ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న చుక్క పావని దంపతులు
భూదాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామానికి చెందిన దివ్యాంగుడైన చుక్క నరేశ్, పావని దంపతులు గృహలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోనే మొదటి ప్రొసీడింగ్‌ను అందుకున్నారు. ఆదివారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి.. నరేశ్ ఇంటికి వెళ్లి రూ.3 లక్షల ఆర్థిక సాయానికి సంబంధించిన పత్రాలను అందజేశారు.
శనివారం పోచంపల్లి పర్యటనకు వచ్చిన మంత్రి కేటీఆర్.. కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను ప్రారంభించిన సందర్భంగా అక్కడ మగ్గం పనిచేస్తున్న చుక్క పావని, నరేశ్ కుటుంబం దీనస్థితిని తెలుసుకొన్నారు. వారికి సొంత ఇల్లు లేదని తెలుసుకొని వెంటనే స్పందించిన మంత్రి.. గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ప్రొసీడింగ్‌ను అందజేయాలని అక్కడే ఉన్న కలెక్టర్‌ను ఆదేశించారు.
మంత్రి ఆదేశాల మేరకు ఆదివారం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలసి నరేశ్ ఇంటికి వెళ్లి ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తమ సొంతింటి కల నెరవేరనుండటంతో ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు. కేటీఆర్, ఎమ్మెల్యే, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ చిట్టిపోలు విజయలలక్ష్మిశ్రీనివాస్, సర్పంచ్ కోట అంజిరెడ్డి, ఎంపీటీసీ బత్తుల మాధవి శ్రీశైలంగౌడ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment