సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది గట్టు వామనరావు, పీవీ నాగమణి దంపతుల హత్య విషయంలో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్.. స్థానికంగా పేరున్న ఓ ప్రజాప్రతినిధి, అతడి అనుచరులు చేసే పంచాయతీలకు అడ్డాగా మారిందని కల్వచర్ల గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్‌కు చేరిన వివాదాల్లో సదరు ప్రజాప్రతినిధి అనుచరులు జోక్యం చేసుకోవడం ఆనవాయితీగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కోర్టుకు వెళ్లేవి చాలా తక్కువ. భూ వివాదాలు, కుటుంబ సమస్యల విషయంలో ఠాణా మెట్లెక్కిన వారి చేతి చమురు వదలాల్సిందే. విషయం తెలవగానే సదరు నేత అనుచరులు వాలిపోతారు. ఎవరో ఒకరి పక్షం వహిస్తారు. వారు ఎవరి పక్షాన నిలిస్తే వారికి స్టేషన్ సిబ్బంది పూర్తిగా సహకరిస్తారు. బాధితుల్లో ముందుగా వెళ్లి సదరు నేత అనుచరులను ప్రసన్నం చేసుకుంటారో వారిదే పైచేయి అవుతుంది.
అతడి మాటే ‘సత్యం’.. ఆపై ‘మహేంద్ర’జాలం..
రామగిరి పోలీస్‌స్టేషన్‌లో కల్వచర్లకు చెందిన ఓ నేత సదరు ముఖ్య అనుచరుడిదే హవా. స్థానిక ప్రజాప్రతినిధికి అతడు కుడిభుజం అన్న ప్రచారం ఉంది. అందుకే స్టేషన్‌లో అతడు ఎంత చెబితే అంత. ఆయన ఆదేశాలు వారిపై ‘మహేంద్ర’జాలంలా పనిచేస్తాయి. రామగిరి పోలీసులు, సదరు నేత కలసి 2019లో రామగిరి పోలీస్ స్టేషన్ వేదికగా ఓ భారీ సెటిల్‌మెంట్ చేశారని సమాచారం. తన ఎన్నారై భర్త వేధిస్తున్నాడంటూ రామగిరి పోలీసులను ఓ యువతి ఆశ్రయించింది. ఈ విషయలో కల్వచర్ల స్థానిక నేత జోక్యం చేసుకున్నాడు. అంతే సీన్ మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించాలి లేదా కేసు నమోదు చేయాలి. ఇవేమీ చేయలేదు. 2019 నవంబర్ 22న కౌన్సెలింగ్ పేరిట ఆ ఎన్నారై భర్తను ఠాణాకు పిలిపించారు. తనకు ఆరోగ్యం బాగా లేదని ఆ ఎన్నారై చెబుతున్నా.. అతడిని గంటల పాటు మోకాళ్లపై నిల్చోబెట్టారు. స్టేషన్‌లో గుంజీలు తీయించారు. రకరకాల కేసులు పెడతామని, కెరీర్ నాశనం చేస్తామని, జీవితంలో తిరిగి అమెరికా వెళ్లకుండా చేస్తామని బెదిరించారు.
వాస్తవానికి ఆ యువకుడికి అమెరికాలో మరో మూడేళ్ల పాటు వీసా ఉంది. దీంతో భయపడ్డ బాధితుడు కాళ్లబేరానికి వచ్చాడు. బాధితురాలితో రాజీకి రావాలని అందుకు రూ.50 లక్షలు ముట్టజెప్పాలని సదరు నేత, రామగిరి పోలీసులు తీర్పు చెప్పారు. తాను అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడి.. ఆఖరికి యువతికి రూ.30 లక్షలు ఇవ్వాలని డీల్ క్లోజ్ చేశారు. చేసేదిలేక బాధితుడు సరేనన్నాడు. తర్వాత ఎన్నారై నుంచి రూ.50 వేలు తీసుకున్నారు. భారీగా వసూలు చేసి ఇచ్చినందుకు సదరు యువతి తండ్రి వద్ద నుంచి కూడా తమ వాటాను పోలీసులు, సదరు నేత పంచుకున్నారు. ఇలాంటి ఉదంతాలకు అక్కడ లెక్కేలేదు.
అర కిలోమీటర్‌లోపే హత్య..
మొత్తం వ్యవహారంలో ఓ నేతపై తీవ్ర విమర్శలు వస్తుండటం.. అతడికి, అతడి అనుచరులకు బాగా పట్టున్న రామగిరి పోలీస్‌స్టేషన్‌పరిధిలోనే జంటహత్యలు జరగడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గట్టు వామనరావును అతడికి తెలియకుండానే నిందితులు మంథని నుంచి వెంబడిస్తూ వచ్చారు. మంథని కోర్టు నుంచి హత్యలు జరిగిన ఘటనాస్థలానికి మధ్య దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రదేశానికి ముందు మంథని ఠాణా, అది దాటాక కమాన్‌పూర్ ఠాణా పరిధి ఉంటాయి. ఈ రెండు స్టేషన్ల పరిధిలోనూ అడవి, నిర్మానుష్య ప్రాంతాలు అధికం. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నిత్యం రద్దీగా ఉండే రామగిరి పీఎస్ పరిధిలో హత్యలు చేయడం, అది కూడా మరో అర కిలోమీటరు దూరంలో స్టేషన్ పరిధి ముగుస్తుందనగా ఘటన జరగడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామగిరి పోలీసుల అండ చూసుకునే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో క్రైం సీన్ (నేరం జరిగిన ప్రదేశం)లో సాక్ష్యాధారాల సేకరణకు పోలీసులు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానిక నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా అర్ధరాత్రి వెళ్లి క్రైం సీన్ వద్ద ట్రాఫిక్ కోన్స్ పెట్టడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment