మహిళకు కౌన్సెలింగ్ ఇస్తున్న ప్రొబేషనరీ ఎస్సై ఆదిల్
సాక్షి, రామారెడ్డి(నిజామాబాద్): కుటుంబంలో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, గమనించిన పోలీసులు అడ్డుకున్నారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం రామారెడ్డి మండల కేంద్రం శివారులోని పెద్దమ్మ ఫంక్షన్ హాల్ సమీపంలో గల చెట్టుకు ఓ మహిళ ఉరి వేసుకునేందుకు యత్నిస్తోంది. అటు వైపు వెళ్తున్న ప్రొబేషనరీ ఎస్సై ఆదిల్, కానిస్టేబుల్ సిద్దిరాములు గమనించి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు.
ఆ మహిళను కాపాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లా వీరన్నపల్లి గ్రామానికి చెందిన సులోచనగా ఆమెను గుర్తించారు. రామారెడ్డిలో ఉండే తన అన్న ఇంట్లో శుభకార్యం కోసం వచ్చానని, కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని ఆమె తెలిపారు. దీంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చిన ప్రొబెషనరీ ఎస్సై.. కుటుంబ సభ్యులను పిలిపించి ఆమెను అప్పగించారు.
చదవండి: పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ
ఇద్దరిని కాపాడిన పోలీసులు..
నాలుగు రోజుల వ్యవధిలో ఇద్దరి ప్రాణాలను కాపాడారు రామారెడ్డి పోలీసులు. కుటుంబ తగాదాలతో నాలుగు రోజుల క్రితం గిద్ద చెరువు కట్టపై ఆత్మహత్యకు యత్నించిన మహిళను గమనించి పోలీసులు కాపాడారు. తాజాగా చెట్టుకు ఉరి వేసుకునేందుకు యత్నిస్తున్న మహిళను కూడా సంరక్షించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. చివరి క్షణాల్లో రెండు నిండు ప్రాణాలను కాపాడిన రామారెడ్డి పోలీసులు ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment