మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
అభిప్రాయ సేకరణ కోసం ఈనెల 11–16 తేదీల్లో జిల్లాల పర్యటనలు
ప్రజలు అభిప్రాయం తెలిపేందుకు ప్రత్యేక ఫార్మాట్
ఎన్ని ఎకరాలకు ఇవ్వాలన్న అంశంపై కూడా ఆ తర్వాతే స్పష్టత
కౌలురైతులకూ భరోసా ఇస్తామని స్పష్టం చేసిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు భరోసా పథకాన్ని ఎలా అమలు చేయా లన్న అంశంపై ప్రజాభిప్రాయం మేరకే ముందుకెళ్లాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ పథకం పరిధిలోకి వచ్చే భాగస్వామ్య పక్షాలతో పాటు మే«థావులు, సామాన్య ప్రజల అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాతే విధివిధానాల రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని అభిప్రాయ పడింది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు గాను ఈనెల 11–16 తేదీల్లో ఉపసంఘంలోని మంత్రులు, ఇన్‌చార్జి మంత్రులు జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని, విస్తృత స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సమావేశాల్లో అభిప్రాయం తెలిపేందుకు గాను ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించాలని ఉపసంఘం నిర్ణయించింది.
రైతు భరోసాపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన గంటకు పైగా సమావేశమైంది. ఈ సమావేశంలో ఉపసంఘం సభ్యులైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావులతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సాగులో లేకున్నా రైతుబంధు ఇచ్చారు!
గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు అమలు చేసిన తీరు, సీజన్‌ల వారీగా అయిన ఖర్చు, ఎంత మంది రైతులకు.. ఎన్ని ఎకరాల భూమి ఉందన్న అంశాలను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు ఉపసంఘానికి వివరించారు. గత రెండు సీజన్‌లలో రైతుబంధు ఇచ్చిన తర్వాత తమ శాఖ నేతృత్వంలో పరిశీలన జరిపామని, ఈ సందర్భంగా ఎలాంటి సాగు చేయకుండానే 20 లక్షల ఎకరాలకు రైతుబంధు ఇచ్చినట్టు తేలిందని ఆయన వెల్లడించారు. ఈ 20 లక్షల ఎకరాల్లో వ్యవసాయ యోగ్యమైన భూమి ఉన్నా సాగు చేయకపోవచ్చని, ప్లాట్లు, కొండలు, గుట్టలు కూడా ఉండవచ్చని తెలిపారు.
అనంతరం మంత్రులు మాట్లాడుతూ.. ఎవరెవరికి రైతు భరోసా అమలు చేయాలన్న దానిపై తొందరపడకూడదని, ప్రజల డబ్బును ప్రజల అభిప్రాయం మేరకు వెచ్చించాలని, వారి అభిప్రాయం తీసుకున్న తర్వాతే ఎలాంటి భూములకు రైతు భరోసా వర్తింపజేయాలి, ఎన్ని ఎకరాల వరకు అమలు చేయాలన్న దానిపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాగు చేసే ప్రతి ఎకరానికీ రైతు భరోసా ఇస్తామని, వరంగల్ డిక్లరేషన్‌లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా ఈ సాయాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మరోమారు సమావేశం కావాలని మంత్రులు నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment