‘బొగత’కు జనకళ.. వాహ్‌ మహబూబ్‌ ఘాట్‌ | Photo Feature in Telugu: Bogatha Waterfall, Mahabub Ghat, Jurala Project | Sakshi
Sakshi News home page

‘బొగత’కు జనకళ.. వాహ్‌ మహబూబ్‌ ఘాట్‌

Published Mon, Aug 2 2021 5:29 PM | Last Updated on Mon, Aug 2 2021 5:52 PM

Photo Feature in Telugu: Bogatha Waterfall, Mahabub Ghat, Jurala Project - Sakshi

ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని బొగత జలపాతం వద్ద చాలా రోజుల తర్వాత పర్యాటకుల సందడి నెలకొంది. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జలపాతం అందాలను తిలకించి ఫొటోలు, సెల్ఫీలు దిగారు. అనంతరం గుట్టపై ఉన్న లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు.      
– వాజేడు 


వాహ్‌ మహబూబ్‌ ఘాట్‌ 

చుట్టూ ఎత్తయిన కొండలు... చెట్లతో ఎటు చూసినా పచ్చ తివాచి పరిచినట్లు కనిపించే ప్రకృతి అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. పచ్చదనం మధ్యలో నల్లతాచు పాములా కనిపించే రోడ్డు మలుపులు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. నిర్మల్‌ సమీపంలోని మహబూబ్‌ ఘాట్‌ వద్ద కనిపించే ఈ దృశ్యాలు ప్రకృతి రమణీయతకు అద్ధం పడుతున్నాయి. మనసుకు ఆహ్లాదాన్నిచ్చే మహబూబ్‌ ఘాట్‌ అందాలను ‘సాక్షి’కెమెరా క్లిక్‌మనిపించింది.            
– సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్‌


జూరాల ప్రాజెక్టు 36 గేట్లు ఎత్తివేత 

ధరూరు (గద్వాల): జూరాలకు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు 4,27,800 క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. దీంతో 36 గేట్ల ద్వారా 3,63,993 క్యూసెక్కుల నీటిని దిగవకు విడుదల చేస్తున్నారు. మొత్తం ఔట్‌ఫ్లో 3,66,006 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.557 టీఎంసీల నీరు నిల్వ ఉంది.     


పుడమి పచ్చకోక కట్టినట్టు.. 

కనుచూపు మేర పచ్చటి పొలాలు.. ఆకాశంలో కమ్ముకుంటున్న కారుమేఘాలు.. మధ్యలో పచ్చని చెట్లు.. పైర్లు.. భూమికి పచ్చని రంగేసినట్టు ఎటు చూసినా పచ్చదనంతో సింగారించుకున్న సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ శివారు ప్రాంతమిది.  
– ఫొటో: కె.సతీష్, స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, సిద్దిపేట  


సుందర జలపాతం.. వెళ్లడం కష్టం 

కొండలపై నుంచి జాలువారుతున్న ఈ జలపాతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కట్టుమల్లారం సమీపంలోని రథంగుట్టపై ఉంది. ఇది దాదాపు వర్షాకాలం పొడవునా జాలువారుతూనే ఉంటుంది. అయితే దీని వద్దకు వెళ్లేందుకు మాత్రం దారిలేదు. మూడేళ్ల క్రితం పై భాగానికి వెళ్లే యత్నంలో ఓ యువకుడు రాళ్లపై నుంచి జారిపడి మృతిచెందాడు. అప్పట్నుంచి ఎవరూ ఈ జలపాతం వద్దకు వెళ్లట్లేదు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. 
– మణుగూరుటౌన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement