Pullareddy Owner Daughter In Law Writes Letter To President Murmu, Seeking Justice To Her - Sakshi
Sakshi News home page

నాకు న్యాయం చేయండి.. రాష్ట్రపతి ముర్ముకి పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత కోడలు విజ్ఞప్తి

Published Tue, Dec 27 2022 12:15 PM | Last Updated on Tue, Dec 27 2022 2:39 PM

Pullareddy Owner Daughter In Law Writes To President Seeking Justice To Her - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పుల్లారెడ్డి స్వీట్స్‌ అధినేత జి.రాఘవరెడ్డి ఆయన కుటుంబీకులు–కోడలు ప్రజ్ఞా రెడ్డి మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞ ఈ–మెయిల్‌ ద్వారా లేఖ రాశారు. తనను న్యాయం చేయాలని కోరడంతో పాటు ఈ నెల 29న నారాయణమ్మ కాలేజీలో మీ పర్యటనను రాఘవరెడ్డి తదితరులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ సోమవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తదితరులు రెండేళ్లుగా తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్నారని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు తమను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని వాపోయారు. తామను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో పేర్కొన్నారు.
చదవండి: Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్‌ విలువ తెలియక..

ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు.

రాఘవరెడ్డి ఇప్పటికే తన పలుకుబడి వినియోగించి తమను బెదిరించడంతో పాటు దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 29న వారికి చెందిన జి.నారాయణమ్మ కళాశాలలో మీ పర్యటనతో మరింత రెచ్చిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకునే వాళ్లు తనను మరింత వేధించడంతో పాటు దర్యాప్తు సంస్థలను ఇంకా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ప్రజ్ఞ లేఖలో పేర్కొన్నారు. ఈమె తన మెయిల్‌లో కోర్టు ఆదేశాల మేరకు గది బయట గోడను తొలగిస్తున్న అధికారుల వీడియోను జత చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement