సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభణతో బాధితులు ప్రైవేట్ కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో పడకలు నిండిపోయాయనే పేరిట యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. గతేడాది కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైన సమయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయో, ఇప్పుడు మళ్లీ అటువంటి పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. అనేక ఆసుపత్రులు రోగుల నిస్సహాయతను ఆసరాగా చేసుకుని వ్యాపారం మొదలు పెట్టాయి. లాభార్జనే ధ్యేయంగా వసూళ్లకు తెగబడుతున్నాయి.
అనేక ఆసుపత్రులు ఒక్కొక్కరి వద్ద రోజుకు లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక పేరొందిన ఆసుపత్రిలో 20 రోజుల క్రితం చేరిన ఒక రోగి నుంచి ఇప్పటికే రూ.18 లక్షలు వసూలు చేశారు. తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉంది. 10 శాతం మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. దీంతో బయటకు రాలేక, మరో ఆసుపత్రికి వెళ్లలేక ఆ కుటుంబం ఆవేదన వర్ణనాతీతం. ఇక సాధారణ ఆసుపత్రులు కూడా పడకలు ఖాళీ లేవంటూ, కృత్రిమ కొరత సృష్టిస్తూ బాధితులను బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి.
ఫీజు ఉత్తర్వులు గాలికే..
కరోనా చికిత్సలకు ఏ విధంగా ఫీజులు వసూలు చేయాలో ప్రభుత్వం గతేడాదే ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రు ల్లోని సాధారణ వార్డుల్లో కరోనా చికిత్సకు రోజుకు రూ.4 వేలు, ఆక్సిజన్‌పై ఉంటే రూ. 7,500, వెంటిలేటర్ మీద పెడితే రూ.9 వేలు వసూలు చేసుకోవచ్చు. పీపీఈ కిట్లు, మందులకు అదనంగా తీసుకోవచ్చని జీవోలో సర్కారు చెప్పింది. అయితే పీపీఈ కిట్లు, మందుల పేరుతో ఆసుపత్రులు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశాయి.
తెరపైకి సీలింగ్ ప్రతిపాదన
డబ్బులు చెల్లిస్తేగానీ శవాలను బంధువులకు అప్పగించకుండా కొన్ని ఆసుపత్రులు వ్యవహరించిన తీరుపై గతేడాది పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఫీజుతో సంబంధం లేకుండా అన్నీ కలిపి ఇంత అనే సీలింగ్ ప్రతిపాదనను సర్కారు తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం 14 రోజులకు కలిపి కరోనా చికిత్సకు సాధారణ వార్డులో రూ. లక్ష, ఆక్సిజన్ వార్డులో రూ. 2 లక్షలు, ఐసీయూ వార్డులో రూ. 3 లక్షల నుంచి రూ. 4 లక్షలు వసూ లు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదించింది.
అలాగే ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లోని 50 శాతం పడకలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయాన్ని ఆసుపత్రులు కూడా అంగీకరించాయి. కానీ ఆచరణలో అమలు కాలేదు. అలా చేస్తే 226 ప్రైవేట్ ఆసుపత్రుల్లోని 8,113 పడకల్లో సగం అంటే 4,056 పడకలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. వాటిని ప్రత్యేక యాప్ ద్వారా నింపాలని కూడా అనుకున్నారు. కానీ క్రమంగా కేసులు తగ్గి అప్పట్లోనే అది ఆచరణలోకి రాకపోవడంతో ఇప్పుడు రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కోవిడ్ విజృంభిస్తూ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు మళ్లీ అదే తరహా దోపిడీని ప్రారంభించాయి.
బీమా కుదరదు .. నగదు కట్టాల్సిందే..
ప్రస్తుతం అనేక ఆస్పత్రులు ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య బీమాను అంగీకరించడం లేదు. నగదు కడితేనే చూస్తామనే రీతిలో వ్యవహరిస్తుండటంతో లక్షల మొత్తంలో పాలసీ ఉన్నా బాధితులకు ఉపయోగపడడం లేదు. ఆస్పత్రుల యాజమాన్యాలు బీమా అంగీకరించేలా చూడాలని, లక్షల్లో వసూలు చేయడాన్ని నియంత్రించాలని, 50 శాతం పడకలను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని రోగులకు కేటాయించాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment