సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లు పూర్తిస్థాయిలో ప్రారంభమై ఐదు రోజులు గడిచినా ఇంకా సవాళ్లు మాత్రం అధిగమించలేదు. రిజిస్ట్రేషన్ల కోసం వెబ్‌సైట్‌లో స్లాట్ బుక్ చేసుకొనే సమయంలో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని సర్వే నంబర్లు పోర్టల్‌లో నమోదు కాకపోవడం, సొసైటీ, సంస్థలు కొనుగోలు చేసిన భూములకు ఆధార్ నంబర్లు సీడింగ్ కాకపోవడం, కటాఫ్ తేదీకి ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మ్యుటేషన్ కాకపోవడం, ఫౌతీ (వారసత్వం) తదితరాలు లక్షల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఇలాంటి కారణాలతో ఉన్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు ధరణిలో చేసుకొనే పరిస్థితి లేదు. మరోవైపు ఈ సమస్యలు ఎలా పరిష్కరించాలనే దానిపై యంత్రాంగానికి స్పష్టత లేదు. ఈ గందరగోళంతో చాలా వరకు రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయి.
‘ధరణి’ప్రారంభం తర్వాత ఎదురైన సమస్యల్లో కొన్ని...
- రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలో సర్వే నంబర్ 506లోని భూమిని విక్రయించిన వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం ధరణిలో స్లాట్ బుక్ చేసేందుకు ప్రయత్నించగా... ఆ నంబర్, మార్కెట్ విలువ ఆన్‌లైన్‌లో కనిపించలేదు. దీంతో ఈ అంశాన్ని స్థానిక తహసీల్దార్‌కు వివరించినా పరిష్కారం దొరకలేదు.
- హైదరాబాద్‌లోని సైదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తులేఖుర్ధులో పదెకరాల భూమి కొనుగోలు చేశారు. కోవిడ్–19 బారిన పడి నాలుగు నెలల క్రితం మరణించాడు. ఈ క్రమంలో ఆ భూమిని భార్య పేరిట ఫౌతీ (విరాసత్) కోసం మండల తహసీల్దార్ కార్యాలయంలో కుటుంబ సభ్యులు అర్జీ పెట్టుకున్నారు. ఇంతలోనే కొత్త రెవెన్యూ యాక్టు అమలుతో ఈ సమస్య పెండింగ్‌లో ఉండిపోయింది.
- సంగారెడ్డిలోని కంది సమీపంలో ఆరుగురు డైరెక్టర్లు ఉన్న ఓ సంస్థ ఆరెకరాల భూమి కొనుగోలు చేసింది. ఈ భూమికి పట్టాదారు పుస్తకం కావాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరి. కానీ సంస్థకు చెందిన అందరూ ఆధార్ నంబర్లు ఇచ్చే అవకాశం లేదు. వారి తరఫున ఒకరే ఆధార్ నంబర్ ఇస్తే భూమి విక్రయ సమయంలో అతనే కీలకం కానుండటంతో ఇతర డైరెక్టర్లు సైతం అయోమయంలో పడుతున్నారు.
- స్లాట్ బుకింగ్ ప్రక్రియలో అమ్మకందారులు, కొనుగోలదారుల సంఖ్య నాలుగు కంటే ఎక్కువగా ఉంటే బుకింగ్ కావడం లేదు.
- భూమి రిజిస్ట్రేషన్ చేయించుకొని మ్యుటేషన్ దరఖాస్తు పెట్టకుంటే ఆన్‌లైన్ రికార్డులో పూర్వపు యజమాని పేరే వస్తోంది. తాజాగా ధరణి వెబ్‌సైట్‌లో పూర్వపు యజమాని పేరే కనిపిస్తుండడంతో గోప్యంగా ఆ భూమిని మరో వ్యక్తికి సైతం రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది.
పరిష్కారం సర్కారుకే ఎరుక...!
రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తెచ్చిన తర్వాత రెవెన్యూ వ్యవస్థలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వీఆర్వో వ్యవస్థ రద్దవగా ఆయా ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నాళ్లూ గ్రామ స్థాయిలో భూముల వ్యవహారాల్లో కీలకపాత్ర పోషించిన వీఆర్వో సీటు రద్దు కావడంతో ఆ స్థాయిలో జరగాల్సిన కార్యకలాపాలు నిలిచిపోయాయి. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయంలో జరిగే కార్యకలాపాలు సైతం నిలిచిపోయాయి. రెవెన్యూ యాక్టు అమలుతో పాత పద్ధతిలో జరిగే అన్ని రకాల వ్యవహారాలను ప్రభుత్వం ఒక్కసారిగా నిలిపేసింది.
దీంతో అప్పటివరకు తహసీల్దార్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం అటకెక్కింది. మండల రెవెన్యూ కార్యాలయంలో పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా వాటి ఏర్పాటు పెండింగ్‌లో ఉంది. మరోవైపు నిబంధనల మేరకు రిజిస్ట్రేషన్లు చేసుకొని మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త యాక్టు అమలుతో ఆన్‌లైన్‌లో రికార్డు మారలేదు. ఫలితంగా పాస్‌పుస్తకాలు జారీ కాలేదు. వాటి జారీపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇలాంటి కారణాలు రెవెన్యూ యంత్రాంగానికి తలనొప్పిగా మారాయి. భూముల రికార్డుల్లో మార్పుచేర్పులు, సమస్యల పరిష్కరంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప ఈ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనిపించట్లేదు.
అంకెల్లో ధరణి...
ధరణి పోర్టల్‌కు శుక్రవారం నాటికి 63.63 లక్షల హిట్స్ వచ్చాయి. 38,132 మంది పోర్టల్‌లోకి లాగ్‌ఇన్ అయి సందర్శిం చారు. శుక్రవారం నాటికి 4,525 రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ. 10.77 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. తనఖా రిజిస్ట్రేషన్, నాలా, బ్యాంకులకు సంబం« దించిన లావాదేవీలను అందుబాటులోకి తేవడానికి కసరత్తు జరుగుతోంది.
వివరాలు ఇలా..
తేదీ రిజిస్ట్రేషన్లు
నవంబర్ 2 490
నవంబర్ 3 523
నవంబర్ 4 870
నవంబర్ 5 1,170
నవంబర్ 6 1,472
మొత్తం 4,525
Comments
Please login to add a commentAdd a comment