విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో మాట్లాడుతున్న చినజీయర్‌స్వామి. వేదికపై మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్
సాక్షి ప్రతినిధి,వరంగల్: ఆధ్యాత్మిక భావనతో మనసులో ఎటువంటి కల్మషం లేకుండా, మానవీయ కోణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా సత్ఫలితాలు వస్తాయని త్రిదండి చిన జీయర్‌స్వామిజీ అన్నారు. కొత్త ఆలయాలు నిర్మించడం సహజమని, కానీ పురాతన ఆలయానికి పునరుజ్జీవం పో యడం గొప్ప విషయమని, కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వల్మిడిలో రామాలయం నిర్మించడం మరింత అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పాలకులకు ప్రేమ, భక్తి రెండూ కలసి ఉండడంతో మనం అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఇలాగే పచ్చగా కొనసాగాలని ఆకాంక్షించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో సోమవారం జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ పునఃప్రారంభం, విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో చినజీయర్ పాల్గొని సందేశం ఇచ్చారు. మనుషుల్లో అంతర్లీనమైన ప్రేమ, సహోదర భా వం పెంపొందించడంతో పాటు మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ప్రతిచోట ఆలయాలు అవసరమని ఆయన తెలిపారు. వాల్మికితో సంబంధం ఉన్న అతి ప్రాచీనమైన వల్మిడి రామాలయాన్ని దివ్య క్షేత్రంగా వెలుగొందేలా మంత్రి దయాకర్‌రావు చేసిన కృషి అభినందనీయమన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రికి దీటుగా వల్మిడి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ముందుగా వేదమంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల విగ్రహాన్ని జీయర్ స్వామి ప్రతిష్టించారు. అనంతరం ఆలయంలోని ఇతర విగ్రహాలను, ఆలయ గోపురంపై కలశాన్ని ప్రతిష్టించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండల కేంద్రంలోని సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమ నాథుడి స్మృతి వనం, కల్యాణ మండపం, హరిత హోటల్, గిరిజన భవన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment