సాక్షి, హైదరాబాద్: భారత రక్షణశాఖ అమ్ములపొదిలో మరో కీలక అస్త్రం చేరనుంది. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తయారు చేసిన సీసీపీటీ(క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్) వాహనాలను సోమవారం సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో విడుదల చేయనున్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక రక్షణ ఉత్పత్తులను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది.
ఆర్మ్‌డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(ఏవీఎన్‌ఎల్) ఐదు ఉత్పత్తి యూనిట్లలో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఒకటి. ఏవీఎన్‌ఎల్ ప్రధానంగా ఆర్మ్‌డ్ ఫైటింగ్ వెహికల్స్(మెయిన్ బ్యాటిల్ ట్యాంకులు), మైన్ ప్రొటెక్టెడ్ వెహికల్స్‌ని భారత సైన్యంలోని వివిధ విభాగాల కోసం తయారు చేస్తుంది. ఇప్పటికే టీ–90 ట్యాంక్, టీ–72 ట్యాంక్, బీఎంపీ–2(శరత్ ట్యాంక్), ఎంబీటీ అర్జున్ ఉండగా, యుద్ధక్షేత్రంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా తాజాగా ఈ క్యారియర్ కమాండ్ పోస్ట్ ట్రాక్డ్(సీసీపీటీ) వాహనాన్ని రూపొందించారు.
సీసీపీటీ ప్రత్యేకతలు ఇవీ..
సీసీపీటీని డీఆర్‌డీవోలోని కంబాట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(సీవీఆర్‌డీఈ) రూపొందించింది. అన్ని వ్యూహాత్మక, సాంకేతిక అగ్ని నియంత్రణ విధుల కోసం దీనిని ప్రత్యేకంగా రూపొందించారు. ఆర్టిలరీ గన్‌ల అన్ని వెర్షన్ల ఫైర్ కంట్రోల్ ఫంక్షన్లను సాధించడం కోసం తయారు చేశారు. సీసీపీటీ అనేది అన్ని భారతీయ ఆర్టిలరీ గన్ కమాండ్ పోస్ట్ ఫంక్షన్లకు ఒక సాధారణ వేదికగా పనిచేస్తుంది.
తొలుత 2018లో 43 వాహనాల సరఫరా కోసం మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి ఇండెంట్ ఇచ్చారు. వివిధ దశల్లో రూపొందించిన అనంతరం 2021లో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రెండు సీసీపీటీ వాహనాలు ఉత్పత్తి చేసి, ట్రయల్స్ కోసం భారత సైన్యానికి అప్పగించింది. వివిధ భూభాగాలు, వాతావరణ పరిస్థితులలో ప్రభావవంతంగా పని చేయగలదని ట్రయల్స్‌లో సీసీపీటీ వాహనాలు నిరూపించాయి. దీంతో వాటిని పూర్తిస్థాయిలో సైన్యంలో ప్రవేశపెట్టేవిధంగా సోమవారం వాటిని విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment