pulla reddy sweets
-
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలి మెయిల్‌పై స్పందించిన రాష్ట్రపతి భవన్
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞ రెడ్డి ఈ–మెయిల్‌కు రాష్ట్రపతి భవన్ స్పందించింది. నగర పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ప్రజ్ఞ సోమవారం మెయిల్ ద్వారా లేఖ రాసిన విషయం విదితమే. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్న అంశాన్ని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. ఈమె పంపిన ఈ–మెయిల్‌పై రాష్ట్రపతి భవన్ స్పందించింది. తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అండర్ సెక్రటరీ పీసీ మీనా ప్రభుత్వానికి బుధవారం మెయిల్ పంపారు. ప్రజ్ఞ ఫిర్యాదుపై ఏ చర్యలు తీసుకున్నారో తమకు తెలపాలంటూ అందులో ఆదేశించారు. ఈ పరిణామంతో ప్రజ్ఞ ఆమె కుటుంబీకులు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విజ్ఞప్తి -
న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కోడలు విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి.రాఘవరెడ్డి ఆయన కుటుంబీకులు–కోడలు ప్రజ్ఞా రెడ్డి మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞ ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. తనను న్యాయం చేయాలని కోరడంతో పాటు ఈ నెల 29న నారాయణమ్మ కాలేజీలో మీ పర్యటనను రాఘవరెడ్డి తదితరులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఈ లేఖ సోమవారం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. రాఘవరెడ్డితో పాటు ఆయన భార్య భారతి రెడ్డి, కుమార్తె శ్రీవిద్య రెడ్డి తదితరులు రెండేళ్లుగా తనతో పాటు తన కుమార్తెను వేధిస్తున్నారని ప్రజ్ఞ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు తమను చంపేందుకు ప్రయత్నించారని, వరకట్నం కోసం హింసించారని వాపోయారు. తామను ఇంటి నుంచి బయటకి రాకుండా చేసేందుకు రాత్రికి రాత్రి తన గది బయట గోడ కట్టారని లేఖలో పేర్కొన్నారు. చదవండి: Hyderabad: వజ్రాలు కొట్టేసి..గోవా చెక్కేసి.. డైమండ్స్ విలువ తెలియక.. ఇవి తాను చేస్తున్న ఆరోపణలు కాదని.. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్లడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించారని ప్రజ్ఞ పేర్కొన్నారు. తమ హక్కులను కాలరాస్తూ, నన్ను బెదిరిస్తున్న అత్తింటి వారిపై ఇప్పటికే హైదరాబాద్‌లో కేసులు నమోదై ఉన్నాయని, సాటి మహిళగా తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని రాష్ట్రపతిని ప్రాధేయపడ్డారు. రాఘవరెడ్డి ఇప్పటికే తన పలుకుబడి వినియోగించి తమను బెదిరించడంతో పాటు దర్యాప్తు సంస్థల్ని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెల 29న వారికి చెందిన జి.నారాయణమ్మ కళాశాలలో మీ పర్యటనతో మరింత రెచ్చిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పర్యటనను తమకు అనుకూలంగా మార్చుకునే వాళ్లు తనను మరింత వేధించడంతో పాటు దర్యాప్తు సంస్థలను ఇంకా ప్రభావితం చేసే ప్రమాదం ఉందని ప్రజ్ఞ లేఖలో పేర్కొన్నారు. ఈమె తన మెయిల్లో కోర్టు ఆదేశాల మేరకు గది బయట గోడను తొలగిస్తున్న అధికారుల వీడియోను జత చేశారు. -
పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత మనవడిపై కేసు పెట్టిన భార్య
సాక్షి, హైదరాబాద్: పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత జి. పుల్లారెడ్డి మనవడు ఏక్నాథ్ రెడ్డిపై కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసు స్టేషన్లో గృహ హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. ఏక్నాథ్ రెడ్డికి ఆయన భార్య ప్రగ్యారెడ్డికి మధ్య గత కొంతకాలంగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏక్నాథ్ రెడ్డి.. ఆయన భార్యను ఇంట్లో నుంచి బయటకు రానివ్వడంలేదని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యను ఇంట్లోనే ఉంచి బయటకు ఆమె బయటకు రాకుండా ఉండేందుకు రాత్రికే రాత్రే రూమ్‌కు అడ్డంగా ఓ గోడను కట్టి ఇంటికి తాళం వేసి పారిపోయాడని బాధితురాలు(ఏక్నాథ్ రెడ్డి భార్య) ఫిర్యాదులో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదు మేరకు వరకట్న వేధింపుల చట్టంతో పాటు గృహ హింస కేసు నమోదు చేసినట్టు పంజాగుట్ట పోలీసులు వెల్లడించారు. -
అనంత టూ అమెరికా
కమలానగర్ వీధి... అనంతపురం నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. మలుపు తిరుగుతుండగానే ఆమడ దూరం నుంచి కమ్మటి వాసనలు స్వాగతం పలుకుతాయి. జనసమూహంతో కిటకిటలాడుతూఉండే ఆ దుకాణంలో కింద కూర్చున్న నలుగురు వ్యక్తులు ‘ఓళిగలు’ చేస్తూ కనపడతారు. ‘ఇంతేనా! ఇంకా ఇక్కడే ఏదో అద్భుతం జరుగుతోంది’ అనుకునే వారు, ఓళిగల రుచి చూసి, నోట మాట రాకుండా ఉండిపోతారు. పుల్లారెడ్డి స్వీట్స్‌తో పోటీపడుతూ, కాకినాడ కాజాను మరిపిస్తూ, తిరుపతి లడ్డూను గుర్తుచేస్తున్నట్టుండే అనంతపురం ఓళిగలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మనసును దోచుకున్నాయి ఇక్కడి ఓళిగలు. వివిధ పార్టీల నాయకులు తమ అధినాయకులకు ఈ ఓళిగలను కానుకగా ఇస్తుంటారు. ఒకప్పుడు కమలానగర్, పాతూరు, మొదటిరోడ్డుకు పరిమితమైన ఓళిగల సెంటర్లు ఇప్పుడు వందల సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా సందడి చేస్తున్నాయి. ఒక్క అనంతపురంలోనే యాభై దాకా సెంటర్లు కిటకిటలాడుతుంటాయి. ఇరవై ఏళ్ళ కిందట గోపాల్ అనే వ్యక్తి తాను స్వయంగా తయారుచేసిన ఓళిగలను బకెట్లో పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకోవడంతో ప్రారంభమైన ఓళిగల వ్యాపారం నేడు నగరమంతటా విస్తరించింది. వృత్తిపట్ల అంకిత భావం, ఆత్మవిశ్వాసం వారిని ఈ స్థాయికి తెచ్చాయి. వీరి వ్యాపారం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఘుమఘుమలాడుతూ, పొడిపొడిగా ఉంటాయి ఈ ఓళిగలు. నోరూరించే రకరకాల ఓళిగలు నెయ్యి, కొబ్బరి, కోవా, పూర్ణం, డ్రైఫ్రూట్స్ ... ఇలా రకరకాల ఓళిగలు తయారుచేస్తుంటారు. నగరానికి చెందిన ప్రవాసాంధ్రులు అమెరికా వెళ్తున్నప్పుడు తప్పకుండా ఓళిగలను అక్కడివారికి రుచి చూపించడంతో వీరి ఖ్యాతి అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. అద్దె ఇళ్లల్లో ఉంటూనే మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు వీరు. పేదరికాన్ని మరిచిపోయే మంచితనమో, ఎదిగినా ఒదిగుండాలన్న వినయమో తెలీదు కానీ, తమలాగే మరో పదిమంది బాగుపడాలని ఆకాక్షిస్తుండడం వారి విజయగా«థకు సోపానం. తయారీలోనే ప్రత్యేకత సా«ధారణంగా ఓళిగలు ఎక్కడ చేసినా దాదాపు ఒకే రుచి ఉండాలి. కానీ అనంతపురం ఓళిగలు చాలా ప్రత్యేకం. అన్నిచోట్లా మందంగా ఉండే బొబ్బట్లలాగ ఉండవు వీరి ఓళిగలు. స్వచ్ఛమైన రవ్వకు బెల్లం, గసగసాలు, ఏలకులు, రిఫైన్డ్ ఆయిల్ జత చేసి తయారయ్యే ఓళిగలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. అందువల్లే వీటికి ఇంత డిమాండు. మామూలు ఓళిగ పది రూపాయలు ఉంటే, కోవా ఓళిగ 20 నుండి 30, స్పెషల్ ఓళిగ 20, డ్రై ఫ్రూట్స్ 40, కొబ్బరి కోవా 20 రూపాయల వరకు పలుకుతుంది. ఒక్కో నిర్వాహకుడు సగటున రెండు వందల నుండి మూడు వందల వరకు వివిధ రకాలైన ఓళిగలను విక్రయిస్తుంటారు. మంచి ఆదాయ వనరుగా ఉన్నాయి అనంత ఓళిగలు. అందుబాటు ధర... ఓళిగ సెంటర్లకు డిమాండు ఎక్కువగా ఉంది. నేతి ఓళిగలైనా, మమూలు ఓళిగలైనా తక్కువ ధరలో దొరుకుతుండడంతో స్వీట్సు కొనాలనుకుంటే ఓళిగలనే ఎంచుకుంటారు. ఈ కాలంలో రుచికరమైన ఏ స్వీటైనా పదిరూపాయల పైమాటే. కానీ ఇక్కడ కేవలం ఎనిమిది రూపాయలకే శుభ్రమైన ఓళిగ లభిస్తుంది కాబట్టే అంత డిమాండు. – గుంటి మురళీకృష్ణ, పేదరికం రుచి బాగా తెలుసు నాకు ఓళిగల రుచి కన్నా పేదరికం రుచే బాగా తెలుసు. కష్టపడి పైకి రావాలంటే రాజీపడని మనస్తత్వం ఉండాలి. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఖరీదైన బెల్లం, బేడలు, ఏలకులు, గసగసాలు వాడడం వలన మా ఓళిగలకు మంచి రుచి వస్తుంది. పండుగలప్పుడు రోజుకు ఆరు వేల వరకు ఓళిగలు తయారుచేస్తున్నా ఎక్కడా నాణ్యత లోపించదు. కస్టమర్లతో మాట్లాడే పద్ధతి కూడా ఒక రకంగా మా వ్యాపారం ఈ స్థితిలో ఉండడానికి కారణమనుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ వివాహం మా అనంతపురానికి ప్రత్యేక గౌరవం తెచ్చి పెట్టింది. – బలరామ్, శ్రీవెంకటేశ్వర ఓళిగల సెంటర్ వారిని మరచిపోలేం కష్టాలను ధైర్యంగా అధిగమించాలి. మేం ఎదగడానికి మాకు చాలామంది చేయూతనిచ్చారు. వారిని ఎన్నటికీ మరచిపోలేం. నాణ్యత తగ్గని మా ఓళిగలు మా కృషికి నిదర్శనం. ఒకనాడు పది రూపాయల కూలీకి వెళ్లిన మేము, కొందరికి పని ఇచ్చే స్థాయికి ఎదిగాం. నిరంతర శ్రమతో పైకి వచ్చాం. పెద్ద పెద్ద హోటళ్లలో ఓళిగలు మెనూలో దర్శనమివ్వడం మాకు చాలా గర్వంగా ఉంది. – నాగరత్న, సెంటర్ నిర్వాహకులు, కమలానగర్ కల్చరల్ రిపోర్టర్, అనంతపురం -
మారిషస్‌కూ పుల్లారెడ్డి స్వీట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్వీట్స్ షాపు.. ఈ పేరు వినగానే.. గల్లీకొకటి ఉంటుందిలే అని తేలిగ్గా కొట్టిపారేస్తాం. కానీ, 66 ఏళ్లుగా మిఠాయిల వ్యాపారంలో నిలదొక్కుకోవడమంటే మామూలు విషయం కాదు. అక్షరాలు కూడా సరిగా రాని ఓ సాధారణ వ్యక్తి ప్రారంభించిన మిఠాయి కొట్టు... నేడు దేశం దాటి మారిషస్‌లోనూ వ్యాపారం చేసే స్థాయికి చేరిందంటే మాటలు కాదు. ఎవరా వ్యాపారి.. ఏంటా షాపు.. ఎవరా వ్యాపారి అనుకుంటున్నారా? అదే పుల్లారెడ్డి స్వీట్స్! యజమాని జి.పుల్లారెడ్డి!! 1948 నాటి మాట.. కర్నూల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని గోకవరం గ్రామవాసి జి.పుల్లారెడ్డి. చదువు అంతగా అబ్బకపోవడంతో కసిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యాపారి బంగారం దుకాణంలో పనిలో చేరాడు. కాస్త డబ్బు సంపాదించాక ఉద్యోగం మానేసి టీ, మజ్జిగ అమ్మే చిన్నపాటి కొట్టును అక్కడే ప్రారంభించాడు పుల్లారెడ్డి. స్వీట్లంటే ఇష్టమున్న వెంకటరెడ్డి తాను కూడా మిఠాయిల వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. మరి బంగారం దుకాణాన్ని, స్వీట్స్ వ్యాపారాన్ని ఒకే సమయంలో రెండింటినీ నిర్వహణ చేయడం కష్టంగా ఉంటుందనే కారణంతో అప్పట్లో రూ. వెయ్యి అప్పు ఇచ్చి మరీ పుల్లారెడ్డి చేత బలవంతంగా కర్నూల్లోని పాతబస్టాండ్ ప్రాంతంలో మిఠాయి కొట్టును తెరిపించాడు కసిరెడ్డి వెంకటరెడ్డి. అలా మొదలైన పుల్లారెడ్డి స్వీట్స్ ప్రస్థానం.. కర్నూల్లో 4, హైదరాబాద్‌లో 8, బెంగళూరులో 6 ఔట్లెట్లతో స్వీట్స్ వ్యాపారంలో దూసుకుపోతోంది. 18 ఔట్లెట్లు.. రూ.45 కోట్ల టర్నోవర్ హైదరాబాద్‌లోని సోమాజిగూడ, అబిడ్స్, కూకట్పల్లి, విక్రంపురి, దిల్సుఖ్నగర్, పీఅండ్‌టీ కాలనీ, మెహదీపట్నం, కొండాపూర్‌లో, కర్నూల్లోని పాత బస్‌స్టాండ్, కొత్త బస్‌స్టాండ్, కలెక్టర్ ఆఫీస్, రాజ్ విహార్ సెంటర్లలో, బెంగళూరులోని జయ నగర్, మారతాహళ్లి, వైట్వీల్డ్స్, బీటీఎం లేఅవుట్, ఇంద్రానగర్, కడిగుడిలో మొత్తం 18 పుల్లారెడ్డి స్వీట్స్ ఔట్‌లెట్లున్నాయి. వార్షిక టర్నోవర్ రూ.45 కోట్లు. జీడిపప్పు పాకం, కోవాపురి, అజ్మీరీ కలాకాన్ వంటివి పుల్లారెడ్డి స్వీట్స్ ప్రత్యేకతలు. కేన్సర్ నివారణ స్వీట్లు.. ‘‘స్వీట్లంటే మనలో చాలా మంది ఎక్కువ తినొద్దంటారు. దగ్గొస్తుందని హెచ్చరిస్తారు. కానీ, అది తప్పు. స్వచ్ఛమైన నెయ్యి, పాలతో తయారు చేసే స్వీట్లు ఆరోగ్యానికి మంచివే అని వైద్యులు కూడా చెబుతున్నారు. దేశీ ఆవుల మూత్రం, పేడతో కేన్సర్ వ్యాధిని నయం చేయవచ్చని అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనల్లోనూ తేలింది’’ అంటారు పుల్లారెడ్డి స్వీట్స్ పార్ట్నర్ జి.ఏకాంబరరెడ్డి. అందుకే దేశీ ఆవుల నుంచి వచ్చే పాలు, నెయ్యితో కేన్సర్ నివారణ మిఠాయిలు తయారు చేయడంపై దృష్టి సారించామని, సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నామని చెప్పారాయన. ‘‘ఇందుకోసం షిమోగా నుంచి 30 దేశీ ఆవులు దిగుమతి చేసుకునే యోచనలో ఉన్నాం. వాటి కోసం ప్రత్యేకమైన గోశాల ఏర్పాటు, పర్యవేక్షణ వంటి కీలకాంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నాం. అయితే కేన్సర్ నివారణ స్వీట్ల తయారీ నిర్ణయం వ్యాపారం కోసం మాత్రమే కాదు.. సమాజ సేవలో భాగంగానే చేస్తాం’’ అని తెలియజేశారు. మారిషస్‌కూ విస్తరణ యోచన... మారిషస్‌లో పుల్లారెడ్డి స్వీట్స్ వ్యాపారాన్ని ప్రారంభించే యోచనలో ఉన్నామని, ఇందుకోసం అక్కడి వ్యాపార అవకాశాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రజల ఆహారపు అలవాట్లు, రుచుల గురించి వివిధ మార్గాల ద్వారా అధ్యయనం చేస్తున్నామని ఏకాంబరరెడ్డి తెలియజేశారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే మారిషస్‌లో వ్యాపారాన్ని ప్రారంభిస్తామని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఈ ఏడాది ఉగాదికి హైదరాబాద్‌లోని ఏఎస్ రావ్ నగర్లో కొత్త ఔట్‌లెట్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాజధాని ఖరారయ్యాక అక్కడ కూడా తమ వ్యాపారాన్ని విస్తరిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారాయన. ల్యాబ్‌లో పరీక్షించిన తర్వాతే.. స్వీట్ల తయారీకి అవసరమైన పాలు, నెయ్యి, పెరుగు వంటి వాటిని సొంత ల్యేబొరేటరీలో పరీక్షించిన తర్వాతే కొనుగోలు చేస్తారు. నంద్యాల, తమిళనాడు నుంచి నెయ్యి దిగుమతి అవుతుంటుంది. రోజుకు 20 డబ్బాలు (ఒక్కోటి 15 కేజీలు) కొనుగోలు చేస్తారు. పాలు రోజుకు 1,500 లీటర్లు కొంటారు. సుగంధ ద్రవ్యాలు, ఇతరరత్రా దినుసులన్నీ బేగంబ జార్ నుంచే కొనుగోలు చేసుకుంటారు.