అనుమతి లేకున్నా కరోనా టెస్టులు! | Private Hospitals Doing Corona Tests Without Permission In Mancherial | Sakshi
Sakshi News home page

అనుమతి లేకున్నా కరోనా టెస్టులు!

Published Mon, Aug 31 2020 9:23 AM | Last Updated on Mon, Aug 31 2020 1:25 PM

Private Hospitals Doing Corona Tests Without Permission In Mancherial - Sakshi

హోం క్వారంటైన్‌ ప్యాకేజీ పేరిట ప్రైవేటు ఆస్పత్రుల ప్రచారం, ప్రభుత్వ ఆసుపత్రిలో యాంటిజెన్‌ రాపిడ్‌ టెస్టులో కరోనా నెగెటివ్‌ వచ్చిన రిపోర్టు

సాక్షి, మంచిర్యాల: ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని ప్రైవేటు ఆస్పత్రులు సొమ్ముచేసుకుంటున్నాయి. తామూ చికిత్స చేస్తామంటూ వేలకు వేలు గుంజుతున్నాయి. కరోనా చికిత్స చేసేందుకు జిల్లా కేంద్రంలోని ఒక్క ప్రైవేటు ఆస్పత్రికి మాత్రమే అనుమతి ఉండగా..మరో 10 ఆస్పత్రుల్లో అనధికారికంగా కోవిడ్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు తప్పనిసరిగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటిజెన్‌ రాపిడ్‌ టెస్టుల ద్వారా కరోనా పరీక్షలు చేసుకుని, చికిత్స కోసం అధికారికంగా సెలవులు తీసుకుంటున్నారు. ఇక వ్యాపారస్తులు, ఇతరులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి, గంటల తరబడి క్యూలో నిలబడి, కోవిడ్‌ పరీక్షలు చేసుకునే ఓపిక లేని వారు, పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచాలనుకునే వారు ప్రైవేటుకు వెళ్తున్నారు. దీనిని సొమ్ము చేసుకునేందుకు ఇప్పటికే రెండు ప్రైవేటు ఆస్పత్రులు కరోనా టెస్టులు చేస్తామంటూ సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం మొదలుపెట్టి అనుమతి లేకుండానే టెస్టులు కూడా చేస్తున్నారు.


జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కరోనా ఉందని మందులు అందించిన రశీదు
ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టుల పేరిట దోపిడీ
జిల్లాలోని 17 పీహెచ్‌సీలు, 3 సీహెచ్‌సీలు, ఒక జిల్లా ఆస్పత్రితో పాటు, 4 అర్బన్‌ ఆస్పత్రుల్లో ప్రతీరోజు ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు. సింగరేణి ఉద్యోగుల కోసం రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్‌లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రంలో మాత్రమే ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షల కోసం శాంపిళ్లు సేకరించి హైదరాబాద్‌కు పంపిస్తున్నారు. జిల్లాలో మరే ఆస్పత్రికి ఈ టెస్టులు చేసేందుకు అనుమతులు లేవు. కాని ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేస్తామంటూ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు సమయంతో సహా సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. టెస్టులు కూడా చేస్తూ వేలల్లో ఫీజులు దండుకుంటున్నారు. టెస్టులు చేసేందుకు ప్రైవేటులో అనుమతులు లేకపోయినా వారి ఆధార్‌కార్డుతో పాటు, డాక్టర్‌ ప్రిస్కిప్షన్‌ను తీసుకుని రావాలని కండీషన్‌ పెడుతున్నారు.

దీంతో జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్న యాంటిజెన్‌ ర్యాపిడ్‌ టెస్టు కిట్లను ఉపయోగించే, ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టెస్టు చేసుకునేందుకు ఆధార్‌ నంబర్‌ను వేసి, వారి మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేస్తే వారి మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాని ఆధారంగానే ర్యాపిడ్‌ టెస్టులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొన్ని ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న వారివే కావడం, కోవిడ్‌కు సంబంధించిన ముఖ్యమైన స్థానాల్లో వారు విధులను నిర్వర్తిస్తుండడంతో ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేస్తున్న యాంటిజెన్‌ కిట్లు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. యాంటిజెన్‌ కిట్ల ద్వారా వంద శాతం కోవిడ్‌కు సంబంధించిన ఫలితం రాదనే విషయం ప్రభుత్వమే ప్రకటించింది. దీంతో ముందస్తుగా సిటీ స్కానింగ్‌ చేసి, అందులో వచ్చిన రిపోర్టును, యాంటిజెన్‌ టెస్టు కిట్ల ద్వారా వస్తున్న రిపోర్టుల ఆధారంగానే కోవిడ్‌ పాజిటివ్, నెగెటివ్‌ అనే వివరాలు వెల్లడిస్తున్నట్లు సమాచారం. 

రిపోర్టు ఏది వచ్చినా దోపిడే..
కరోనా భయంతో వచ్చే వారికి సిటీ స్కానింగ్, ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టుల పేరిట రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. పాజిటివ్‌గా వచ్చినా, నెగెటివ్‌ వచ్చినా  కరోనా లక్షణాల పేరిట హోం క్వారంటైన్‌ కిట్‌ను రూ.10 వేలకు అందిస్తున్నారు. ఒకవేళ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలనుకునే వారికి రోజుకు రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నారు. సిటీ స్కానింగ్, ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టుల్లో వచ్చిన రిపోర్టులను సదరు బాధితులకు ఇవ్వకుండానే మీకు కరోనా ఉందని భయపెడుతున్నారు. 

  • ఇటీవల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఓ ఉన్నతాధికారి కరోనా భయంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. కరోనా లక్షణాలు ఉన్నాయని.. పది రోజుల పాటు తప్పనిసరిగా మందులు వాడాలని ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు సూచించారు. రెండు రోజులు వారి మందులు వాడాకా ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో సదరు వ్యక్తి అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టు చేసుకోగా నెగెటివ్‌ రావడంతో నిర్ఘాంతపోయాడు.

ఎవరికీ అనుమతులు లేవు
జిల్లాలోని ఏ ప్రైవేటు ఆసుపత్రికి కరోనా నిర్ధారణ చేసేందుకు అనుమతి ఇవ్వలేదు. అలా పరీక్షలు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. కోవిడ్‌ 19 పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందించేందుకు మాత్రమే ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుమతి ఉంది. అందులోనూ కోవిడ్‌ 19 టెస్టులు చేసేందుకు మాత్రం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. – డాక్టర్‌ నీరజ, జిల్లా వైద్యాధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement