సూర్యాపేట బోధనాసుపత్రిలో నిర్మాణంలో ఉన్న పీఎస్‌ఏ ఆక్సిజన్ ప్లాంట్
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైద్య వ్యవస్థలు ఆగమాగమయ్యాయి. రెండో వేవ్ అయితే జనం జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనా డెల్టా వేరియంట్ పంజా విసరడంతో లక్షలాది మంది ఆస్పత్రుల పాలయ్యారు. ఆక్సిజన్ దొరక్క, శ్వాస ఆడక నానాయాతన పడ్డారు. ఆక్సిజన్ సకాలంలో అందక ప్రాణాలు కోల్పోయినవారూ ఎందరో! ఇలాంటి నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేదిశగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. లిక్విడ్ ఆక్సిజన్‌ను తెప్పించి రోగులకు అందించడం కంటే.. అక్కడికక్కడే ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్లాంట్లను ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ‘ప్రెషర్ స్వింగ్ అడ్సార్‌ప్షన్ (పీఎస్‌ఏ)’ ఆక్సిజన్ ప్లాంట్లను.. రాష్ట్రవ్యాప్తంగా ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల్లో నెలకొల్పుతోంది. తొలిదశ కింద ఇప్పటికే ఐదు ప్లాంట్ల నిర్మాణం పూర్తయింది. రెండో ఫేజ్‌లో 45 ప్లాంట్ల నిర్మాణం చేపట్టగా.. 39 ప్లాంట్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. మిగతావాటి పనులు కూడా చివరి దశలో ఉన్నాయి. అన్నింటి నిర్మాణం పూర్తయ్యాక.. వచ్చే నెలలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వైద్యారోగ్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో 7,670 ఆక్సిజన్ పడకలు ఉన్నాయని.. త్వరలో ఈ సంఖ్య భారీగా పెరగనుందని పేర్కొన్నాయి.
వేల సంఖ్యలో బెడ్లకు..
నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లు కలిపి 50 ఆస్పత్రుల్లో 27,792 పడకలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. వీటిన్నింటిలో కలిపి మొత్తం గా నిమిషానికి 67,100 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయవచ్చని అధికారులు తెలిపారు. ఇవేగాకుండా మరో 33 ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. ఇవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక.. సాధారణ వైద్య సేవలతోపాటు అత్యవసర చికిత్సలకు ఆ క్సిజన్ కొరత ఉండబోదని పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య రంగంలో ఇది కీలకమైన అడుగు అని అన్నారు.
ఇప్పటిదాకా బయటి నుంచి తెచ్చి..
►ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు అవసరమైన ఆక్సిజన్ రెండు పద్ధతుల ద్వారా సరఫరా అవుతోంది.
►ఒక పద్ధతి ప్రకారం ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి వాటి ద్వారా రోగులకు అందజేస్తున్నారు. వివిధ కంపెనీల నుంచి ఈ సిలిండర్లను కొనుగోలు చేస్తారు. ఖాళీ అయినకొద్దీ రీఫిల్ చేయించుకోవాల్సి ఉంటుంది. కరోనా సమయం నుంచి డిమాండ్ పెరగడంతో ఈ సిలిండర్ల కొరత ఏర్పడింది. అడ్డగోలు రేట్లకు కొనాల్సిన పరిస్థితి నెలకొంది.
►లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా సరఫరా చేయడం రెండోది. పెద్ద పెద్ద కంపెనీల నుంచి నేరుగా టన్నుల కొద్దీ లిక్విడ్ ఆక్సిజన్‌ను కొనుగోలు చేస్తారు. ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసుకునే భారీ ట్యాంకుల్లో దానిని నింపి.. పైపులైన్ల ద్వారా వార్డుల్లో పేషెంట్లకు అందిస్తారు. అయితే ఈ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా సక్రమంగా లేకపోవడం, జాప్యం, లీకేజీలు వంటి సమస్యలతో రోగులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
►ప్రస్తుతం చాలా వరకు ప్రైవేట్ ఆస్పత్రులు సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్‌ను రోగులకు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పి సరఫరా చేస్తున్నారు.
ఇక ముందు నేరుగా..
నేరుగా గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ‘పీఎస్‌ఏ’ప్లాంట్లను ప్రభుత్వాస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్లాంట్లు గాలిని ప్రాసెస్ చేసి 94 శాతం నుంచి 96 శాతం వరకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని పైపుల ద్వారా వార్డులకు, బెడ్స్‌కు అనుసంధానం చేసి.. రోగులకు అందజేస్తారు. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. వాటి పక్కనే పీఎస్‌ఏ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. రెండింటినీ అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ ఆక్సిజన్ అందుబాటులో ఉంటే.. దానిని వాడుకునే వీలు కలుగనుంది. ఈ ఏర్పాటుతో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడబోదని అధికారులు అంటున్నారు. గతంలో లాగా ఆక్సిజన్‌ను కొనాల్సిన అవసరం ఉండదని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకోవచ్చని చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment