సాక్షి, రంగారెడ్డి: తిమ్మాపూర్‌లో ఎనభై ఏళ్ల క్రితం ప్రారంభమైన రైల్వేస్టేషన్ సినిమా షూటింగ్‌లకు ప్రఖ్యాతి గాంచింది. అగ్ర హీరోలు మొదలుకుని జూనియర్ల వరకు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో సినిమా షూటింగ్‌లు చిత్రీకరించడానికి చాలా ఆసక్తి కనబర్చుతారు. వీరి సెంటిమెంటే ఇందుకు కారణం. పెద్ద హీరోలు నటించే సినిమాల్లో రైల్వే స్టేషన్ సీన్ ఉందంటే ముందుగా తిమ్మాపూర్‌నే ఎంచుకుంటారు. ఇక్కడ ఒక చిన్న సీన్ చిత్రీకరించినా సినిమా హిట్ అవుతుందని హీరోలతో పాటు డైరక్టర్లలో గట్టి నమ్మకం ఉంది. చిరంజీవి నటించిన అల్లుడా మజాకా, వెంకటేశ్ నటించిన సూర్యవంశం, పవన్ కల్యాణ్ సినిమా జానీ, బాలకృష్ణ మూవీ సమరసింహారెడ్డితో పాటు పలు చిత్రాల్లోని సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు.
ఆదర్శంగా..
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ మిగితా స్టేషన్లకు ఆదర్శంగా నిలుస్తోంది. పరిశుభ్రత, మొక్కల పెంపకం, ప్రయాణికులు కూర్చునేందుకు కుర్చీలు, తాగునీరు, టాయిలెట్లు ఇలా ప్రయాణికులకు అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్ మీదుగా నిత్యం 20 రైళ్లు రాకపోకలు కొనసాగిస్తుండగా 4 రైళ్లు ఇక్కడ ఆగుతాయి. పండగలు ఇతర రద్దీ దినాల్లో ఈ స్టేషన్ నుంచి నిత్యం వంద మందికిపైగా రాకపోకలు కొనసాగిస్తున్నారు.
రెండుసార్లు ఉత్తమ అవార్డులు
తిమ్మాపూర్ రైల్వే స్టేషన్‌లో పనిచేసే స్టేషన్ మాస్టర్లు, మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బంది కృషి ఫలితంగా హైదరాబాద్ డివిజన్ పరిధిలో రెండుసార్లు ఉత్తమ స్టేషన్‌గా అవార్డులు వరించాయి. ప్రస్తుతం పాత భవనాలు, ఫ్లాట్‌ఫాంలను తొలగించి వాటి స్థానంలో కొత్తవి నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment