బాలింత మృతదేహన్ని దహనం చేయడానికి తరలిస్తున్న దృశ్యం
దౌల్తాబాద్ (దుబ్బాక): కోవిడ్‌తో బాలింత మృతి చెందిన ఘటన దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. దౌల్తాబాద్ వైద్యాధికారి డాక్టర్ కర్ణ తెలిపిన వివరాల ప్రకారం గాజులపల్లి గ్రామానికి చెందిన గర్భిణి (20)ని ప్రసవం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శిశువు జన్మించింది. అనారోగ్యంతో శిశువు మృతిచెందింది. బాలింతకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తీవ్రఅస్వస్థతో బాలింత శుక్రవారం మృతి చెందింది. ఆస్పత్రి సిబ్బంది అంబులెన్సులో మృతదేహన్ని గ్రామానికి తరలించగా కుటుంబ సభ్యుల సమక్షంలో అటవీ ప్రాంతంలో దహనం చేశారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి : కుటుంబ సభ్యుల ఆరోపణ
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం మూలంగానే బాలింత మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రిలో చేర్చుకోవడంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆ కారణంగా శిశువు మృతి చెందిందన్నారు. కోవిడ్ సోకితే ఐసియూలో ఉన్న రోగి వద్దకు ఎలాంటి రక్షణ లేకుండా తమను ఎందుకు అనుమతించారని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మూడు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరణించాక కోవిడ్ అని ప్రచారం చేస్తున్నారని కన్నీంటి పర్యంతమయ్యారు. ఆస్పత్రి సిబ్బంది తమ తప్పును కప్పి పుచ్చుకొనేందుకే తప్పుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజులోనే కోవిడ్‌తో ఎలా మృతి చెందుతుందన్నారు. జిల్లా వైద్యాధికారులు ఈ విషయంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment