సాక్షి, హైదరాబాద్: కరోనా కేసులు పెరుగుతున్నా ఆసుపత్రులకు రోగుల తాకిడి మాత్రం తగ్గుతోంది. గత నెల 27వ తేదీ నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 57,142... సరిగ్గా నెలకు అంటే ఈ నెల 26వ తేదీ నాటికి కేసుల సంఖ్య రెండింతలు అంటే 1,14,486 పెరిగాయి. గత నెల 27వ తేదీ నాటికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పడకల సంఖ్య 4,497. సరిగ్గా నెలకు వాటి సంఖ్య రెట్టింపు అంటే 9,136 పెరిగాయి. నెల రోజుల్లోనే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపయ్యాయి. సాపేక్షంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలూ రెండింతలు పెరిగాయి. ఆసుపత్రుల సంఖ్య మూడింతలయ్యాయి. అయితే ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య మాత్రం తగ్గిందని వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి తాజాగా సమగ్ర నివేదిక సమర్పించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న కొన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పడకలకు ఇంకా డిమాండ్ కొనసాగుతోంది. గచ్చిబౌలిలో ఉన్న ఒక ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉన్న 94 ఆక్సిజన్ బెడ్లన్నీ నిండిపోయాయి. సికింద్రాబాద్‌లో ఉన్న మరో ప్రముఖ ఆసుపత్రిలో ఆక్సిజన్ బెడ్లు 71 ఉంటే, 70 నిండిపోయాయి. అందులో 35 ఐసీయూ పడకలుంటే 30 నిండిపోయాయి.
21 శాతం తగ్గిన ఇన్‌పేషెంట్లు...
రాష్ట్రంలో నెల క్రితం 55 ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు జరగ్గా, ఇప్పుడు ఆ సంఖ్య 171 ఆసుపత్రులకు పెరిగింది. పడకల సంఖ్యను రెట్టింపు చేసింది. కేసులు పెరుగుతున్నా, పడకలున్నా ఆసుపత్రుల్లో చేరేవారు తక్కువయ్యారు. గత నెల 27వ తేదీ నాటి లెక్క ప్రకారం... మొత్తం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు 4,497 ఉంటే, 3,032 పడకలు కరోనా రోగులతో నిండిపోయాయి. ఇంకా 1,465 పడకలు అంటే 32.57 శాతం మాత్రమే ఖాళీగా ఉన్నాయి. కానీ, ఈ నెల 26వ తేదీ నాటి లెక్క ప్రకారం మొత్తం ప్రైవేట్ ఆసుపత్రుల్లో పడకలు 9,136 ఉండగా, 4,246 నిండిపోయాయి. ఇంకా 4,890 ఖాళీగా ఉన్నాయి. అంటే సగానికి మించి ఏకంగా 53.52 శాతం ఖాళీగా ఉన్నాయి. అంటే అప్పటితో పోలిస్తే ఖాళీగా ఉన్న పడకల శాతం 20.95 శాతానికి పెరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారి శాతం పెరిగింది. హైదరాబాద్‌ను మినహాయిస్తే జిల్లాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. నెల క్రితం ప్రభుత్వ ఆసుపత్రుల్లో 73.45 శాతం పడకలు ఖాళీగా ఉండగా, ఇప్పుడు 68 శాతమే ఉన్నాయి.
ఇళ్లలోనే చికిత్స పొందేవారు 14% పెరుగుదల...
ఇళ్లలో చికిత్స పొందే బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల 27న యాక్టివ్ కేసులు 13,753 ఉండగా, అందులో ఇళ్లలో చికిత్స పొందినవారు 8,479 మంది(61 శాతం) ఉన్నారు. ఈ నెల 26వ తేదీ నాటి లెక్క ప్రకారం 27,600 యాక్టివ్ కేసులుంటే, వాటిల్లో 20,866 మంది(75 శాతం) ఇళ్లలో చికిత్స పొందుతున్నారు. నెల రోజుల్లో ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందేవారు 14 శాతం పెరిగారు. ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా బాధితులు ఎందుకు వెళ్లడం లేదన్న దానిపైనా ఆ శాఖ వర్గాలు అంచనా వేశాయి.
ఆ కారణాలేంటంటే?
► ప్రైవేట్ ఆసుపత్రులపై జనంలో ఒకరకమైన ఏవగింపు పెరిగింది. 10–20–25 లక్షల రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తుండటం. అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొనడం
► బీమా వర్తించదని చెప్పడం... డబ్బులు చెల్లించనిదే శవాలు కూడా అప్పగించకపోవడం
► ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యానికి ఖర్చు పెద్దగా ఉండదని, అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లొద్దని సర్కారు చేసిన ప్రచారం ఫలించడం
► నెల క్రితం కరోనా వచ్చిందంటే గజగజ వణికిపోయి ఆసుపత్రులకు పరుగులు పెట్టిన బాధితులు ఇప్పుడు చైతన్యవంతులవడం. సాధారణ లక్షణాలుంటే.. తెలిసిన డాక్టర్లను
టెలి కన్సల్టేషన్ లేదా టెలి మెడిసిన్‌తో చికిత్స పొందుతుండటం
► మొదట్లో కరోనా అంటే జిల్లాల్లోని డాక్టర్లు కూడా భయపడిపోయారు. కానీ, ఇప్పుడు వారు కూడా కరోనా చికిత్సను నేరుగా లేదా టెలి కన్సల్టేషన్ పద్ధతిలో చికిత్స చేస్తుండటం.
► సీరియస్‌గా ఉండే కేసులు మాత్రమే ఆసుపత్రుల వరకు వెళ్తున్నాయి. కొందరైతే జ్వరం, దగ్గు వంటి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే యాంటీబయోటిక్స్ సహా విటమిన్ మాత్రలు వాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment