సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే, ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కాగా, చండూరు, కొరిటికల్‌లో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. నాన్ లోకల్స్ తిరుగుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఇక, మర్రిగూడలో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు.. మునుగోడులో పోలింగ్ జోరందుకుంది. ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారు. ఇదిలా ఉండగా.. మంత్రి కేటీఆర్ తండాలో వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, తండావాసులు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక, మధ్యాహ్నం 3 గంటల వరకు మునుగోడులో 59.92 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. క్యూలైన్లలో ఓటర్లు బారులుతీరడంతో భారీగా ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. కాగా, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఇక, 2018లో మునుగోడు నియోజకవర్గంలో 91.3 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఇదిలా ఉండగా.. మునుగోడు ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్టు సమాచారం. ఒక్కో అభ్యర్థిపై ఒక్కో రకంగా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment