ఏటా శీతాకాలంలో కపోతాల రేసింగ్స్‌  | Pigeon Racing Bets Are Held In Country And Abroad | Sakshi
Sakshi News home page

ఏటా శీతాకాలంలో కపోతాల రేసింగ్స్‌ 

Published Sat, Jan 8 2022 2:14 AM | Last Updated on Sat, Jan 8 2022 12:14 PM

Pigeon Racing Bets Are Held In Country And Abroad - Sakshi

♦ ఒకప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లిన సైనికులు సందేశాలను బేస్‌ క్యాంప్‌లకు పంపడానికి పావురాలను వినియోగించే వాళ్లు. ప్రస్తుతం పీజియన్‌ క్లబ్బుల సభ్యులు ఎలాంటి బహుమతులు, నగదు లావాదేవీల వంటివి లేకుండా కేవలం సరదా, పేరు కోసం వీటితో పందేలు నిర్వహిస్తున్నారు. 

♦ క్లబ్బులు కనిష్టంగా 50 కి.మీ. (వాయుమార్గం) దూరంతో పోటీలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌లోని క్లబ్బులు గరిష్టంగా 1,000 కి.మీ, చెన్నై కేంద్రంగా పని చేసేవి 1,700 కి.మీ వరకు దూరంతో పందాలు నిర్వహిస్తున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కోడి, పొట్టేళ్లు, ఎడ్ల పందేలు ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే కార్‌ రేసింగ్, బైక్‌ రేసింగ్‌లూ అందరికీ తెలిసినవే. కానీ పావురాలతో కూడా పెద్దయెత్తున దేశ, విదేశాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు కేంద్రంగా ఏర్పడిన అనేక క్లబ్బులు, సొసైటీలు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.

హైదరాబాద్‌తో పాటు చెన్నై, కర్నూలు, దేశంలోని మరికొన్ని నగరాల్లో కూడా పీజియన్‌ క్లబ్బులు ఉన్నాయి. యంగర్స్, ఓపెన్, డర్బీ కేటగిరీల్లో పోటీలు జరుగుతుండటం గమనార్హం. ఎక్కడో వెయ్యి, అంతకు మించిన దూరంలో వదిలిపెట్టిన తర్వాత తిరిగి ఎంత సమయంలో అవి వాటి యజమానుల ఇళ్లకు చేరుకున్నాయన్నది నిర్దిష్ట పద్దతిలో లెక్కించి నిర్వాహకులు విజేతను ప్రకటిస్తున్నారు.  

దేశ వ్యాప్తంగా 250 క్లబ్బులు 
కోడి పందాలు, ఇతర పోటీల స్థాయిలో ప్రాచుర్యం లేకపోయినా పావురాల పందాలు ఏటా జరుగుతున్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా కూడా పోటీలు జరుగుతున్నాయి. ఇటీవల ఖమ్మం జిల్లాలో, ఇతర ప్రాంతాల్లో చైనా భాషతో కూడిన స్క్రాచ్‌ కార్డ్స్‌తో దొరికినవి ఇలాంటి పోటీల్లో పాల్గొన్న పావురాలే. ఇలాంటి పందాలు నిర్వహించడానికి దేశ వ్యాప్తంగా 250 వరకు గుర్తింపు పొందిన క్లబ్బులు ఉండటం గమనార్హం. ఒక్క చెన్నైలోనే 60 నుంచి 70 రిజిస్టర్డ్‌ సొసైటీలు ఉన్నాయి.

హైదరాబాద్‌లో హైదరాబాద్‌ హోమర్‌ పీజియన్స్‌ క్లబ్‌ (హెచ్‌ఎస్‌పీసీ), డెక్కన్‌ పీజియన్స్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ (డీపీఎస్‌సీ), హైదరాబాద్‌ హోమ్‌ పీజియన్‌ క్లబ్‌ (హెచ్‌హెచ్‌పీసీ) కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. అధికారికంగా రిజిస్టర్‌ చేసుకుని.. పోలీస్, అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే పోటీలు నిర్వహిస్తారు. వీటి నిర్వాహకులను పలకరిస్తే అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. 

ఇప్పటికీ బ్రిటిష్‌ బ్లడ్‌లైనే.. 
మనుషుల్లో మాదిరిగానే కపోతాల్లో బ్లడ్‌ లైన్‌ (వంశం) ఉంటుంది. దశాబ్దాల క్రితం బ్రిటిషు వాళ్లు తీసుకువచ్చిన నెదర్లాండ్స్, బెల్జియం, యూరప్‌లకు చెందిన పావురాల బ్లడ్‌ లైనే (ఉమర్స్‌) ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలోని చాలా క్లబ్బులు ఉమర్స్‌ జాతికి చెందిన పావురాలనే ఎక్కువగా పందాల కోసం వాడుతున్నాయి.

ప్రత్యేకంగా వెబ్‌సైట్స్, సహకరించే యాప్స్‌తో పాటు వాట్సాప్‌ గ్రూపుల సాయంతో పక్కా మాన్యువల్స్‌తో పని చేస్తుంటాయి. పందెం నిర్వహించే ఏడాది పుట్టిన వాటికి యంగర్స్‌ శ్రేణిలో, మిగిలిన వాటిని ఓపెన్‌ శ్రేణిలో రేసులు జరుగుతాయి. గతంలో జరిగిన పందాల్లో గెలిచిన వాటికి ప్రత్యేకంగా డర్బీ కేటగిరీ ఉంటుంది.

ప్రత్యేక శిక్షణతో శీతాకాలంలోనే పందాలు 
వాతావరణ అనుకూలత దృష్ట్యా ప్రతి ఏడాదీ శీతాకాలంలో మాత్రమే ఈ పందాలు జరుగుతాయి. ఈ క్లబ్‌లలో సభ్యులుగా> ఉన్న వాళ్లు పదులు, వందల సంఖ్యలో పావురాలను పెంచుకుంటున్నారు. వీటికి ప్రతి రోజూ అరగంట, పందాల సీజన్‌లో దాదాపు రెండు గంటల పాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ప్రత్యేకంగా తాగునీరు, ఆహారం అందజేస్తారు. వీటికి తమను పెంచే యజమాని ఇల్లు బాగా గుర్తుండిపోతుంది. ఒక్కో యజమాని గరిష్టంగా 32 పావురాలను పందెంలోకి దింపవచ్చు.

ఈ పావురాలు పుట్టిన ఏడెనిమిది రోజుల్లోనే వాటి కాలుకు క్లబ్‌కు చెందిన రింగు తొడుగుతారు. ఇంటికి దూరంగా మరెక్కడో పందెంలో దించేప్పుడు ఈ రింగులపై స్క్రాచ్‌ కార్డ్‌తో కూడిన ట్యాగ్‌ అతికిస్తారు. ప్రస్తుతం ఇవి చైనాలో తయారై భారత్‌కు వస్తున్నాయి. పావురం వదిలిన ప్రాంతం నుంచి పావురం యజమాని ఇంటికి చేరిన వెంటనే ట్యాగ్‌ను స్క్రాచ్‌ చేసి, అక్కడ ఉన్న సంఖ్యను ప్రత్యేక యాప్‌ ద్వారా ఫొటో తీసి తమ క్లబ్‌ వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తుంటారు.

వీటిలోని సమాచారం ఆధారంగా పావురం ప్రయాణించి సమయం, ఇతర వివరాలు పరిగణనలోకి తీసుకుని నిర్వాహకులు గెలిచిన పావురాన్ని ప్రకటిస్తారు. ఈ వివరాలు ప్రపంచంలోని అన్ని క్లబ్బులకూ చేరవేస్తారు. తద్వారా క్లబ్బుల వివరాలు, పావురాల విశిష్టత తదితరాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతాయన్న మాట. రాష్ట్రంలోని షాద్‌నగర్, మెదక్‌ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో పీజియన్‌ రేసింగ్‌ క్లబ్‌లు ఈ పోటీలు నిర్వహిస్తున్నాయి. 

దాడులు తప్పించుకునేందుకు దారి తప్పి 
పావురాలను నిర్ణీత ప్రాంతానికి తీసుకువెళ్లే నిర్వాహకులు అక్కడ ఒకేసారి విడిచిపెడతారు. అవన్నీ గుంపులుగానే ప్రయాణిస్తాయి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఈ పావురాలు ఎగురుతాయి. మధ్యలో ఏదో ఒక చోట సేదతీరి, ఆహారం సేకరించి మళ్లీ ప్రయాణం ప్రారంభిస్తాయి. రోజుకు 100 నుంచి 110 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయని అంచనా. కొన్ని సందర్భాల్లో పావురాలు గుంపును వదిలి పక్కకు వస్తుంటాయి.

అలాంటి వాటిపై గద్దలు వంటి పక్షులు దాడులకు దిగుతాయి. అలాంటప్పుడు పావురాలు తమ ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయాణించాల్సిన మార్గం వదిలి వేరే మార్గంలో ప్రయాణిస్తాయి. ఇలాంటివే ఇటీవల ఖమ్మం తదితర ప్రాంతాల్లో కనిపించాయి. వాటి కాళ్లకు ఉన్న స్క్రాచ్‌ కార్డులపై ఉన్న చైనా అక్షరాలను చూసి అంతా అనుమానించారు. అయితే ఇవి పందెం పావురాలని తేలడంతో ఉత్కంఠకు తెరపడింది. ఈ పావురాలు ప్రాణాలతో ఉంటే మాత్రం కాస్త ఆలస్యమైనా తమ యజమాని ఇంటికి వచ్చేస్తాయని నిర్వాహకులు చెబుతున్నారు.

‘ఈ పందాల్లో ఎక్కడా నగదు లావాదేవీలు, బహుమతులు ఉండవు. కేవలం గెలిచిన వాటికి ఓ ట్రోఫీ లభిస్తుంది. ఆ పేరుతో పాటు గెలుపొందిన పావురానికి పుట్టే పిల్లలకు (బ్రీడ్‌) మంచి డిమాండ్‌ ఉంటుంది. వీటిని కనిష్టంగా రూ.5 వేలు, గరిష్టంగా రూ.80 వేలకు అమ్మొచ్చు. హాబీగానూ, పేరు కోసం, ఇలా అమ్ముకునేందుకే పావురాలను పెంచి, పందాల్లో పాల్గొంటాం’అని ఓ క్లబ్‌ సభ్యుడు తెలిపారు.  

కళ్లు, రెక్కలే సామర్థ్యానికి కొలమానం 
ఈ పావురాల శక్తిసామర్థ్యాలను వాటి కళ్లు, రెక్కలను బట్టి నిర్థారిస్తారు. వీటిని పరిశీలించిన నేపథ్యంలో అది ఎంత దూరం ఎగరగలుగుతుంది? ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అనేవి తెలుసుకుంటారు. రేసుల్లో పాల్గొనే గుర్రాలకు చరిత్ర ఉన్నట్లే... ఈ పావురాలకూ ప్రొఫైల్‌ ఉంటుంది. వీటికి కాళ్లకు వేసే రింగుకు ఉండే ఐదంకెల నంబర్‌ ఆధారంగా ‘పెడిగ్రీ’గా పిలిచే ఈ చరిత్రను రికార్డుల్లోకి ఎక్కిస్తారు.

అందులో పావురం వయస్సు, దాని పుట్టుక వివరాలు, అవి ఏ రేసుల్లో పాల్గొన్నాయి? ఎన్నింటిలో గెలిచాయి? ఎంతెంత దూరం ఎగిరాయి? తదితర అంశాలు పొందుపరుస్తారు. వీటన్నిటినీ బట్టి ఆయా పావురాల సంతతికి డిమాండ్‌ ఉంటుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement