సాక్షి, హైదరాబాద్: మాణిక్యం ఠాగూర్.. కాంగ్రెస్ రాష్ట్రాల ఇన్‌చార్జుల జాబితాలో పాపులర్ అయిన పేరు ఇది. తెలంగాణ ఇన్‌చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పార్టీ మూడు కొట్లాటలు, ఆరు తగాదాలన్నట్టుగా నిత్యం వార్తల్లో నిలిచింది. 2020 సెప్టెంబర్‌లో బాధ్యతలు తీసుకున్న ఆయన తర్వాత బాధ్యతల నుంచి తప్పుకునే వరకు ప్రతిరోజూ ఏదో ఒక తలనొప్పితోనే సతమతమయ్యారు.
పార్టీ నేతలను సమన్వయం చేయలేక, పరిస్థితులను చక్కదిద్దలేక, అధిష్టానానికి ఏం చెప్పాలో అర్థం కాక నానా అవస్థలు పడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియామకం తర్వాత ఈ తలనొప్పులు తీవ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టడం, తెలంగాణ కాంగ్రెస్ వాట్సాప్ గ్రూప్ నుంచి వైదొలగడం చర్చనీయాంశమయ్యింది. ఆయన రాష్ట్ర బాధ్యతల నుంచి తప్పుకుంటారని, కొత్త ఇన్‌చార్జి వస్తారనే అభిప్రాయం వ్యక్తమయ్యింది.
విఫల ఇన్‌చార్జిగా మిగిలిపోతానని..!
రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహించేందుకు మాణిక్యం ఠాగూర్ విముఖత వ్యక్తం చేయడం వెనుక పలు కారణాలున్నాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ పారీ్టలోని కయ్యాలు తన వ్యక్తిగత కెరీర్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని ఆయన భావించినట్టు తెలుస్తోంది. తాను ఇన్‌చార్జిగా వచ్చిన తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ వైఫల్యం తనకు చుట్టుకుంటే తానో విఫల ఇన్‌చార్జిగా మిగిలిపోతాననే ఆందోళన ఆయన రాష్ట్ర పార్టీ నేతల వద్ద వ్యక్తం చేశారు.
పార్టీ పరిస్థితులను చక్కదిద్దలేకపోయానని అధిష్టానం భావిస్తే సంస్థాగతంగా కూడా తనకు ఇబ్బంది అవుతుందని భావించే వారని మాణిక్యంతో సన్నిహితంగా ఉన్న నేతలు వెల్లడించారు. దీనికి తోడు లోక్‌సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నా.. తన సొంత నియోజకవర్గమైన విదురకు సమయం ఇవ్వలేకపోతున్నానని, కోరుకున్న విధంగా తమిళనాడు పీసీసీ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను నియోజకవర్గానికి వెళ్లిపోతానని ఆయన చెప్పేవారని టీపీసీసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment