ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొత్తగా ప్రారంభించనున్న ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ ఎంఎంటీఎస్ మార్గాన్ని మరో 6 కిలోమీటర్లు పొడిగిస్తే చాలు.శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులు సికింద్రాబాద్ నుంచి నేరుగా ఎయిర్‌పోర్టు వరకు వెళ్లిపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకొనే ప్రయాణికులు అక్కడి నుంచి నేరుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
ఎంఎంటీఎస్ రెండో దశకు కేంద్రం ఈ ఏడాది రూ.600 కోట్లు కేటాయించింది. మరో రూ.300 కోట్లు కేటాయిస్తే ఉందానగర్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఆరు కిలోమీటర్లు కొత్త లైన్‌లు నిరి్మంచడంతో పాటు విద్యుదీకరణ, స్టేషన్‌ల నిర్మాణం పూర్తవుతుంది. అధునాతన ఎంఎంటీఎస్ రైళ్లను ఎయిర్‌పోర్టు వరకు నడపవచ్చు. ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టులోనే ఎయిర్‌పోర్టు వరకు కనెక్టివిటీని ప్రతిపాదించినప్పటికీ అప్పట్లో ఎయిర్‌పోర్టులో రైల్వేస్టేషన్ ఏర్పాటుకు జీఎమ్మార్ సంస్థ అంగీకరించకపోవడంతో ఆ ప్రాజెక్టు వాయిదా పడింది. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టింది. ఎయిర్‌పోర్టులో మెట్రో స్టేషన్‌తో పాటు, మెట్రో డిపోను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలోనే మెట్రోకు సమాంతరంగా ఎంఎంటీఎస్‌ను కూడా అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. రైల్వేస్టేషన్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం జీఎమ్మార్ సంస్థను ఒప్పించగలిగితే ఎంఎంటీఎస్ పరుగులు పెడుతుందని రైల్వేవర్గాలు పేర్కొంటున్నాయి.
తక్కువ చార్జీలతో ప్రయాణం
ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ చార్జీలు కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.15 వరకు ఉన్నాయి. ఎయిర్‌పోర్టు వరకు రైల్వేసేవలను విస్తరిస్తే ఈ చార్జీలు రూ.25 కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కేవలం విమాన ప్రయాణికులే కాకుండా ఉద్యోగులు, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నగరానికి కూరగాయలు, పాలు తదితర వస్తువులను తెచ్చి విక్రయించే చిరువ్యాపారులు, విద్యార్థులకు మెరుగైన రవాణా సదుపాయాలు లభిస్తాయి. అదే సమయంలో ఎయిర్‌పోర్టులో పనిచేసే ఉద్యోగులు కూడా తక్కువ చార్జీలతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించగలుగుతారు. సికింద్రాబాద్ నుంచే కాకుండా లింగంపల్లి, హైటెక్‌సిటీ, బేగంపేట్, తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు కూడా నేరుగా విమానాశ్రయానికి వెళ్లేందుకు అవకాశం లభిస్తుంది. ఎయిర్‌పోర్టులో అతి తక్కువ విస్తీర్ణంలోనే ఎంఎంటీఎస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. కానీ జీఎమ్మార్ ససేమిరా అనడంతో ఉందానగర్ వరకు లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పూర్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖ ప్రత్యేకంగా ఈ రూట్‌పైన దృష్టి సారించి జీఎమ్మార్‌ను ఒప్పించగలిగితే వేలాది మందికి తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తుంది. ఈ ఒక్క రూట్ పూర్తయితే ఎంఎంటీఎస్–2 సమగ్రమవుతుంది.
అన్ని సదుపాయాలు ఉండాల్సిందే..
ప్రస్తుతం సుమారు రూ.6 వేల కోట్లకు పైగా అంచనాలతో రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని ప్రభుత్వం చేపట్టింది. నాగోల్, ఉప్పల్ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణికులు రాయదుర్గం మీదుగా ఎయిర్‌పోర్టుకు వెళ్లవచ్చు. ఈ రూట్‌లో మెట్రో అవసరమే. కానీ కేవలం రూ.300 కోట్లతో 6 కిలోమీటర్‌లు పూర్తి చేస్తే ఎంఎంటీఎస్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. మెట్రో, ఎంఎంటీఎస్ కూడా వినియోగంలోకి వస్తే ప్రపంచంలోని వివిధ నగరాల్లో ఉన్నట్లుగానే ఎయిర్‌పోర్టుకు విస్తృతమైన ప్రజారవాణా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment