ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముద్దుముద్దుగా పసిపిల్లలు అమ్మా.. అని పిలిస్తే చిలక పలుకులంటూ.. మురిసిపోతాం. అలాంటిది, నిజంగానే రామచిలుకే అమ్మా.. అంటుంటే.. కుటుంబ సభ్యుల్ని వారి పేర్లతో పిలుస్తుంటే.. ఆ ఆనందమే వేరు. వివరాలివి.
సిద్దిపేట హౌసింగ్ బోర్డుకాలనీలోని జర్నలిస్ట్ వీధిలో కూతురు రాజిరెడ్డి, వనజ రెడ్డిల ఇంటి పైకి రోజూ ఓ రామచిలుక వచ్చి సందడి చేస్తోంది. నెల రోజులుగా రోజూ ఉదయం 6గంటలకే వచ్చి కుటుంబ సభ్యులను నిద్ర లేపుతుంది. చిన్నారులతో ఆడుకుంటుంది. వనజరెడ్డిని అమ్మా.. అని, పిల్లలను టింకు.. అని పిలుస్తుంది.
ఎత్తుకో, టాటా, బాయ్ అంటుంది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, కాలనీవాసులు సంబరపడిపోతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 7.30 గంటల వరకు ఉండి పాలు, నీరు తాగుతుంది. జామ, మామిడి, ఆపిల్, తదితర పండ్లు, బిస్కెట్లు తిని వెళ్లిపోతుంది.
సాయంత్రం 5గంటల సమయంలో వచ్చి మళ్లీ 6 గంటల వరకు తిరిగి వెళ్లిపోతుంది. ఈ చిలుక ఎక్కడి నుంచి వస్తుంది...ఎక్కడికి పోతుందనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. నెల రోజులుగా ఈ రామచిలుక రాజిరెడ్డి, వనజరెడ్డిల కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోయింది.
శ్రీరాముడే వచ్చినట్టుంది
రామచిలుక రోజూ మా ఇంటికి వచ్చి అమ్మా. అని పిలుస్తుంటే సంతోషంగా ఉంది. శ్రీ రామనవమి ముందు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి.. శ్రీ రాముడే వచ్చినట్టు అనిపిస్తోంది. – వనజరెడ్డి, సిద్దిపేట
Comments
Please login to add a commentAdd a comment