దగ్ధమవుతున్న బస్సు
మిర్యాలగూడ అర్బన్: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం నార్కట్‌పల్లి–అద్దంకి రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ నుంచి 26 మంది నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని దర్గాను దర్శించుకునేందుకు వేమూరి కావేరి ట్రావెల్ బస్సును బుక్ చేసుకుని గురువారం రాత్రి బయల్దేరారు.
శుక్రవారం తెల్లవారుజామున మిర్యాలగూడ హనుమాన్‌పేట ప్లైఓవర్ వద్దకు చేరుకోగానే బస్సు వెనుక టైర్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును రోడ్డు పక్కకు నిలిపాడు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులను బస్సు నుంచి దింపి వేశారు. బస్సులోని మూడు బకెట్లతో నీటిని చల్లినా మంటలు అదుపులోకి రాకపోగా.. క్షణాల్లో డీజిల్ ట్యాంక్‌కు మంటలు వ్యాపించి బస్సు మొత్తం కాలిపోయింది.
ఎస్‌ఐ కృష్ణయ్య అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక శకటం వచ్చేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిఉన్న ఉల్లిగడ్డల లోడు లారీ పక్కనే ఆగిపోయింది. దీంతో లోడుపై కప్పిన టార్పాలిన్ సహా లారీకి కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బస్సులోని 26 మందిని కిందకు దింపడంతో ప్రాణ నష్టం తప్పింది.
Comments
Please login to add a commentAdd a comment