. విద్యా సంస్థల్లో కోవిడ్ మొదలైతే వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్య శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. స్కూళ్లు తెరిచినా విద్యార్థులను ధైర్యంగా పంపేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని అధికారులు అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విద్యా శాఖ ఉన్నతాధికారులు సమీక్ష జరిపి ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. -
ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆన్లైన్ తరగతులు కోసం అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇకపై ఈ తరహా మెకానిజం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని అధికారులు అంటున్నారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు తరచూ మూతపడుతున్నాయి. దీని ప్రభావం విద్యార్థుల చదువులపై పడుతోంది. అంతిమంగా సిలబస్ పూర్తవ్వలేదని, ఫెయిల్ అయిన విద్యార్థులు పాస్ చేయాలంటూ పట్టుపడుతున్నారు. ఈ సమస్య రాకుండా టీ–శాట్ ద్వారా పక్కా ప్రణాళిక ప్రకారం బోధన అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు షెడ్యూల్డ్ కూడా ప్రకటించారు. ప్రత్యక్ష బోధనకు హాజరవ్వకున్నా విద్యార్థులు దీనిద్వారా సిలబస్ పూర్తి చేసుకునే వీలుందని భావిస్తున్నారు. (క్లిక్: కోవిడ్ పాజిటివా! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి) -
మైనర్లకు ‘ప్రేమ’ పాఠాలు.. ఆపై వీడియోలతో బెదిరింపులు
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ క్లాసులను ఆసరాగా చేసుకుని... సోషల్‌మీడియా ద్వారా మైనర్లకు ఎర వేస్తూ.. అందినకాడికి దండుకోవడంతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ హయత్‌నగర్ పోలీసులకు చిక్కిన బచ్చనబోయిన సాయికుమార్ అలి యాస్ సాయి వర్ధన్ యాదవ్ కేసులో మరికొందరూ నిందితులుగా ఉండి ఉంటారని పోలీసులు అను మానిస్తున్నారు. ఇతడి బారినపడిన వారిని గుర్తించడంపై దృష్టి పెట్టారు. బాధితులు అంతా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సాయిని న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ► సాయి ప్రధానంగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, షేర్‌చాట్ వంటి యాప్స్‌ను వినియోగించాడు. ఆకర్షణీయమైన ఫొటోలతో ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. ఇటీవల దాదాపు అన్ని పాఠశాలలు ఆన్లైన్ విధానంలో విద్యను బోధిస్తుండటంతో ఇతడికి కలిసి వచ్చింది. ► ప్రధానంగా మైనర్లను టార్గెట్‌గా చేసుకున్న సాయి తొలుత వారికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు, ఆపై హాయ్ అంటూ పలకరింపు సందేశాలు పంపించేవాడు. వీటిని స్పందించిన వారితో పరిచయం పెంచుకుంటూ సెంటిమెంట్‌తో కూడిన తియ్యటి మాటలు చెప్తూ ముందుకు వెళ్లి ఆపై అసలు కథ మొదలెట్టేవాడు. ► ఆరు, ఏడు, ఎనిమిదో తరగతులు చదవుతున్న వారితోనూ ప్రేమ, పెళ్లి ప్రస్తావనలు తీసుకువచ్చేవాడు. వారిని పూర్తిగా తన ట్రాప్‌లోకి తెచ్చుకోవడానికి ‘నీవు కాదంటే చచ్చిపోతా’, ‘నీవు లేకపోతే బతకలేను’ అంటూ చాటింగ్స్ చేసేవాడు. కొందరు బాలికలకు సాయి అసభ్యకర సందేశాలు పంపి వేధించినట్లు అనుమానాలున్నాయి. ► ఇతడి చేష్టలకు భయపడకుండా ఎవరైనా ఎదిరు తిరిగితే ఇక వారి జోలికి వెళ్లేవాడు కాదు. అలా కాకుండా తన వల్లోపడిన వారిని ఏకాంతంగా గడిపే వరకు తీసుకువెళ్లి ఆ ఫొటోలు, వీడియోలు, సెక్స్ చాటింగ్స్‌తో బెదిరింపులకు దిగేవాడు. ఇలా వారి నుంచి అందినకాడికి దండుకునే వాడు. ► ఇతడి వల్లోపడిన వారిలో అనేక మంది బాలికలు తమ ఇళ్లల్లోనే చోరీలు సైతం చేశారని పోలీసులు చెప్తున్నారు. కొందరు నగదు, మరికొందరు బంగారు ఆభరణాలు తీసుకువెళ్లి సాయికి అప్పగించారు. ఇతడి వ్యవహారం గుట్టురట్టయింది కూడా ఓ బాలిక చేసిన ఇలాంటి చోరీ తోనే కావడం గమనార్హం. ► ఈ వ్యవహారంలో సాయితో మరికొందరు జట్టు కట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ► సాయి ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపడం ద్వారా బాధితులను, అతడికి సహకరించిన వారికి పట్టుకోవడానికి రాచకొండ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముఠాలో కనీసం ఐదారుగురు ఉండి ఉంటారని, వారంతా సాయి స్నేహితులు లేదా క్లాస్మేట్స్ అని భావిస్తున్నారు. ► ఆన్లైన్ యాక్టివిటీస్ నేపథ్యంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులూ తమ పిల్లల వ్యవహారశైలిపై కన్నేసి ఉంచాలని పోలీసులు కోరుతున్నారు. -
‘ఇన్నేళ్ల గౌరవం క్షణాల్లో నాశనం అయ్యింది’
టీచర్లను ఏడిపించడం.. వారిని ఎగతాళి చేస్తూ మాట్లాడటం వంటి చేష్టల్ని హీరోయిజంగా చూపిస్తారు సినిమాల్లో. కానీ వాస్తవంగా ఆ పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటాయో.. ఎంతటి వేదనను కల్గిస్తాయో.. మనం ఊహించలేము. తాజాగా ఇందుకు సంబంధించిన స్టోరీ ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. తప్పకుండా ప్రతి ఒక్కరు చదివి, షేర్ చేసుకుని.. నిజ జీవితంలో ఇలాంటి పనులు చేయకూడదని కోరుతున్నారు నెటిజనులు. ఆ వివరాలు.. కరోనా వైరస్ కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. సాధారణంగా ప్రతి ఏడాది ఈ పాటికి అకాడమిక్ ఇయర్ ప్రారంభించాల్సిన సమయం. కానీ కరోనా వైరస్ నానాటికి విజృంభిస్తుండటంతో... విద్యా సంస్థలను ఇంకా తెరవలేదు. కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు మాత్రం ఆన్లైన్ క్లాస్‌లు నడుపుతున్నాయి. ఈ క్రమంలో నెలరోజుల క్రితం ఓ స్కూల్ ప్రిన్సిపాల్ తమ టీచర్లను పిలిచి ఈ ఏడాది ఆన్లైన్ క్లాస్‌లు తీసుకోవాల్సిందిగా ఆదేశించాడు. ప్రిన్సిపాల్ మాటలు వినగానే ఓ 55 ఏళ్ల టీచర్‌కు గుండెల్లో దడ మొదలయ్యింది. ఎందుకంటే ఆయనకు ఇంకా స్మార్ట్‌ఫోన్ వాడకం గురించి పూర్తిగా తెలీదు. అలాంటిది ఆన్లైన్లో క్లాస్‌లు తీసుకోవడం అంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. తనకు చేతకాదని చెప్తే యాజమాన్యం జాబ్ నుంచి తొలగిస్తుంది. ఈ వయసులో ఆయనకు మరో ఉద్యోగం దొరకడం అంటే చాలా కష్టం. ఈ సమస్య గురించి కూతురుతో చెప్పాడు. ఆమె తండ్రికి ధైర్యం చెప్పి.. జూమ్‌లో ఆన్లైన్ క్లాస్ ఎలా తీసుకోవాలి.. స్మార్ట్‌ఫోన్ వాడకం గురించి కొన్ని బెసిక్స్ నేర్పింది. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే బోర్డు కావాలని చెప్పి దాన్ని కూడా తెప్పించాడు సదరు ఉపాధ్యాయుడు. ఫస్ట్ రోజు క్లాస్‌లో బాగా కనిపించాలనే ఉద్దేశంతో కొత్త షర్ట్ తీసుకున్నాడు. ఇక ఆన్లైన్ క్లాస్‌లు మొదలు పెట్టే రోజు రానే వచ్చింది. అన్ని సిద్ధం చేసుకుని పాఠం ప్రారంభించాడు. (సోషల్ మీడియాలో టీచర్ల మార్ఫింగ్ ఫొటోలు) కానీ మొదటి సారి కెమరా ముందు నిల్చుని పాఠం చెప్పాలంటే కాస్తా భయపడ్డాడు. గొంతు వణుకుతోంది. ఆయన ఇలా ఇబ్బంది పడుతుండగా ఓ గుర్తు తెలియని ఐడీ నుంచి కొన్ని అసభ్యకరమైన మాటలు వినిపించాయి. అసలే ఆన్లైన్ గురించి సరిగా తెలియని ఆ టీచర్.. ఈ చర్యలకు మరింత భయపడ్డాడు. ఎలా స్పందించాలో అర్థం కాలేదు.. విద్యార్థుల మీద అరిచాడు. కానీ ఆ మాటలు మాత్రం ఆగలేదు. ఆయన ఇన్నేళ్లు సంపాదించుకున్న గౌరవం కొన్ని సెకన్లలో తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వీడియోను మ్యూట్ చేశాడు. కానీ ఆ విద్యార్థి అన్‌మ్యూట్ చేసి.. టీచర్‌ను ఎగతాళి చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఆ విద్యార్థికి వినోదంగా అనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే క్లాస్‌ను ముగించడం ఒక్కటే మార్గం. కానీ రేపు ఇలానే జరుగుతుంది. మరి అప్పుడేం చేయాలి. ప్రస్తుతం ఈ ఉద్యోగం చేయడం అతడికి ఎంతో అవసరం. దాంతో దుఖం తన్నుకొచ్చింది. (‘ఆన్లైన్’ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన హార్వర్డ్, ఎంఐటీ) కుమార్తెను పిలిచి ఒక్కసారిగా బోరున ఏడ్చాడు. ఇన్నేళ్లు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి.. ఈ అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. ఏడుస్తూనే ఉన్నాడు. మరుసటి రోజును తలుచుకుంటే.. ఆ రాత్రి అతడికి నిద్ర కూడా పట్టలేదు. విద్యార్థులకు వినోదం.. అతడికి ప్రాణసంకటంగా మారింది పరిస్థితి. ‘టీచర్లను ఎగతాళి చేసి మీరు వినోదం పొందుతారేమో కానీ.. భవిష్యత్తులో మీరు బాధపడతారు’ అంటూ షేర్ చేసిన ఈ కథనం ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు వెల్లడి కాలేదు. -
విఐటీ–ఏపీలో ‘స్టార్స్’ 3వ బ్యాచ్ ప్రారంభం
సాక్షి, అమరావతి: విఐటీ ఏపీ వర్సిటీలో ‘స్టార్స్’ 3వ బ్యాచ్ శుక్రవారం ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ఉన్నత చదువులకు పేదరికం అడ్డుకాకూడదనే సంకల్పంతో తమ వర్సిటీ స్టార్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు విఐటీ–ఏపీ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ) చదివి జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులకు విఐటీ–ఏపీ వర్సిటీలో నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుతో పాటు వసతిని ఉచితంగా కల్పిస్తున్నామని వివరించారు. స్టార్స్ 3వ బ్యాచ్ కార్యక్రమాన్ని, వర్సిటీలో నూతనంగా ఏర్పాటు చేసిన సింథటిక్ టెన్నిస్ కోర్టుని తాటికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి శుక్రవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ..విఐటీ అంటే విజన్, ఇన్నోవేషన్, ట్రాన్స్ఫార్మేషన్ అని అభివరి్ణంచారు. స్టార్స్ 3వ బ్యాచ్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ డి.శుభాకర్, రిజి్రస్టార్ డాక్టర్ సీఎల్వీ శివకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిషన్స్) డాక్టర్ ఖాదర్ పాషా తదితరులు పాల్గొన్నారు. -
శిక్షణ తరగతుల్లో పాల్గొన్న కాంగ్రెస్ సర్పంచులు
ఆదిలాబాద్ : రాష్ట్ర రాజధానిలోని బోయిన్పల్లి కేజీఆర్ గార్డెన్స్‌లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచులకు నిర్వహించిన రాజకీయ శిక్షణ తరగతుల్లో ఆ పార్టీకి చెందిన జిల్లా సర్పంచులు 20 మందికి పైగా పాల్గొన్నట్లు ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్ ‘సాక్షి’కి ఫోన్ ద్వారా తెలిపారు. పార్టీ తెలంగాణ ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్, జాతీయ నేతలు కుంతియా, కె.రాజు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క, శాసనసభాపక్ష నేత జానారెడ్డి, శాసన మండలిపక్ష నేత షబ్బీర్‌అలీ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా పంచాయతీల్లో సర్పంచులకు పూర్తి అధికారాలు దక్కేలా ప్రభుత్వంపై పోరాడాలని నేతలు సూచించినట్లు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు–మన ప్రణాళిక, గ్రామజ్యోతి వంటి కార్యక్రమాలతో హడావిడి చేసినప్పటికీ, ఇప్పటివరకు పంచాయతీలకు చేసిందేమీ లేదని పేర్కొన్నారు. మోసపూరితంగా వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వంపై పోరాడాలని నేతలు పిలుపునిచ్చినట్లు తెలిపారు. జిల్లా నుంచి డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి రవిందర్‌రావు, తదితరులు పాల్గొన్నట్లు వివరించారు.