కార్యక్రమంలో వివేక్ అగ్నిహోత్రి, అనుపమ్‌ఖేర్, పీవీ సింధు, అభిషేక్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: పల్లెల అభివృద్ధికి కృషి చేయడం నిజమైన ధర్మం, దేశభక్తి అని కశ్మీర్ ఫైల్స్ చిత్రం దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి పేర్కొన్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2’వంటి ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇది కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వగ్రామం కావడం విశేషం.
ఆదివారం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన తన చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్‌లో భాగంగా గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తిమ్మాపూర్ విలేజ్ మైల్ స్టోన్ ఆవిష్కరణ సభకు బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, యూపీ మంత్రి మంత్రి నందగోపాల్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి, కావ్యరెడ్డి, నటి పల్లవి జోషి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
అనంతరం అనుపమ్ ఖేర్ మాట్లాడుతూ.. అభిషేక్ అగర్వాల్ తన తండ్రి తేజ్ నారాయణ్ పుట్టిన రోజున గ్రామాన్ని దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు మాట్లాడుతూ గ్రామ విద్యార్థులు వసతులను సరిగ్గా వినియోగించుకుని భవిష్యత్‌లో స్ఫూర్తినిచ్చే గొప్ప వ్యక్తులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
యూపీ మంత్రి నందగోపాల్ మాట్లాడుతూ.. తిమ్మాపూర్ ఆదర్శ గ్రామంగా మారేలా సేవా కార్యక్రమాలు ముందుకు సాగాలని కోరారు. తన అత్తగారి గ్రామమైన తిమ్మాపూర్‌ను దత్తత తీసుకోవడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యరెడ్డి తెలిపారు. చంద్రకళ ఫౌండేషన్ 3వ సార్థక్ దివస్‌లో భాగంగా తిమ్మాపూర్ గ్రామ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను వితరణ చేశారు. కార్యక్రమాన్ని చేపట్టిన అభిషేక్ అగర్వాల్‌ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు శ్రీశ్రీ రవిశంకర్ వర్చువల్‌గా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment