ఏడాది క్రితం.. పోలీసుశాఖ స్టేషన్‌ల వారీగా వసూల్ రాజాల జాబితాను విడుదల చేసింది. ఆ జాబితాలో ఉన్న అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో కొంతకాలం వసూళ్ల దందాకు అడ్డుకట్టపడింది. కానీ ఇటీవలి కాలంలో వసూల్ రాజాలు మళ్లీ విజృంభిస్తున్నారు. ఠాణా ఖర్చుల పేరిట జోరుగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సాక్షి, కామారెడ్డి క్రైం: గతంలో కొందరు అధికారులు, సిబ్బంది ఆగడాల కారణంగా పోలీస్‌శాఖ అప్రతిష్ట పాలైంది. డబ్బులు పోయనిదే న్యాయం దొరకదన్న పరిస్థితి వచ్చింది. దీంతో గాడితప్పిన పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర పోలీస్‌శాఖ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టింది. అవినీతిని పారదోలి పారదర్శకమైన సేవలు అందించాలనే సంకల్పంతో అధికారులు, సిబ్బంది క్రమశిక్షణకు పెద్దపీట వేశారు. శాఖలో వ్యవస్థాగతమైన మార్పులు తీసుకువచ్చేందుకు ప్రత్యేక సంస్కరణలను తీసుకువచ్చారు. వసూల్ రాజాల జాబితా విడుదల చేశారు. వారిపై చర్యలు తీసుకున్నారు. దీంతో అవినీతికి పాల్పడుతున్నవారిలో భయం మొదలైంది.
వసూళ్లకు తాత్కాలికంగాపైనా ఫుల్‌స్టాప్ పెట్లారు. ఇదే సమయంలో ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకువచ్చింది. పోలీస్‌స్టేషన్ల నిర్వహణకు అవసరమైన నిధులు, ఉన్నత ప్రమాణాలతో కూడిన మోడల్ పోలీస్ స్టేషన్‌లు, కేసులు, రికార్డుల ఆన్‌లైన్ విధానం, ప్రెండ్లీ పోలీస్, అధునాతన వాహనాలు, నెట్‌వర్క్ వ్యవస్థ, ఇతర అన్నిరకాల సౌకర్యాలను కల్పించారు. ఠాణాలకు వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మసలుకోవాలని, వారికి పోలీసు వ్యవస్థపై నమ్మకం కలిగేలా వ్యవహరించాలని ఆదేశించారు. దీంతో పోలీసుల కార్యకలాపాలు, కేసుల పరిశోధన, వ్యవహారశైలిలో ఆశించిన మార్పు వచ్చింది.
పాత పద్ధతులు..
చాలా కాలంగా ఉత్తమ సేవలు అందిస్తున్న జిల్లా పోలీస్‌శాఖలోని కొన్ని ఠాణాల్లో మళ్లీ పాత పద్ధతులు కనిపిస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం స్టేషన్‌లకు వచ్చే వారిని కేసుల పేరిట బెదిరించడం, పంచాయితీలు పెట్టి ఇరు వర్గాల నుంచి డబ్బులు వసూలు చేయడం, సివిల్ కేసుల్లో తలదూర్చడం, అధికారాన్ని అడ్డంపెట్టుకుని సెటిల్‌మెంట్‌లు చేయడం లాంటి పాత పద్ధతులు దాదాపు అన్ని ఠాణాల్లో మొదలయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్టేషన్‌లకు వచ్చేవారి నుంచి ఠాణా ఖర్చుల పేరిట దర్జాగా వసూళ్లకు పాల్పడుతున్నారు. న్యాయం కోసం పోలీసుల దగ్గరకు వెళ్తే ఎంతో కొంత ముట్టజెప్పనిదే పనులు జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డబ్బులిస్తేనే న్యాయం!
ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో పోలీసు వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడానికి రాష్ట్ర పోలీస్ శాఖ ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చింది. శాఖను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రూ.కోట్లల్లో నిధులు కేటాయిస్తోంది. ఠాణాల నిర్వహణకు ప్రతినెలా రూ. 25 వేల చొప్పున నిధులు వస్తున్నాయి. గతంతో పోలిస్తే పోలీస్ వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. అయితే ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ కొందరు అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. కేసుల్లో న్యాయం జరగాలంటే డబ్బులు పోయాల్సిందే అనే పరిస్థితులను మళ్లీ తీసుకువచ్చారు.
ఎస్‌హెచ్‌వోలే కాకుండా కేసుల విషయంలో ఇరువర్గాల నుంచి ఆయా ఠాణాల్లో పనిచేసే సీనియర్ సిబ్బంది సైతం ఖర్చుల పేరిట అందినకాడికి గుంజుతున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు అధికారుల కాసుల కక్కుర్తి మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తీసుకువస్తోంది. అధికారుల పర్యవేక్షణ లోపాలను ఆసరాగా చేసుకుంటూ వసూళ్ల దందా సాగిస్తున్నారు. కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో ఫిర్యాదులు చేసేందుకు వచ్చేవారి నుంచి ఠాణా ఖర్చుల పేరిట అడ్డగోలుగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పేరుకే పరిమితమైందనే భావన పెరుగుతోంది.
వసూళ్లకు అడ్డుకట్ట ఏదీ?
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలోని దాదాపు అన్ని పోలీస్‌స్టేషన్లలో పోలీసు అధికారుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రతి పోలీస్‌స్టేషన్‌లోనూ కేసుల పరిష్కారం కోసం వచ్చే ఇరు పక్షాల నుంచి వసూళ్లు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణలపైనే ఇటీవల సిరికొండ ఎస్సైని ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ టాస్క్‌ఫోర్సు సీఐపైనా ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. దీంతో ఆయనను వీఆర్‌కు అటాచ్ చేయడంతో పాటు మరో ముగ్గురు అధికారులకు మెమోలు జారీ చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్తుండడంతో వారు చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఠాణాల్లో జరుగుతున్న అక్రమ వసూళ్లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment