కోవిడ్‌తో పోరాడుతూ చనిపోయిన డెంటిస్ట్ డింపుల్ అరోరా చావ్లా(ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
న్యూఢిల్లీ: కరోనా ఎందరిని బలి తీసుకుందో.. ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేసిందో లెక్కేలేదు. చిన్నా, పెద్ద, పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తుంది. కోవిడ్ బారిన పడి సామాన్యులే కాదు.. వైద్య సిబ్బంది కూడా ప్రాణాలు విడుస్తున్నారు. ఎందరినో మహమ్మారి నుంచి కాపాడిన డాక్టర్లు.. చివరికి వైరస్ చేతిలో ఓడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా దేశ రాజధానిలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ప్రెగ్నెంట్ అయిన డాక్టర్ కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో ఆమె కడుపులోని బిడ్డ చనిపోయింది. ఆ కడుపుకోతను తట్టుకోలేకపోయిన తల్లి.. మరుసటే రోజే మరణించింది. ఇక చివరి రోజుల్లో ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆ వివరాలు..
ఢిల్లీకి చెందిన డాక్టర్ డింపుల్ అరోరా చావ్లా అలియాస్ దీపిక డెంటిస్ట్‌గా పని చేస్తుండేవారు. మూడేళ్ల బాబు ఉండగా.. ప్రస్తుతం రెండోసారి గర్భం దాల్చారు. ఈ క్రమంలో ఏప్రిల్ 21న ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. వైద్యులు ఇచ్చిన మందులు వాడుతూ ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉన్నారు. కానీ పది రోజుల తర్వాత ఆమె ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడం ప్రారంభమయ్యాయి.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సలో భాగంగా ఆమెకు రెమిడెసివర్ ఇంజక్షన్‌తో పాటు రెండు సార్లు ప్లాస్మా థెరపీ కూడా చేశారు. కానీ లాభం లేకపోయింది. ఆ ఎఫెక్ట్ కడుపులోని బిడ్డ మీద పడింది. చిన్నారి హృదయస్పందన ఆగిపోయింది. దాంతో వైద్యులు ఆపరేషన్ చేసి మృత పిండాన్ని తొలగించారు. అన్ని రోజుల పాటు ధైర్యంగా ఉన్న డింపుల్ బిడ్డను కోల్పోవడంతో తీవ్ర మనోవేదనను అనుభవించారు. ఆ బాధ తట్టుకోలేక మరుసటి రోజే ప్రాణాలు విడిచారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కోవిడ్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో.. ఆరోగ్యం ఎంతలా క్షీణిస్తుందో తెలియజేప్తు ఓ వీడియో తీశారు. దీనిలో డింపుల్ ‘‘ఎంతో ఇబ్బంది పడుతూ ఈ వీడియో తీశాను. ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒక్కటే. కరోనాను లైట్ తీసుకోకండి. పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కనీసం మాట్లాడలేకపోతున్నాను. నేను చేసే విన్నపం ఒక్కటే. మీ ఆత్మీయుల కోసమైనా మాస్క్ ధరించండి. ఇంట్లో కానీ బయట కానీ ఎవరితో మాట్లాడినా మాస్క్ ధరించే మాట్లాడండి.. ప్రాణాలు కోల్పోవడం కన్నా మాస్క్ ధరించడం ఎంతో ఉత్తమం’’ అని వేడుకున్నారు.
ఇక ప్రస్తుతానికైతే మన దగ్గర గర్భవతులు, పాలిచ్చే తల్లుల మీద వ్యాక్సిన్ ట్రయల్స్ నిర్వహించలేదు. కనుక వీరు వ్యాక్సిన్ తీసుకోవద్దని ప్రభుత్వం సూచించింది. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆక్సిజన్ కొరతతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment