Hyderabad: PM Narendra Modi Speech At icrisat 50th Anniversary Celebration Details Here - Sakshi
Sakshi News home page

ఈ మూర్తి.. జగతికి స్ఫూర్తి

Published Sat, Feb 5 2022 4:03 PM | Last Updated on Sun, Feb 6 2022 8:21 AM

PM Narendra Modi Speech At icrisat 50th Anniversary Celebration - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జగద్గురు రామానుజాచార్యుల బోధనలు, ఆయన చాటిన ఆధ్యాత్మిక చైతన్యమే వేల ఏళ్ల బానిసత్వంలోనూ భారతీయులను చైతన్యవంతులుగా నిలిపాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్లాఘించారు. ఆయన చూపిన మార్గం ప్రపంచానికే ఆదర్శమని చెప్పారు. నాటి స్వాతంత్య్ర పోరాటం అధికారం, హక్కుల కోసమే కాకుండా వేల ఏళ్ల సంస్కృతి పరిరక్షణ కోసం జరిగిందని తెలిపారు. ఆ పోరాటంలో పాటించిన ఆధ్యాత్మిక, మానవీయ విలువలు మనకు రామానుజాచార్యుల వంటి వారి బోధనల నుంచే లభించాయన్నారు. ప్రధాని మోదీ శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామానుజుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 216 అడుగుల భారీ రామానుజాచార్యుల విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ వివరాలు ప్రధాని మాటల్లోనే.. 

ఆయన విలువలు, ఆదర్శాలే మార్గం 
‘‘రామానుజులు దక్షిణాదిలో జన్మించినా ఆయన బోధనలు దేశమంతటా విస్తరించి ఏకత్వాన్ని బోధించాయి. ఆయనను పరమ గురువుగా చిరస్థాయిలో నిలిపాయి. రామానుజులు తన బాగుకంటే జీవకోటి సంక్షేమానికే ఎక్కువ ఆరాటపడ్డారు. ఎంతో శ్రమకోర్చి నేర్చుకున్న గురుమంత్రాన్ని రహస్యంగా ఉంచాలనే గురువు మాటను కాదని.. తాను నరకానికి వెళ్లినాసరే మిగతా వారికి మేలు కలగాలనే ఉద్దేశంతో ఆలయ శిఖరంపైకి ఎక్కి అందరికీ మంత్రాన్ని ఉపదేశించారు. జగద్గురు రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి మార్గనిర్దేశం కావాలని కోరుకుంటున్నాను. మనం అనుసరిసున్న విలువలు, ఆదర్శాలను మనం ఈరోజు రామానుజాచార్యుల విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్నాం. రామానుజుల మార్గం రాబోయే సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ప్రాచీన భారతీయతను కూడా బలోపేతం చేస్తుంది. 

విశిష్టాద్వైత బోధనతో.. 
అంబేద్కర్‌ వంటివారు రామానుజాచార్యులను ప్రశంసించడంతోపాటు ఆయన బోధనల నుంచి నేర్చుకోవాలని అనేవారు. మన దేశంలో పూర్వకాలం నుంచీ వివిధ వాదాలు, సిద్ధాంతాలను విశ్లేషించి స్వీకరించడమో, తిరస్కరించడమో కాకుండా.. అందులోని మంచిని వివిధ రూపాల్లో ఆచరించే సాంప్రదాయం ఉండేది. అదే రీతిలో రామానుజాచార్యులు కూడా అద్వైత, ద్వైత సిద్ధాంతాలను సమ్మిళితం చేసి విశిష్టాద్వైతాన్ని ప్రతిపాదించారు. తన బోధనల్లో కర్మ సిద్ధాంతాన్ని ఉత్తమ రీతిలో ప్రస్తావించడంతోపాటు స్వయంగా తన పూర్తి జీవితాన్ని అందుకోసమే సమర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం చర్చిస్తున్న ప్రగతిశీలత, సామాజిక సమస్యల పరిష్కారం వంటి ఎన్నో అంశాలను రామానుజులు తన సంస్కృత, తమిళ గ్రంథాల్లో ఎప్పుడో లేవనెత్తారు. 

మూఢ విశ్వాసాలను అధిగమిస్తూ.. 
వెయ్యేళ్ల క్రితం సమాజంలో బలంగా ఉన్న మూఢ, అంధ విశ్వాసాలను అధిగమిస్తూ భారతీయ ఆలోచన ధారను రామానుజాచార్యులు సమాజానికి పరిచయం చేశారు. వెనుకబడిన తరగతులు, దళితుల పట్ల సమాజంలో ఉన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, వారిని చేరదీసి గౌరవించారు. యాదగిరిపై నారాయణ మందిరం నిర్మించి దళితులకు దర్శనం, పూజలు చేసే అధికారం కల్పించారు.  తాను స్నానం చేసి వచ్చే సమయంలో శిష్యుడు ధనుర్దాసు భుజాల మీద చేయివేసి నడవడం ద్వారా అంటరానితనం సరైనది కాదని స్పష్టంచేశాడు. 


చదవండి: ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ దూరం

సమానత్వాన్ని బోధిస్తున్న ‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’.. 
ఆదర్శాలు, సత్యం అనే ఆభరణాలు లేని గాంధీని, ఆయన లేని స్వాతంత్య్ర పోరాటాన్ని మనం ఊహించలేం. హైదరాబాద్‌ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగిన సర్దార్‌ వల్లబ్‌భాయ్‌ పటేల్‌ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’ ఏకత్వాన్ని.. రామానుజాచార్యుల ‘స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ’ సమానత్వాన్ని బోధిస్తున్నాయి. అధికారం లేదా బలం మీద కాకుండా ఏకత్వం, సమానత్వం, సమాదరణ అనే సూత్రాల మీద మనదేశం ఆధారపడి ఉంది.  రామానుజుల విగ్రహం దేశవాసులకు నిరంతరం స్ఫూర్తినిస్తుంది. ఈ సమతాస్ఫూర్తితోనే ఎలాంటి అంతరాలు లేకుండా ప్రతిఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయ  త్నిస్తోంది. ఈ రోజు ఇక్కడ నాకు 108 దివ్యదేశ మందిరాల సందర్శన భాగ్యం లభించింది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. చినజీయర్‌స్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మైహోం అధినేత రామేశ్వర్‌రావు  పాల్గొన్నారు. 

ప్రధాని మోదీది రాజధర్మం: చినజీయర్‌ స్వామి 
నిత్యం ప్రజల శ్రేయస్సును కాంక్షించే శ్రీరామచంద్రుడు వ్రత సంపన్నుడుగా ప్రసిద్ధికెక్కాడని.. ఇప్పుడు దేశప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్న ప్రధాని మోదీ కూడా వ్రత సంపన్నుడేనని త్రిదండి చినజీయర్‌ స్వామి కొనియాడారు. మనుషులంతా ఒక్కటేననే స్ఫూర్తిని వెయ్యి ఏళ్లకు పూర్వమే రామానుజులు వ్యక్తపరిచారని.. ఆయన స్ఫూర్తిని మోదీ చాటుతున్నారని పేర్కొన్నారు. ‘‘వాల్మీకి రామాయణంలో ప్రజల సుఖసంతోషాల కోసం ప్రభువు చేసే త్యాగాలు, ధైర్య సాహసాలన్నీ  మోదీలో కనిపిస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో భారత్‌ను ముందు వరుసలో నిలిపేలా ఆయన కృషిచేస్తున్నారు. అందుకే ఆయనకే ప్రధాని స్థానం సరిపోలుతుంది. సబ్‌కాసాత్‌– సబ్‌కా వికాస్‌ నినాదంతో దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు.’’అని చినజీయర్‌స్వామి ప్రశంసించారు. కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ.. మనుషులంతా సమానమేనని రామానుజులు వెయ్యేళ్ల కింద చాటి చెప్పారని, ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ సమానత్వ సిద్ధాంతాన్ని అమలుచేస్తోందన్నారు.  కొందరు విచ్ఛిన్నకర కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, కానీ మనందరం రామానుజుల స్ఫూర్తితో సమానత్వంతో ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement