భద్రతా ఏర్పాట్లను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. చిత్రంలో చినజీయర్ స్వామి
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 5న రాష్ట్రంలో పర్యటించనున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఇక్రిసాట్ స్వర్ణోత్సవాలతో పాటు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నిర్వహిస్తున్న రామానుజచార్యుల సహస్రాబ్ది సమారోహంలో పాల్గొననున్నారు. శనివారం మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ఇక్రిసాట్‌కు చేరుకోనున్న ప్రధాని సంస్థ స్వర్ణోత్సవాలను ప్రారంభించనున్నారు. ఇక్రిసాట్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్‌మెంట్ ఫెసిలిటీని ప్రారంభిస్తారు.
స్వర్ణోత్సవాలు పురస్కరించుకుని ప్రత్యేకంగా తయారు చేసిన ఇక్రిశాట్ లోగోతో పాటు స్మారక స్టాంపును సైతం ఆవిష్కరించనున్నారు. దాదాపు గంటన్నర పాటు కొనసాగనున్న స్వర్ణోత్సవ కార్యక్రమంలో మోదీ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి ప్రధాని చేరుకుంటారు. పంచలోహాలతో రూపొందించిన 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామానుజాచార్యుల జీవిత ప్రస్థానం, బోధనలపై 3డీ మ్యాపింగ్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. సమతామూర్తి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన 108 దివ్య దేశాలను సైతం ప్రధాని సందర్శిస్తారు.
ఏర్పాట్లు కట్టుదిట్టం
ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై గురువారం ఆయన వివిధ శాఖలతో బీఆర్‌కేఆర్ భవన్‌లో సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రధాని పాల్గొనే వేదికల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తును ‘బ్లూ బుక్’ ప్రకారం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
వేదికల వద్ద నిపుణులైన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అన్నిచోట్లా కోవిడ్–19 ప్రోటోకాల్ పాటించేలా చూడాలన్నారు. వీవీఐపీ పాస్ హోల్డర్లకు షెడ్యూల్ చేసిన ప్రోగ్రామ్‌కు ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేపట్టాలని, కోవిడ్–19 స్క్రీనింగ్ బృందాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రహదారుల మరమ్మతు పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, లైటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇతర వేదికల వద్ద ఏర్పాట్లను కార్యక్రమాల నిర్వాహకులతో సమన్వయ పరుచుకోవాలని రంగారెడ్డి, సంగారెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంధన, హౌసింగ్ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ , జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు.
7 వేల మంది పోలీసులతో బందోబస్తు
సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా సుమారు 7 వేల మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఇప్పటికే బందోబస్తులో నిమగ్నమయ్యారు. సైబరాబాద్‌లో ఉన్న 4 వేల మంది సిబ్బందితో పాటు ఇతర కమిషనరేట్లు, జిల్లాల పోలీస్ యూనిట్ల నుంచి మరో 3 వేల మందిని విధుల్లో నియమించారు. వీరిలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను ప్రత్యేకంగా భద్రత చర్యల నిమిత్తం నియమించారు. సైబరాబాద్‌లో పనిచేస్తున్న మొత్తం ఐపీఎస్ అధికారులు, డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్లను పూర్తి స్థాయిలో రంగంలోకి దింపారు.
Comments
Please login to add a commentAdd a comment