సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసులో తెర వెనుక కొన్ని అదృశ్యశక్తులు సీఐడీ దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు సమాచారం. 2016 నుంచి 2019 మధ్య బినామీ ఆస్తుల వ్యవహారంలో అప్పటి దర్యాప్తు అధికారులు వ్యవహరించిన తీరు వివాదాస్పదం కాగా, తాజాగా ఇద్దరు ప్రజాప్రతినిధులు సీఐడీపై ఒత్తిడి తేవడం మళ్లీ వివాదాస్పదమైంది.
అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు వెనకున్న అదృశ్యశక్తులు ఎవరనేది సీఐడీ అధికారులను కలవరపెడుతోంది. బినామీ ఆస్తులు, వాటి సర్వే నంబర్లు, బినామీ కంపెనీల డైరెక్టర్లు.. ఇలా అనేక విషయాలపై క్లారిటీ ఇవ్వాలని సీఐడీ నోటీసులిచ్చి విచారిస్తున్న తరుణంలో ఇద్దరు ప్రజాప్రతినిధులు పోలీస్ పెద్దలను కలసి ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కేసు పునర్విచారణ ఎటు వెళ్తుంది? ఏం జరుగుతుంది?అన్నదానిపైఅయోమయం నెలకొంది. అసలు ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులకు అవ్వా వెంకటరామారావుకు ఉన్న సంబం ధం ఏంటన్నదానిపై సీఐడీలో చర్చ సాగుతోంది.
బినామీ ఆస్తులకోసమేనా?..
బినామీ ఆస్తుల కొనుగోలు కోసమే సదరు ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు సీఐడీ అనుమానిస్తోంది. మహబూబ్‌నగర్‌లో 156 ఎకరాలు, మరో 76 ఎకరాల వ్యవహారంలో ఓ మాజీ కానిస్టేబుల్ బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈయనకోసం కూడా ఆ ప్రజాప్రతినిధులు పోలీస్ పెద్దలను ప్రభావితం చేయాలని చూశారని సమాచారం.
అగ్రిగోల్డ్ కేసులో ఇప్పటివరకు అటాచ్‌మెంట్ కానీ వందల ఎకరాల భూమిని వీరు బినామీ పేర్ల మీద కొనుగోలు చేస్తున్నారని సీఐడీ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఆస్తుల కోసమే ప్రజాప్రతినిధులు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అవునని, లేదని...
అగ్రిగోల్డ్ ఆస్తులు, బినామీ కంపెనీల పేరిట కొనుగోలు చేసిన భూముల వ్యవహారంపై ఆ సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరామారావుతో పాటు మరో ఇద్దరు డైరెక్టర్లను సీఐడీ రెండుసార్లు ప్రశ్నించింది. బినామీ భూములను ఇతర రాష్ట్రాల పోలీసులు అటాచ్ చేశారా అని ప్రశ్నించగా, అవునని ఒకసారి.. లేదని రెండోసారి చెప్పినట్లు సీఐడీ వెల్లడించింది.
బినామీ ఆస్తుల విషయాన్ని గోప్యంగా ఉంచడంతో పాటు కొన్నిచోట్ల అటాచ్‌మెంట్ చేయకుండా అగ్రిగోల్డ్ పెద్దలే లాబీయింగ్ జరిపినట్లు సీఐడీ తాజా విచారణలో బయటపడినట్లు తెలిసింది. అవ్వా.. పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక దర్యాప్తు విభాగాలకు సీఐడీ లేఖలు రాసింది. ఆయా రాష్ట్ర ప్రభుత్వా లు తెలంగాణలోని అగ్రిగోల్డ్ ఆస్తులు, బినామీ కంపెనీల పేర్ల మీద ఉన్న భూములను అటాచ్ చేస్తే వాటి జీవోలు పంపాలని కోరింది.
మూడేళ్లు పట్టించుకోలేదు..
అగ్రిగోల్డ్ బినామీ కంపెనీల భూములను అటాచ్‌మెంట్ చేయకుండా వ్యవహరించిన గత దర్యాప్తు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా.. పోలీస్ పెద్దలు స్పందించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. బినామీ ఆస్తులను గుర్తించకుండా మూడేళ్లు వృథా చేయడం.. తీరా ఆస్తులు బదిలీ అయిన తర్వాత నోటీసులివ్వడం, హడావుడి చేయడంపై ఉన్నతాధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment