కరోనా ఇప్పటికే జనంలోకి వెళ్లిపోయింది. ఇంట్లో ఒకరికి వస్తే మిగిలిన వారికి వ్యాపించే ప్రమాదం నెలకొంది. మన దేశంలో వైరస్ 800 రకాలుగా పరివర్తనం చెందింది. అందుకే ఈ విజృంభణ. కాబట్టి ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలి. ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు.
- డాక్టర్ శ్రీనివాసరావు, ప్రజారోగ్య డైరెక్టర్
కరోనా రోగులతో ఆసుపత్రులు కిక్కిరిసి పోతున్నాయి. అత్యవసర పడకలు దొరకట్లేదు. ఆక్సిజన్‌కు తీవ్రమైన కొరత నెలకొంది. బాధితులు పడకల కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది.
- డాక్టర్ కృష్ణ ప్రభాకర్, సిటీ న్యూరో ఆసుపత్రి
సాక్షి, హైదరాబాద్: మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో జనం తీవ్రమైన ఆందోళనల్లోకి వెళ్లిపోయారు. కొం దరు వ్యాక్సిన్ల కోసం, మరికొందరు నిర్ధారణ పరీ క్షల కోసం, ఇంకొందరు ఆసుపత్రుల్లో పడకల కోసం పరుగులు తీస్తున్నారు. దాదాపు ప్రతి 3 కుటుంబాల్లో ఒక కుటుంబం ఇప్పుడు పై మూడు పనుల్లోనే నిమగ్నమైందని వైద్య, ఆరోగ్య శాఖ అంచనా వేసింది. వ్యాక్సిన్లు, టెస్ట్ కిట్లు, కరోనా పడకలు మూడింటికీ కొరత ఏర్పడటంతో మరింత ఆందోళన చెందుతున్నారు. ఏ ఒక్కరిని కదిలించినా తమకు తెలిసిన లేదా తమ బంధువుల్లో కొందరికి కరోనా వచ్చిందంటూ చెబుతున్నారు. అధికారికంగా నమోదవుతున్న కేసులే భయాందోళనకు గురిచేస్తుంటే.. ప్రభుత్వ అనుమతి లేకుండా అనేక ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లలో చేస్తున్న పరీక్షలు, కేసులు లెక్కలోకి రావట్లేదని అధికారులే పేర్కొంటున్నారు.
క్లస్టర్ దశలో కేసులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) లెక్కల ప్రకారం ప్రపంచంలో 70 శాతం దేశాలు కరోనా సామాజిక వ్యాప్తి దశలో ఉన్నాయి. ఇండియా క్లస్టర్ దశలో ఉందని ప్రకటించింది. క్లస్టర్ దశ అంటే గత 14 రోజుల్లో కేసులు అధికంగా నమోదైనా, అవి ఎక్కువగా ఒక ప్రాంతానికి చెందినవిగా ఉంటాయి. బయట ప్రాంతం కేసులతో సంబంధం లేకుండా రావడం. మార్కెట్లో లేదా పెళ్లిళ్లలో ఇలా కొన్నిచోట్ల విజృంభించడం. ఇలా వస్తే క్లస్టర్లు అంటారు. చాలావరకు కేసులు మనం గుర్తించని రీతిలో నమోదైనవి ఉంటాయి. దీనివల్ల ఆయా ప్రాంతాల వారికే వస్తాయి. మొదటి వేవ్‌లో దేశవ్యాప్తంగా విస్తరించింది. సెకండ్ వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లోనే ఎక్కువగా విస్తరించింది. ఫస్ట్‌వేవ్‌లో నమోదైన కేసుల్లో 50 శాతం 40 జిల్లాల్లో ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో 20 జిల్లాల్లోనే 50 శాతం కేసులు నమోదయ్యాయి. మొదటి వేవ్‌లో 75 శాతం కేసులు 60 నుంచి 100 జిల్లాల్లో నమోదు కాగా, సెకండ్ వేవ్‌లో 75 శాతం కేసులు 20 నుంచి 40 జిల్లాల్లోనే ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో కొన్నిచోట్ల మరింత ఎక్కువగా ఉన్నాయి. సెకండ్ వేవ్‌లో నమోదైన 80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. యాక్టివ్ కేసుల్లో 63 శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, చత్తీస్‌గఢ్, కేరళలో నమోదయ్యాయి.
రాష్ట్రంలో సెప్టెంబర్ కంటే ఎక్కువగా
ప్రస్తుతం దేశంలో 63 శాతం యాక్టివ్ కేసులున్న ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌లు తెలంగాణకు సరిహద్దులుగా ఉండటం వల్ల ఇక్కడ అధిక కేసులు నమోదవుతున్నాయి. ఆయా రాష్ట్రాల ప్రభావం మనపై తీవ్రంగా ఉంది. అందుకే నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా కేసులు కన్పిస్తున్నాయి. ఫస్ట్ వేవ్‌లో సెప్టెంబర్ 18 నాటికి దేశంలో కరోనా పీక్ దశలో ఉంది. ఆ రోజు యాక్టివ్ కేసులు 10.17 లక్షలుంటే, ఈ నెల 18న 19.29 లక్షలు ఉన్నాయి. అంటే దాదాపు రెట్టింపు కేసులు రెండు నెలల్లోనే నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. తెలంగాణలో గత సెప్టెంబర్ 18న 30,673 యాక్టివ్ కేసులుంటే, ఈ ఏప్రిల్ 18న 39,154 యాక్టివ్ కేసులున్నాయి.
సామాజిక వ్యాప్తికి దగ్గరలో
క్లస్టర్ దశను దాటి ఇప్పుడు సామాజిక వ్యాప్తికి దగ్గరలో ఉన్నామని వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఆ పరిస్థితి ఎక్కువగా కన్పిస్తోందని పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం గడిచిన 28 రోజుల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోతే కరోనా లేనట్లు అర్థం. గత 14 రోజుల్లో కేసులు గుర్తించడం.. ఇతర దేశాల నుంచి రావడాన్ని స్పొరాడిక్ లేదా ఇంపోర్టెడ్ దశ అంటారు. అంటే ఇక్కడ కేసులు పుట్టుకుని రాకపోవడం. ఇక క్లస్టర్ దశలో గత 14 రోజుల్లో కేసులు నమోదై అవి ఎక్కువగా ఒక ప్రాంతానికి చెందినవిగా ఉండటం. బయట ప్రాంతం కేసులతో సంబంధం లేకుండా రావడం. నాలుగోది సామాజిక వ్యాప్తి. అన్ని ప్రాంతాల్లోకి వైరస్ విస్తరించి ఉండటం. ఇందులో మళ్లీ నాలుగు దశలు ఉంటాయి. ఒకటి గత 14 రోజుల్లో విపరీతంగా పెరగడం.. క్లస్టర్‌తో సంబంధం లేకుండా పెరగడం. ఎలా కేసులు పెరుగుతున్నాయో తెలియనంతగా నమోదు కావడం. చిన్న ప్రాంతాల్లో కూడా ఇబ్బడిముబ్బడిగా కేసులు నమోదు కావడం. ఇలా ఉన్నా ఈ దశలో సాధారణ వ్యక్తులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. 2) 14 రోజుల్లో బాగా కేసులు వస్తాయి. సాధారణ ప్రజలకు మధ్య స్థాయి రిస్క్ ఉంటుంది. 3) సామాజిక వ్యాప్తి ఉంటుంది. 14 రోజుల్లో కేసులు బాగా వస్తాయి. అయితే కేసులు చాలా వరకు హైరిస్క్‌లోకి వెళ్తాయి. 4) నాలుగో దశలో సామాజిక వ్యాప్తి మరింత ఉధృతంగా ఉంటుంది. మరింత హైరిస్క్‌లోకి జనం వెళ్తారు. ఇంట్లో వారికి కూడా కరోనా సోకుతుంది. మన రాష్ట్రంలోనూ వివిధ జిల్లాల్లో సామాజిక వ్యాప్తికి సమీపంలో ఉన్నామని వైద్య నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రను ఆనుకుని ఉన్న ప్రాంతాలు మరింత హైరిస్క్‌లో ఉన్నాయి. హైదరాబాద్ కూడా హైరిస్క్‌లో ఉందని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment