Osmania University: Shortage Of Professors For PhD Guideship, Check Details - Sakshi
Sakshi News home page

Osmania University: ఓయూలో పీహెచ్‌డీ పర్యవేక్షణకు ప్రొఫెసర్ల కొరత

Published Thu, Aug 4 2022 5:01 PM | Last Updated on Thu, Aug 4 2022 5:26 PM

Osmania University: Shortage of Professors For Phd Guideship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పర్యవేక్షణకు (గైడ్‌) ప్రొఫెసర్ల తీవ్ర కొరత నెలకొంది. గత 10 సంవత్సరాలుగా నియామకాలు చేపట్టకపోవడంతో అధ్యాపకుల సంఖ్య 1254 నుంచి 362కు తగ్గింది. తాత్కాలికంగా అధ్యాపకులను నియమించి  బోధనను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్యాంపస్‌ కాలేజీలతో పాటు అనుబంధ కాలేజీల్లో 362 మంది పర్మనెంట్‌ అధ్యాపకులు పని చేస్తున్నారు. ఓయూ పరిధిలోని ఐదు జిల్లాల పీజీ కేంద్రాలను కాంట్రాక్టు అధ్యాపకులతోనే నిర్వహిస్తున్నారు. ఓయూలో కాంట్రాక్టు 430, పార్టుటైం అధ్యాపకులు 260 మంది పని చేస్తున్నారు. కాంట్రాక్టు, పార్టుటైం అధ్యాపకులతో పాటు  సుమారు 200 మంది పర్మనెంట్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ అర్హత లేదు. గైడ్‌షిప్‌ గల 162 మంది పర్మనెంట్‌ అధ్యాపకుల వద్ద గతంలో ప్రవేశం పొందిన విద్యార్థులు పీహెచ్‌డీలో కొనసాగుతుండగా కొత్త వారికి అవకాశం దక్కడం లేదు.  


ఆరేళ్ల తర్వాత.. 

ఓయూలో ఆరు సంవత్సరాల తర్వత పీహెచ్‌డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ ఆరేళ్లలో ఓయూనే పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 50 వేలకు పైగా ఉండగా ఇతర వర్సిటీలకు చెందిన వారు మరో 15 వేల మంది ఉన్నారు. గతంలో ఓయూలో 1254 పర్మనెంట్‌ అధ్యాపకులు పనిచేయగా వారిలో సగం మందికి పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ అర్హత ఉండేది. ఒక్క అధ్యాపకుని వద్ద 8 మంది విద్యార్థులకు పరిశోధనలకు అవకాశం కల్పిస్తారు. దీంతో ఏటా పార్ట్‌టైం, ఫుల్‌టైం పీహెచ్‌డీలో సుమారు 4 వేల మందికి ప్రవేశాలు లభించేవి. అయితే అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం వేయి మందికి కూడా పీహెచ్‌డీ అవకాశం దక్కేలా లేదు.  

ప్రైవేటు కాలేజీలకు పీహెచ్‌డీ 
అధ్యాపకుల ఉద్యోగ విరమణ తర్వాత కొత్త వారిని నియమించకపోవడంతో బోధనకు, పరిశోధనకు కొరత ఏర్పడింది. 105 ఏళ్ల ఓయూ చరిత్రలో తొలిసారిగా ఈ విద్య సంవత్సరం నుంచి  ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్‌డీ కోర్సులకు అనుమతినిచ్చారు. ఓయూ పరిధిలోని దరఖాస్తు చేసుకున్న  15 అటానమస్‌ కాలేజీల్లో పని చేసే అర్హత గల అధ్యాపకులకు పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ అవకాశాలను కల్పించారు. ఓయూలో పని చేసే పార్టుటైం, కాంట్రాక్టు అధ్యాపకులు బోధనకే పరిమితం. రెండేళ్ల క్రితం వరకు అర్హత గల కాంట్రాక్టు అధ్యాపకులకు పీహెచ్‌డీ గైడ్‌షిప్‌ అవకాశం ఉండేది. అయితే వివిధ కారణాల నేపథ్యంలో వారికి గైడ్‌షిప్‌ను రద్దు చేశారు. (క్లిక్‌: ఉద్యోగ నోటిఫికేషన్‌లో ట్విస్ట్‌.. అభ్యర్థులకు షాక్‌!)


పాత పద్ధతిలోనే పీహెచ్‌డీ ప్రవేశాలు కొనసాగించాలి  

ఓయూలో పాత పద్దతిలోనే పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించాలి. కొత్త పద్ధతిలో అడ్మిషన్లకు పీహెచ్‌డీ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కొత్త విధానంలో అడ్మిషన్లతో  ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు, యూజీసీ నెట్, జేఆర్‌ఎఫ్‌ సాధించిన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. వీసీ ప్రొ.రవీందర్‌ సొంత నిర్ణయాలు పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తాయి. కాకతీయ వర్సిటీ తరహాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పని చేసే అర్హత గల అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు గైడ్‌షిప్‌ ఇవ్వాలి. కొత్త విధానంతో పీహెచ్‌డీ ప్రవేశాలను చేపడితే అడ్డుకుంటాం.  
– కొర్ర శరత్‌నాయక్‌


పరిశోధనలు కుంటుపడతాయి 

ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్‌డీ చదివితే హాస్టల్‌ వసతి, ఫెలోషిప్‌లకు అవకాశం  ఉండదు. సంపాదించే వయస్సులో పీహెచ్‌డీ చేయడమే ఎక్కువ.. పరిశోధనలకు రూ.లక్షలు ఖర్చు చేయాలంటే పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఆర్థిక భారం అవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, పేద కుటుంబాల విద్యార్థులకు సొంతంగా ఖర్చుపెట్టుకుని పీహెచ్‌డీ చదివే ఆర్థిక స్థోమత ఉండదు. ప్రైవేటు కాలేజీలకు పీహెచ్‌డీ అనుమతితో అధిక శాతం మంది పరిశోధనలు చేయలేరు.  దీంతో పరిశోధనలు కుంటుపడతాయి. ఓయూలో 25 సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల్లో అర్హత గల వారికి  గైడ్‌షిప్‌కు అవకాశం  కల్పించాలి లేదా ఖాళీగా ఉన్న  అధ్యాపక ఉద్యోగాలను భర్తీ చేయాలి.
– బైరు నాగరాజుగౌడ్‌ 


ఓయూ విద్యార్థులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడి 
పాత పద్ధతిలోనే పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించాలని ఆందోళన చేస్తున్న ఓయూ జేఏసీ నాయకులపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పిడిగుద్దుల వర్షం కురిపించారు. బుధవారం ఓయూ పాలన భవనం ప్రవేశ ద్వారం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు వీసీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిపై టాస్క్‌ఫోర్స్‌ పోటీసులు విరుచుకుపడ్డారు. విద్యార్థులపై దాడి చేసి వారిని చెల్లాచెదురు చేశారు.

టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడిలో నవ తెలంగాణ విద్యార్థి సంఘం (ఎన్‌టీవీఎస్‌) రాష్ట్ర అధ్యక్షులు బైరు నాగరాజుగౌడ్‌ సృహ తప్పి పడిపోగా అతడిని ఆసుపత్రికి తరలించారు. ధర్నాలో పాల్గొన్న 27 మంది విద్యార్థులను అరెస్ట్‌ చేసి మలక్‌పేట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల దాడిని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు తీవ్రంగా  ఖండించారు. కొత్త విధానంతో విద్యార్థులు నష్టపోతారని పాత పద్ధతిలోనే పీహెచ్‌డీ ప్రవేశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. (క్లిక్‌: హైదరాబాద్‌ నగరం నలుచెరుగులా ఐటీ విస్తరణ)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement