దారి తప్పిన పోలీసు! | Telangana: Some Police Officers Demanding Money In Nizamabad | Sakshi
Sakshi News home page

దారి తప్పిన పోలీసు!

Published Mon, Jun 14 2021 9:57 AM | Last Updated on Mon, Jun 14 2021 10:40 AM

Telangana: Some Police Officers Demanding Money In Nizamabad - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

జిల్లాలోని కొందరు పోలీలసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది. వారి వ్యవహార శైలి మొత్తం పోలీసు శాఖకే మచ్చ తెస్తోంది. క్రమశిక్షణతో ఉండాల్సిన ఖాకీలు కట్టు తప్పుతున్నారు. అక్రమార్జనలో కొందరు సిబ్బంది బరి తెగిస్తున్నారు.! వివాదాల్లో తల దూర్చడం, సెటిల్‌ మెంట్లు చేయడం, నిందితులకు కొమ్ము కాయడం, అక్రమార్కులతో చేతులు కలుపుతూ భారీగానే దండుకుంటున్నారు. ఇలాంటి వ్యవహారాలు ఇటీవలి కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. సంబంధిత అధికారులపై ఉన్నతాధికారులు వేటు వేస్తున్నా సిబ్బంది పనితీరు మాత్రం మారడంలేదు. తాజాగా ఇందల్వాయి ఎస్సై వ్యవహారంబయటకు రావడంతో పోలీసుల వ్యవహార శైలిపై జిల్లాలో మరోమారు చర్చ జోరుగా సాగుతోంది.

తరచూ వెలుగులోకి..
క్రమశిక్షణతో కూడిన ఉద్యోగం, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించడం, ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం పోలీసు శాఖ ప్రధాన విధి.కానీ కొందరు అధికారుల తీరు ఆ శాఖకే మచ్చగా మారింది. కొందరు ఎస్సైలు, సీఐలు సివిల్‌ వివాదాల్లో తలదూర్చుతూ, అక్రమ దందాలను ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నిందితులు,బాధితుల నుంచి వసూళ్లు చేస్తున్న చేస్తున్న ఘటనలు తరచూ బయట పడుతున్నాయి. అక్రమంగా డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం, ఇతరఆరోపణలతో సస్పెన్షన్లకు గురికావడం జిల్లాలో సాధారణంగా మారింది.

జిల్లాలో మూడు (నిజామాబాద్, బోధన్‌ ,ఆర్మూర్‌) పోలీసు సబ్‌ డివిజన్లు, వాటి పరిధిలో 33 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో కొన్ని ఠాణాల పరిధిలో ఇసుకతో పాటు కొన్ని అక్రమ దందాలు ఎక్కువగా నడస్తున్నాయి. మరికొన్ని స్టేషన్ల పరిధిలో లక్కీ డ్రాలు, గంజాయి, గుట్కా విక్రయాలువిచ్చలవిడిగా సాగుతున్నాయి. ఆయా ఠాణాల్లో పని చేసే పోలీసు అధికారుల తీరు తరచూ వివాదస్పదమవుతోంది. కొందరు పోలీసు అధికారులు అక్రమార్కులకు అండగా నిలబడడంతో పాటుఆడవారితో అసభ్యంగా ప్రవర్తించడం, అక్రమ సంబంధాలు వంటివి చర్చకు దారి తీస్తున్నాయి.

నిందితులతో చేయి కలిపి..
కొన్ని కేసుల్లో పోలీసులు నిందితులతో చేతులు కలపడం విమర్శలకు తావిస్తోంది. కేసుల నుంచి తప్పించడంతో పాటు మామూలు సెక్షన్లు పెట్టి వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి!. ఇటీవలకమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్‌కు చెందినయువకుడి హత్య కేసులో నిందితుడికి పోలీసుస్టేషన్‌లో రాచమర్యాదలు చేయడం సోషల్‌ మీడియాలో
వైరల్‌ అయింది. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో పాటు పోలీసులను గ్రామం నుంచి బయటకు వెళ్లగొట్టారు. నిందితుడికి రాచమర్యాదలు చేసిన ఘటనపై జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేయడంతో
పాటు ఎస్‌హెచ్‌వోకు మోమో జారీ చేశారు.

పేరుకే నెలవారీ సమీక్ష?
పోలీసు శాఖలో ప్రతి నెలా నెలవారీ సమీక్ష నిర్వహించడం పరిపాటి. ఇందులో పోలీస్‌స్టేషన్లకు సంబంధించి క్రైం రేటు తగ్గించడం, బందోబస్తు, దొంగతనాల నివారణ తదితర అంశాలపై ఉన్నతాధికారులు చర్చిస్తారు. అలాగే కొందరు పోలీసులవ్యవహార శైలిపై ఈ సందర్భంగా హెచ్చరిస్తుంటారు. అయినా కొందరు అధికారుల తీరుమారడం లేదు. కట్టు తప్పుతున్న వారిపై ఉన్నతాధికారులు కొరఢా ఝళిపిస్తున్నా వారిలో మార్పుకనిపించక పోవడం గమనార్హం.

అంతా ‘మామూలే’..
జిల్లాలోని కొందరు పోలీసులకు అక్రమ దందాలు వరంగా మారాయి. గుట్కా, గంజాయి, లక్కీ డ్రాల నిర్వాహకులు పెద్ద మొత్తంలో పోలీసు అధికారులకు ముట్టజెబుతున్నారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఆర్మూర్‌ డివిజన్‌ లోని బాల్కొండ కేంద్రంగా నిర్వహించే లక్కీ డ్రా సజావుగా సాగేందుకు నిర్వాహకులు.. ఓ అధికారికి నెలకు రూ.లక్ష లంచం ఇస్తున్నారంటే వసూళ్ల పర్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలోనూ 20 వరకు లక్కీ డ్రాలు నిర్వహిస్తుండగా, పోలీసులకు పెద్ద మొత్తంలో మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా సాగే వ్యవహారాల్లో లంచాలు తీసుకుంటూ ఏసీబీకి దొరుకుతుండడంతో పోలీసు శాఖ పరువు బజారునపడుతోంది.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటనల్లో చాలా మంది పోలీసులపై వేటు పడింది. బోధన్‌ లోని నకిలీ పాస్‌పోర్టుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగాసంచలనం రేపిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లకులకు పాస్‌పోర్టుల జారీలో డబ్బులు తీసుకొని సహకరింనట్లు విచారణలో తేలింది. దీంతో 75 నకిలీ పాస్‌పోర్టులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉదంతంలో ఎస్‌బీతో పాటు సివిల్‌ ఉన్నతాధిరి సిబ్బంది పోలీసు సిబ్బందిపై సస్పెండ్‌ చేశారు.

మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం కారణంగా ఆమె భర్త ఆత్మహత్యకు కారణమైన ఇందల్‌వాయి ఎస్సై శివప్రసాద్‌రెడ్డి ఉదంతం ఉమ్మడి జిల్లాలో చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారం మొత్తం పోలీసు శాఖకే ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయనను సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా ప్రొబేషనరీ గడువు కూడా పూర్తి చేసుకోని శివప్రసాద్‌రెడ్డి.. ఇందల్‌వాయి పరిధిలో అక్రమ ఇసుక రవాణా,లక్కీ డ్రాలు, వివిధ కేసుల్లో వసూళ్లకుపాల్పడి నట్లు ప్రచారం జరుగుతోంది.దంపతుల గొడవలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ధరల్లి ఎస్సై సస్పెండ్‌ కుగురయ్యారు. అక్కడి సీఐపై బదిలీ వేటు పడింది.

ఓ కేసులో రూ. లక్ష విలువైన ఫోన్‌ ను లంచం తీసుకుంటూ బోధన్‌ లోని ఓ సీఐ ఏసీబీకి పట్టుబడడం అప్పట్లో జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది.
కేసు విచారణలో బాధ్యతాయుతంగా వ్యవహరించండం లేదని నిజామాబాద్‌ రూరల్‌ ఎస్‌హెచ్‌వో మధుసూద¯న్‌గౌడ్‌పై వేటు పడింది.
పెండింగ్‌ కేసులు పేరుకు పోవడంతో డిచ్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేశారు.
జిల్లాలో సీఐగా పని చేసిన జగదీష్‌ను..  కామారెడ్డి లో ఐపీఎఎస్‌ల బెట్టింగ్‌ వ్యవహారంలో లంచం తీసుకుంటూ పట్టుబడడంతో ఏసీబీ అరెస్టు చేసింది.
టాస్క్‌ఫోర్సు పోలీసుల వ్యవహార శైలి మొదటినుంచి వివాదాస్పదంగా మారింది.
ఇసుక తరలింపులో డబ్బులు తీసుకుంటున్నారని నందిపేట ఎస్సైపై ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో అతనిపై బదిలీ వేటు పడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement