కమలానగర్ వీధి... అనంతపురం నగరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. మలుపు తిరుగుతుండగానే ఆమడ దూరం నుంచి కమ్మటి వాసనలు స్వాగతం పలుకుతాయి. జనసమూహంతో కిటకిటలాడుతూఉండే ఆ దుకాణంలో కింద కూర్చున్న నలుగురు వ్యక్తులు ‘ఓళిగలు’ చేస్తూ కనపడతారు. ‘ఇంతేనా! ఇంకా ఇక్కడే ఏదో అద్భుతం జరుగుతోంది’ అనుకునే వారు, ఓళిగల రుచి చూసి, నోట మాట రాకుండా ఉండిపోతారు. పుల్లారెడ్డి స్వీట్స్‌తో పోటీపడుతూ, కాకినాడ కాజాను మరిపిస్తూ, తిరుపతి లడ్డూను గుర్తుచేస్తున్నట్టుండే అనంతపురం ఓళిగలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మనసును దోచుకున్నాయి ఇక్కడి ఓళిగలు. వివిధ పార్టీల నాయకులు తమ అధినాయకులకు ఈ ఓళిగలను కానుకగా ఇస్తుంటారు. ఒకప్పుడు కమలానగర్, పాతూరు, మొదటిరోడ్డుకు పరిమితమైన ఓళిగల సెంటర్లు ఇప్పుడు వందల సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా సందడి చేస్తున్నాయి. ఒక్క అనంతపురంలోనే యాభై దాకా సెంటర్లు కిటకిటలాడుతుంటాయి. ఇరవై ఏళ్ళ కిందట గోపాల్ అనే వ్యక్తి తాను స్వయంగా తయారుచేసిన ఓళిగలను బకెట్‌లో పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకోవడంతో ప్రారంభమైన ఓళిగల వ్యాపారం నేడు నగరమంతటా విస్తరించింది. వృత్తిపట్ల అంకిత భావం, ఆత్మవిశ్వాసం వారిని ఈ స్థాయికి తెచ్చాయి. వీరి వ్యాపారం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఘుమఘుమలాడుతూ, పొడిపొడిగా ఉంటాయి ఈ ఓళిగలు.
నోరూరించే రకరకాల ఓళిగలు
నెయ్యి, కొబ్బరి, కోవా, పూర్ణం, డ్రైఫ్రూట్స్ ... ఇలా రకరకాల ఓళిగలు తయారుచేస్తుంటారు. నగరానికి చెందిన ప్రవాసాంధ్రులు అమెరికా వెళ్తున్నప్పుడు తప్పకుండా ఓళిగలను అక్కడివారికి రుచి చూపించడంతో వీరి ఖ్యాతి అంతర్జాతీయస్థాయికి చేరుకుంది. అద్దె ఇళ్లల్లో ఉంటూనే మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు వీరు. పేదరికాన్ని మరిచిపోయే మంచితనమో, ఎదిగినా ఒదిగుండాలన్న వినయమో తెలీదు కానీ, తమలాగే మరో పదిమంది బాగుపడాలని ఆకాక్షిస్తుండడం వారి విజయగా«థకు సోపానం.
తయారీలోనే ప్రత్యేకత
సా«ధారణంగా ఓళిగలు ఎక్కడ చేసినా దాదాపు ఒకే రుచి ఉండాలి. కానీ అనంతపురం ఓళిగలు చాలా ప్రత్యేకం. అన్నిచోట్లా మందంగా ఉండే బొబ్బట్లలాగ ఉండవు వీరి ఓళిగలు. స్వచ్ఛమైన రవ్వకు బెల్లం, గసగసాలు, ఏలకులు, రిఫైన్డ్ ఆయిల్ జత చేసి తయారయ్యే ఓళిగలు నోట్లో వేసుకుంటేనే కరిగిపోతాయి. అందువల్లే వీటికి ఇంత డిమాండు. మామూలు ఓళిగ పది రూపాయలు ఉంటే, కోవా ఓళిగ 20 నుండి 30, స్పెషల్ ఓళిగ 20, డ్రై ఫ్రూట్స్ 40, కొబ్బరి కోవా 20 రూపాయల వరకు పలుకుతుంది. ఒక్కో నిర్వాహకుడు సగటున రెండు వందల నుండి మూడు వందల వరకు వివిధ రకాలైన ఓళిగలను విక్రయిస్తుంటారు. మంచి ఆదాయ వనరుగా ఉన్నాయి అనంత ఓళిగలు.
అందుబాటు ధర...
ఓళిగ సెంటర్లకు డిమాండు ఎక్కువగా ఉంది. నేతి ఓళిగలైనా, మమూలు ఓళిగలైనా తక్కువ ధరలో దొరుకుతుండడంతో స్వీట్సు కొనాలనుకుంటే ఓళిగలనే ఎంచుకుంటారు. ఈ కాలంలో రుచికరమైన ఏ స్వీటైనా పదిరూపాయల పైమాటే. కానీ ఇక్కడ కేవలం ఎనిమిది రూపాయలకే శుభ్రమైన ఓళిగ లభిస్తుంది కాబట్టే అంత డిమాండు. – గుంటి మురళీకృష్ణ,
పేదరికం రుచి బాగా తెలుసు
నాకు ఓళిగల రుచి కన్నా పేదరికం రుచే బాగా తెలుసు. కష్టపడి పైకి రావాలంటే రాజీపడని మనస్తత్వం ఉండాలి. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఖరీదైన బెల్లం, బేడలు, ఏలకులు, గసగసాలు వాడడం వలన మా ఓళిగలకు మంచి రుచి వస్తుంది. పండుగలప్పుడు రోజుకు ఆరు వేల వరకు ఓళిగలు తయారుచేస్తున్నా ఎక్కడా నాణ్యత లోపించదు. కస్టమర్లతో మాట్లాడే పద్ధతి కూడా ఒక రకంగా మా వ్యాపారం ఈ స్థితిలో ఉండడానికి కారణమనుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్ వివాహం మా అనంతపురానికి ప్రత్యేక గౌరవం తెచ్చి పెట్టింది.
– బలరామ్, శ్రీవెంకటేశ్వర ఓళిగల సెంటర్
వారిని మరచిపోలేం
కష్టాలను ధైర్యంగా అధిగమించాలి. మేం ఎదగడానికి మాకు చాలామంది చేయూతనిచ్చారు. వారిని ఎన్నటికీ మరచిపోలేం. నాణ్యత తగ్గని మా ఓళిగలు మా కృషికి నిదర్శనం. ఒకనాడు పది రూపాయల కూలీకి వెళ్లిన మేము, కొందరికి పని ఇచ్చే స్థాయికి ఎదిగాం. నిరంతర శ్రమతో పైకి వచ్చాం. పెద్ద పెద్ద హోటళ్లలో ఓళిగలు మెనూలో దర్శనమివ్వడం మాకు చాలా గర్వంగా ఉంది.
– నాగరత్న, సెంటర్ నిర్వాహకులు, కమలానగర్
కల్చరల్ రిపోర్టర్, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment