ఆర్మీ నుంచి నగరానికి చెందిన లోకేశ్ మిషన్స్‌కు ఆర్డర్
550 ‘అస్మి’ సబ్‌మెషీన్ గన్ల తయారీ కాంట్రాక్టు పొందిన సంస్థ
తాను డిజైన్ చేసిన సబ్‌మెషీన్ గన్‌తో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ బన్సోద్
సాక్షి, హైదరాబాద్: భారత సరిహద్దుల్లో కాపుకాసే ఆర్మీ జవాన్ల చేతిలో ‘సిటీ తుపాకీ’ పేలనుంది. ‘అస్మి’ పేరుతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీర్‌డీఓ) డిజైన్ చేసిన ఈ మొట్టమొదటి భారతీయ సబ్ మెషీన్‌గన్ తయారీ కాంట్రాక్టును హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ దక్కించుకుంది. తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ కోసం రూ.4.26 కోట్లతో 550 తుపాకులు తయా రు చేసి సరఫరా చేయనున్నారు. ఇజ్రాయెల్, జర్మనీల్లోని ఆయుధ కర్మాగారాలకు దీటుగా నగరానికి చెందిన ఓ చిన్న సంస్థ ఈ ప్రతి ష్టాత్మక కాంట్రాక్టు దక్కించుకోవడం గమనార్హం. ఈ తుపాకీని సరిహద్దు భద్రతా దళాలతో పాటు కేంద్ర పోలీసు బలగాలూ వినియోగించనున్నాయి. ప్రముఖుల భద్రత కోసం వినియోగించడానికీ ‘అస్మి’ అనువుగా ఉంటుంది.
ఉజీ, హెక్లర్‌లకు దీటుగా..
⇒ పుణేలోని డీఆర్‌డీఓలో అంతర్భాగమైన అర్మా మెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, ఆర్మీ సంయుక్తంగా ఆత్మనిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పరిశోధనతో ‘అస్మి’ రూపుదిద్దుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ ప్రసాద్ బన్సోద్ దీన్ని డిజైన్ చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ప్రమాణాలకు లోబడి, దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేశారు. సంస్కృతంలో అస్మిత అంటే ధైర్యం, గర్వం (ప్రైడ్) అని అర్థం. దీన్ని సంక్షిప్తీకరించిన ప్రసాద్ ఈ తుపాకీకి ‘అస్మి’ అని పేరు పెట్టారు. అంతర్జాతీ యంగా ప్రసిద్ధి చెందిన ఇజ్రాయెల్ వెపన్ ఇండస్ట్రీస్ తయారు చేసే ఉజీ, జర్మనీలో తయా రయ్యే హెక్లర్, కోచీ ఎంపీ–5 ఆయుధాలకు దీటుగా ‘అస్మి’ పని చేస్తుందని డీఆర్డీఓ ప్రకటించింది.
అంతర్జాతీయ పోటీని తట్టుకుని..
హైదరాబాద్‌లోని బాలానగర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే లోకేశ్ మిషన్స్ లిమిటెడ్ సంస్థ చిన్న పరిమాణంలో ఆయుధాలు తయారు చేస్తుంది. అయితే అంతర్జాతీయ పోటీని తట్టుకున్న ఈ సంస్థ ‘అస్మి’ తయారీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పటికే పది చొప్పున తుపాకులు తయారు చేసి ఆర్మీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ), అసోం రైఫిల్స్‌కు అందించింది. నాణ్యతపై వాళ్లు పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడంతో తొలి విడతలో ఆర్మీ నార్తర్న్ కమాండ్ 550 తుపాకుల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 28 నాటికి వీటిని అందించడానికి లోకేశ్ మెషీన్స్ లిమిటెడ్ సన్నాహాలు చేస్తోంది. మరోపక్క బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) నుంచి ఈ సంస్థకు పైలట్ ఆర్డర్ వచ్చింది. ‘అస్మి’ ఈ తరహాకు చెందిన ఇతర ఆయుధాల కంటే 10–15 శాతం తక్కువ బరువుతో ఉంటుంది. దీన్ని ఆపకుండా 2,400 రౌండ్ల వరకు కాల్చే అవకాశం ఉంది.
‘అస్మి’ వివరాలివీ..
పేరు: అస్మి
స్వరూపం: సబ్ మెషీన్ గన్
ఖరీదు: ఒక్కోటి రూ.50 వేలు
బరువు: 2.4 కేజీలు
పొడవు: 382 మిల్లీమీటర్లు
క్యాలిబర్: 9 X 19 ఎంఎం
రేంజ్: 100 మీటర్లు
మ్యాగ్‌జైన్: 32 తూటాలు
సామర్థ్యం: నిమిషానికి 800 తూటాలు
పరిశోధనకు పట్టిన సమయం: మూడేళ్ల లోపు
Comments
Please login to add a commentAdd a comment