గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్. చిత్రంలో రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్, బోసురాజు, షబ్బీర్ అలీ, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా ప్రభావితం చేయగల వర్గాలతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో భేటీ కానున్నారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో తెలంగాణ పర్యటనకు రానున్న రాహుల్‌తో ఆయా వర్గాల భేటీ నిర్వహించాలని టీపీసీసీ ముఖ్యులు నిర్ణయించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం గాంధీ భవన్‌లో జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మే 6న వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే ‘రైతు సంఘర్షణ సభ’కు రాహుల్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు, యాసంగి ధాన్యం కొనుగోలులో టీఆర్‌ఎస్, బీజేపీల డ్రామాను రాహుల్ ప్రసంగం ద్వారా ఎండగట్టాలని పార్టీ నేతలు నిశ్చయించారు.
అలాగే మే 7న బోయిన్‌పల్లిలో పార్టీ అధీనంలో ఉన్న 10.5 ఎకరాల స్థలంలో ‘రాజీవ్ నాలెడ్జ్ సెంటర్’ ఏర్పాటుకు రాహుల్ చేతుల మీదుగా శిలాఫలకం వేయించాలని నిర్ణయించారు. అనంతరం అక్కడే పలు వర్గాలతో రాహుల్‌ను సమావేశపర్చాలని, ముఖ్యంగా తెలంగాణ అమరవీరులు, ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలతో రాహుల్‌ను మాట్లాడించాలని తీర్మానించారు. వారితోపాటు డ్వాక్రా సంఘాలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలతో కూడా రాహుల్ సమావేశమయ్యేలా షెడ్యూల్ రూపొందించాలని, ఆ తర్వాత వివిధ స్థాయిల్లోని పార్టీ నేతలు, అత్యధిక సభ్యత్వాలు చేయించిన ఎన్‌రోలర్స్‌తో సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దీంతోపాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో పార్టీలో సభ్యులుగా చేరిన 40 లక్షల మందికిపైగా కార్యకర్తలకు బీమాను వర్తింపజేసేలా నేతలంతా బాధ్యత తీసుకోవాలని కూడా ఈ భేటీలో నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎల్పీ మాజీ నేత కె. జానారెడ్డి, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, టీపీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ప్రచార కమి టీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు గీతారెడ్డి, అంజన్‌కుమార్ యాదవ్, మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, మాజీ ఎంపీ హనుమంతరావు, పీఏసీ కన్వీనర్ షబ్బీర్ అలీ, కేంద్ర మాజీ మంత్రులు రేణుకా చౌదరి, బలరాం నాయక్ టీపీసీసీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
సమావేశాలకు రాకుంటే నోటీసు..
సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్ మాట్లాడుతూ పార్టీ నేతలు సమయపాలన పాటించాలని, సమావేశాలకు సకాలంలో హాజరు కావాలని సూచించారు. వరుసగా మూడు సమావేశాలకు హాజరుకాకపోతే నోటీసు ఇస్తామని హెచ్చరించారు. అనంతరం వీహెచ్ మాట్లాడుతూ పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు విషయాన్ని పార్టీ సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు.
అనంతరం మధుయాష్కీగౌడ్, సీతక్క, సీనియర్ ఉపాధ్యక్షుడు వేం నరేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మే 6న వరంగల్ సభకు రాహుల్ వస్తున్నారని, టీఆర్‌ఎస్, బీజేపీల రైతు వ్యతిరేక విధానాలను ఈ సభ ద్వారా ఎండగడతామన్నారు. మే 7 షెడ్యూల్‌ను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామన్నారు.
5 లక్షల మందితో రాహుల్ సభ: రేవంత్
జిల్లా పార్టీ అధ్యక్షుల (డీసీసీ)తో శనివారం సాయంత్రం గాంధీ భవన్‌లో మాణిక్యం ఠాగూర్, రేవంత్‌రెడ్డి సహా కొందరు ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఇటీవలి కాలంలో పార్టీ నిర్వహించిన పోరాట కార్యక్రమాలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ ఆం దోళనలపై వారితో చర్చించి దిశానిర్దేశం చేశారు. రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా జనసమీకరణ గురించి రేవంత్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 10 మంది వచ్చేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, రాహుల్ సభకు 5 లక్షల మందికి తగ్గకుండా ప్రజలు హాజరయ్యేలా చూడాలని డీసీసీ అధ్యక్షులకు సూచించారు. ఈ సభ విజయవంతం కోసం ఈ నెల 20న వరంగల్‌లో సన్నాహక సమావేశం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కాగా, డీసీసీల భౌగోళిక స్వరూపం లో మార్పులపై రాహుల్ సభ తర్వాత నిర్ణ యం తీసుకుందామని ఠాగూర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment